Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం!
నెలసరి లేదా పీరియడ్స్.. ప్రతి మహిళ జీవితంలో ఇది ఒక సాధారణ ప్రకృతి సహజమైన ప్రక్రియ. కానీ ప్రతినెలా ఆ ఐదు రోజులు చాలా మంది మహిళలకు నరకంలా అనిపిస్తాయి. తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, నడుం నొప్పి, కండరాల తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్.. ఇలా ఎన్నో సమస్యలు ఆ సమయంలో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

నెలసరి నొప్పులను భరించలేక చాలామంది వెంటనే పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వేసుకుంటుంటారు. అయితే, ప్రతి నెలా మందులు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వాటి వల్ల భవిష్యత్తులో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
నిజానికి, పీరియడ్స్ నొప్పులను తగ్గించుకోవడానికి మెడిసిన్స్ కన్నా మనం తినే ఆహారం, మనం చేసే పనులే చాలా అద్భుతంగా, పవర్ ఫుల్‌గా పనిచేస్తాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని చిన్నపాటి జీవనశైలి మార్పులు ఈ సమయంలో మీకు దివ్యౌషధంలా పనిచేస్తాయని తెలంగాణకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ మేడ తెలిపారు. మరి ఆ స్పెషల్ డైట్ ఏంటి? ఆ ఐదు రోజుల్లో మీరు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో డాక్టర్ గ్రీష్మ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.
పీరియడ్స్ సమయంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలు
మన వంటగదిలోనే ఎన్నో అద్భుతమైన ఔషధాలు దాగి ఉన్నాయి. మీ ప్లేట్ లో సరైన ఆహారం ఉంటే, పీరియడ్స్ నొప్పిని సగానికి పైగా తగ్గించుకోవచ్చు.
అల్లం, పసుపు - నొప్పిని లాగేసే నేచురల్ పెయిన్ కిల్లర్స్
పీరియడ్స్ సమయంలో గర్భాశయం సంకోచించడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. దీనికి కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని కెమికల్స్. అల్లం టీ తాగడం వల్ల ఈ పెయిన్-కారణమయ్యే కెమికల్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. అల్లం ఒక అద్భుతమైన యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్.
ఇక పసుపు విషయానికి వస్తే, ఇందులో ఉండే 'కర్కుమిన్' (Curcumin) అనే అద్భుతమైన సమ్మేళనం ఒంటి నొప్పులను, వాపులను ఇట్టే తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో లేదా పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే నడుం నొప్పి, కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నట్స్, సీడ్స్- కండరాలకు రిలాక్సేషన్
బాదం పప్పులు, వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు.. ఇవన్నీ పీరియడ్స్ టైమ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం అనేది గర్భాశయ కండరాలను రిలాక్స్ చేసి, క్రాంప్స్ (నొప్పులు) రాకుండా అడ్డుకుంటుంది. రోజువారీ డైట్‌లో గుప్పెడు నట్స్ తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన శక్తి, ఉపశమనం రెండు దొరుకుతాయి.
పండ్లు - ఉబ్బరానికి చెక్
పీరియడ్స్ అనగానే చాలా మందికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీనికి అరటిపండు అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండులో విటమిన్ B6, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను, బ్లోటింగ్‌ను తగ్గిస్తాయి. అలాగే బొప్పాయి పండు తినడం వల్ల గర్భాశయ కండరాలు సడలి, రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి, నీరసాన్ని దూరం చేస్తాయి.
చేపలు- ఒమేగా 3 ఖజానా
మీరు నాన్ వెజ్ ఇష్టపడే వారైతే, పీరియడ్స్ సమయంలో సాల్మన్, జువ్వలు లాంటి చేపలను మీ ఆహారంలో చేర్చుకోండి. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో వాపు,నొప్పిని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి ఆ సమయంలో వచ్చే డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ నుండి కూడా బయటపడేలా చేస్తాయి.

నొప్పిని తరిమికొట్టేందుకు చేయాల్సిన పనులు
నొప్పిగా ఉందని రోజంతా మంచం మీదే పడుకుంటే నొప్పి మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. శరీరాన్ని కాస్త కదిలిస్తే, నొప్పులు వాటంతట అవే తగ్గుముఖం పడతాయి.
యోగాసనాలు
పీరియడ్స్ సమయంలో కఠినమైన వ్యాయామాలు చేయకూడదు కానీ తేలికపాటి యోగా చాలా మంచిది. ముఖ్యంగా క్యాట్ కౌ పోజ్ (Cat-Cow Pose మార్జాలాసనం) చేయడం వల్ల వెన్నెముక, పొత్తికడుపు కండరాలకు మంచి మసాజ్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బాలాసనం (Child's Pose) వేయడం వల్ల నడుం కింది భాగం, హిప్స్ రిలాక్స్ అవుతాయి. ఇది నడుం నొప్పిని మాయం చేయడమే కాకుండా, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
తేలికపాటి నడక
ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. నడక వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు నుండి ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి మన శరీరానికి సహజమైన పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయి.
హాట్ ప్యాక్
నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు పొత్తికడుపు మీద, నడుం మీద హాట్ ప్యాక్ (హీటింగ్ ప్యాడ్) పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. వేడి తగలడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి, ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల బిగుసుకుపోయిన కండరాలు వదులై, నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది.
గోరువెచ్చని నీటితో స్నానం
బాగా నీరసంగా, ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇది మీ శరీరంలోని ప్రతి కండరాన్ని రిలాక్స్ చేస్తుంది. వీలైతే ఆ నీటిలో కాస్త ఎప్సమ్ సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే నొప్పులన్నీ మాయమైపోయి, రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది.
వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
మనం తీసుకునే కొన్ని ఆహారాలు, చేసే పనులు పీరియడ్స్ నొప్పిని మరింత రెట్టింపు చేస్తాయి. ఆ ఐదు రోజులు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి:
కాఫీ, టీలకు నో చెప్పండి
తలనొప్పిగా ఉందని పదే పదే కాఫీ, టీలు తాగుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే. ఇందులో ఉండే కెఫిన్ రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ తగ్గి, నొప్పి మరింత తీవ్రమవుతుంది. దానికి బదులు గ్రీన్ టీ తాగండి.
ఉప్పు, చక్కెరలు తగ్గించండి
ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో నీరు చేరి కడుపు మరింత ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాగే స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి, ఎనర్జీ క్రాష్ అవుతుంది. ఇది మూడ్ స్వింగ్స్‌ను, చికాకును పెంచుతుంది.
బరువులు ఎత్తడం, రన్నింగ్ వద్దు
పీరియడ్స్ సమయంలో శరీరం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఈ సమయంలో బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం లాంటి కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. ఇవి పొత్తికడుపుపై విపరీతమైన ఒత్తిడిని పెంచి నొప్పిని ద్విగుణీకృతం చేస్తాయి. శరీరం అడిగేది విశ్రాంతి, దాన్ని ఇవ్వండి.
నెలసరి అనేది ఒక అనారోగ్యం కాదు. అది మహిళల ఆరోగ్యానికి, మాతృత్వానికి ప్రతీక. ఆ సమయంలో వచ్చే నొప్పులను చూసి భయపడాల్సిన పనిలేదు, మందుల మీద ఆధారపడాల్సిన అవసరమూ లేదు. సరైన పోషకాహారం తీసుకోవడం, శరీరానికి తగినంత విశ్రాంతినిస్తూనే తేలికపాటి వ్యాయామాలు చేయడం ద్వారా పీరియడ్స్ సమయాన్ని కూడా మీరు చాలా సంతోషంగా, ఉల్లాసంగా గడపవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications