60 ఏళ్ల లోపే గుండెపోటును అడ్డుకోవాలా? ప్రముఖ కార్డియాలజిస్ట్ సూచిస్తున్న 10 బ్రహ్మాస్త్రాలివే

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గుండెపోటు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతున్న అతిపెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే ప్రధాన కారణం. చాలామంది గుండెనొప్పి లేదా ఇతర లక్షణాలు కనిపించిన తర్వాతే అప్రమత్తం అవుతుంటారు.

Stop Waiting for Symptoms Top 10 Cardiologist Approved Tips to Prevent Heart Attacks Before 60

కానీ ప్రమాదం ముంచుకొచ్చే దాకా వేచి చూడటం కంటే, ముందుగానే జాగ్రత్త పడటం ఎంతో వివేకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు) డాక్టర్ ఇవాన్ లెవిన్ 60 ఏళ్ల వయస్సు రాకముందే గుండెపోటు దరిచేరకుండా కాపాడుకునేందుకు 10 అద్భుతమైన, ఆచరణాత్మకమైన నివారణ చర్యలను సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.

పొగతాగడం, డ్రగ్స్‌కు గుడ్‌ బై చెప్పండి
గుండెకు అతిపెద్ద బద్ధ శత్రువు ధూమపానం. ఇది రక్తనాళాలను దెబ్బతీసి, రక్తపోటును పెంచుతుంది. పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే, కొకైన్ లాంటి డ్రగ్స్ ఎంతటి ఆరోగ్యవంతులనైనా క్షణాల్లో బలితీసుకుంటాయి. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

జంక్ ఫుడ్, తీపి పానీయాలకు చెక్ పెట్టండి
కూల్ డ్రింక్స్, సోడాలు వంటి అధిక చక్కెర ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ మన ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు. వీటిలోని అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, చక్కెర... ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు నేరుగా దారి తీస్తాయి.

వ్యాయామాన్ని దినచర్యగా మార్చుకోండి
గుండె పదిలంగా ఉండాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. కార్డియో, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె కండరాలను ఉక్కులా బలోపేతం చేస్తాయి.

కాల్షియం స్కాన్ తో ముందస్తు రక్షణ
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కాల్షియం పేరుకుపోయిందో లేదో తెలిపే 'కరోనరీ ఆర్టరీ కాల్షియం (CAC) స్కాన్' చేయించుకోవడం అత్యుత్తమం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ఈ పరీక్ష చేయించుకోవాలి. స్కోరు 100 దాటితే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి.

ఒత్తిడిని జయించండి
దీర్ఘకాలిక ఒత్తిడి గుండెపై తీవ్ర భారం వేస్తుంది. ఆఫీసు, వ్యక్తిగత ఒత్తిళ్లను అదుపులో ఉంచుకోవాలి. ఇష్టమైన సంగీతం వినడం, ధ్యానం చేయడం, అభిరుచులపై సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.

బీపీ, షుగర్
అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి లోపల ఉండి రక్తనాళాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తాయి. క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ, మందులు వాడటం తప్పనిసరి.

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి
ముఖ్యంగా పొత్తికడుపు (బెల్లీ ఫ్యాట్) చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రమాదకరం. ఇది మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తుంది. జీవనశైలి మార్పులతో బరువు తగ్గడం గుండెకు శ్రీరామరక్ష.

అర్హత లేని వారి సలహాలు వినకండి
ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్లు చెప్పే చిట్కాలను గుడ్డిగా నమ్మకండి. గుండె సంబంధిత సమస్యలకు కేవలం అర్హత కలిగిన హృద్రోగ నిపుణుల (కార్డియాలజిస్ట్) సలహాలు మాత్రమే పాటించండి.

మద్యపానానికి హద్దులు పెట్టుకోండి
రోజుకు ఒక గ్లాసు వైన్ లాంటి మితమైన అలవాటు ఫర్వాలేదు కానీ, మోతాదు మించి మద్యం సేవించడం వల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది.

లక్షణాల కోసం వేచి చూడకండి
గుండెపోటు రాత్రికి రాత్రే రాదు, దశాబ్దాల అనారోగ్యకర అలవాట్ల ఫలితమే అది. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే ముప్పును 100 శాతం అడ్డుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, July 2, 2026, 18:32 [IST]
Desktop Bottom Promotion