మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా స్కిన్ క్యాన్సర్ సంకేతమే?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ లో అనేక రకాలు ఉంటాయి. లంగ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని అనేక రకాలు ఉన్నాయి. అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాల్లో స్కిన్ క్యాన్సర్ ఒకటి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలకు(UV) గురికావడం, వడదెబ్బ, కుటుబంలో ఎవరికైనా స్కిన్ క్యాన్సర్ చరిత్ర ఉండటం, పుట్టుమచ్చలలో వచ్చే అసాధారణ మార్పులు, ఎండ తగలగానే కమిలిపోయే లేదా పుండ్లు పడే చర్మం ఉన్నవారికి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్కిన్ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడం ముఖ్యమని డాక్టర్లు తెలిపారు. ముందుగానే గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి చర్మంపై ఏ చిన్న మార్పుని కూడా నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం శరీరంలో ఏ మార్పులు వస్తే స్కిన్ క్యాన్సర్ ఉందని అర్థం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

are these changes appearing on your skin it could be skin cancer

చర్మ క్యాన్సర్ సంకేతాలు

పుట్టుమచ్చల్లో మార్పులు
ప్రతి వ్యక్తి శరీరంలోని ఏదో ఒక ప్లేస్ లో పుట్టుమచ్చలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇదివరకు ఉన్న పుట్టుమచ్చ పరిమాణంలో గానీ లేదా ఆకారంలో అయినా లేదా రంగులో అయినా సరే ఏదైనా మార్పు వచ్చిందంటే అది చర్మ క్యాన్సర్ సంకేతం అవొచ్చు. కాబట్టి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ కు చూపించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..తద్వారా స్కిన్ క్యాన్సర్ వంటిది ఏదైనా ఉంటే ప్రారంభంలోనే దానికి చెక్ పెట్టడం సాధ్యపడుతుంది.

నయం కాని పుండ్లు
మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో దెబ్బలు తగులుతుంటాయి..ఇదే సమయంలో పండ్లు కూడా పడుతుంటాయి. ఏదైనా గీక్కున్నప్పుడు లేదా ఎక్కడైనా జారి పడినప్పుడు మరేదైనా సందర్భంలో గానీ శరీరంపై పండ్లు పడటం కామన్. అయితే చేతులమీద గానీ, మొఖంపైన గానీ, చెవులు లేదా మెడపై పండ్లు పడి అవి వారాలు,నెలల తరబడి మానకపోతే మాత్రం అది ప్రమాదకరమైన సంకేతం కావొచ్చు. మీకు స్కిన్ క్యాన్సర్ ఉందని సూచించే సంకేతాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తాల్సిందే.

గోర్ల కింద నల్లటి గీతలు
సూర్యరశ్మి తలగలని అరచేతులు, అరికాళ్లు లేదా గోళ్ల కింద నల్లటి గీతలు మాదిరి ఏదైనా కనిపిస్తే వెంటనే సంబంధిత డాక్టర్ కి చూపించుకోవాలి. వాళ్లు మీ గోళ్లని పరిశీలించి అవసరమైన టెస్టులు చేసి అది చర్మ క్యాన్సర్ సంకేతమా లేదా మరేదైనా సమస్య అనేది తెలియజేస్తారు. దీనికి తగిన ట్రీట్మెంట్ ని కూడా సూచిస్తారు.

ఎర్రటి మచ్చలు
చర్మంపై దురద, రక్తస్రావం అయ్యే మచ్చలు లేదా ఎర్రటి గడ్డలు కూడా స్కిన్ క్యాన్సర్ సంకేతం కావచ్చు. చర్మంపై పొలుసుగా లేదా గరుకుడా ఉండే మచ్చల విషయంలో అజాగ్రత్త చేయకుండా హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలి.

కుటుంబంలో ఎవరికైనా ఉంటే
మీ కుటుంబంలో గతంలో ఎవరికైనా స్కిన్ క్యాన్సర్ ఉండి ఉన్నా లేదా మీకేమైనా గతంలో వడదెబ్బ తగిలి ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అది స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

పుట్టుమచ్చల్లో దురద లేదా నొప్పి
అకస్మాత్తుగా దురద, నొప్పి లేదా సున్నితంగా మారే పుట్టుమచ్చలను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దు. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోండి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి
-సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సూర్యడి తీవ్రమైన కిరణాలు ఉంటాయి..ఈ టైంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.

-ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు సన్ ప్రొటెక్షన్ కళ్లద్దాలు, నెత్తికి టోపీ, పొడవాటి చేతుల చొక్కాలు వంటివి మెయింటెన్ చేయాలి.

-ఎండలో బయటకు వెళ్లేటప్పుడు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ని ఉపయోగించడం మంచిది. ప్రతి 2 గంటలకొకసారి లేదా నీటిలో తడిసిన తర్వాత అప్లై చేయాలి.

-మీ స్కిన్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకోండి. ఏ చిన్న మార్పు వచ్చినా డాక్టర్ ని కలవండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, April 10, 2025, 18:10 [IST]
Desktop Bottom Promotion