ఇడ్లీ,దోశల్లోకి ఈ పచ్చడిని మంచినది లేదబ్బా..నెయ్యితో కలిపి తింటుంటే స్వర్గం కనబడుతుంది

Posted By:

రోజూ పొద్దున్నే అవే కొబ్బరి, పల్లీల, టమాటా పచ్చడ్లు తిని తిని చిరాకు వచ్చేసిందా? ఇడ్లీ, దోశల రుచిని రెట్టింపు చేసే సరికొత్త, కారం కారంగా ఉండే పచ్చడి కోసం మీ నాలుక తహతహలాడుతోందా? అయితే ఘాటైన రుచితో కట్టిపడేసే వేయించిన వెల్లుల్లి టమాటా పచ్చడి చేసి తీరాల్సిందే.

ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో మనల్ని చుట్టుముట్టే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఇది సహజసిద్ధమైన రక్షణ కల్పిస్తుంది. దీనిని తయారుచేయడం చాలా సులభం. వేడివేడి ఇడ్లీలపై ఈ పచ్చడి వేసుకుని తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. కరకరలాడే దోశలోకి, మెత్తటి ఊతప్పంలోకి కూడా ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. ఈ నోరూరించే పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు
టమాటాలు - 2
ఎండు మిరపకాయలు -7
చింతపండు -నిమ్మకాయంత
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పోపు కోసం:
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - ఒక రెబ్బ
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ లేదా పొయ్యి మీద బాండీ పెట్టి అందులో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక ఎండు మిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద వేయించాలి. వెల్లుల్లి బంగారు గోధుమ రంగులోకి మారి మంచి సువాసన వచ్చేవరకు వేయించి, వాటిని ఒక ప్లేటులోకి తీసుకోవాలి.

-ఇప్పుడు అదే బాండీలో తరిగిన టమాటా ముక్కలు, చింతపండు వేయాలి. టమోటాలు మెత్తబడి, పచ్చి వాసన పోయి, పై తొక్క కొద్దిగా రంగు మారేవరకు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి, ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, మగ్గించిన టమాటా-చింతపండు మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నీళ్లు పోయకుండా, మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి.

-ఇప్పుడు పచ్చడికి తాలింపు కోసం.. అదే బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేశాక ఆవాలు, మినపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. అవి వేగాక తుంచిన ఎండు మిరపకాయలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి.

-ఘుమఘుమలాడుతున్న ఈ తాలింపును నేరుగా పచ్చడి గిన్నెలో వేసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లి బాగా కలపాలి. అంతే కారం కారంగా, పుల్ల పుల్లగా, ఘాటైన రుచితో అద్భుతమైన వేయించిన వెల్లుల్లి టమాటా పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 29, 2025, 20:01 [IST]
Desktop Bottom Promotion