కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?

థైరాయిడ్ సమస్య ఉన్నట్లు నిర్ధారణ కాగానే, అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న..ఏం తినాలి? ఏం తినకూడదు?. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు, చిప్స్ లేదా స్వీట్లు తినాలనిపిస్తుంది. కానీ అవి తింటే బరువు పెరిగిపోతామేమో, థైరాయిడ్ లెవల్స్ ఎక్కడ హెచ్చుతగ్గులకు లోనవుతాయో అన్న భయం బాధితులను వెంటాడుతుంది.

ఇలాంటి గందరగోళానికి చెక్ పెడుతూ, థైరాయిడ్ బాధితుల పాలిట ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి దొరికింది. అదే మఖానా. థైరాయిడ్ ఉన్నవారు మఖానాను తమ రోజువారీ డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలో ఇక్కడ చూడండి.

What to Eat When You Have Thyroid The Makhana Solution

గోయిట్రోజెన్స్ భయం అస్సలు వద్దు

థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువగా భయపడేది పచ్చి క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ, సోయాబీన్స్ వంటి వాటిలో ఉండే గోయిట్రోజెన్స్ గురించి. వీటిని పచ్చిగా తింటే శరీరం అయోడిన్‌ ను గ్రహించలేక, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది (వీటిని బాగా ఉడికించి తింటే ప్రమాదం ఉండదు). కానీ మఖానా విషయానికి వస్తే.. ఇది గోయిట్రోజెనిక్ ఆహారాల జాబితాలోకి రాదు. కాబట్టి హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం.. సమస్య ఏదైనా సరే ఎలాంటి భయం లేకుండా మఖానాను లాగించేయవచ్చు.

నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న కొత్త ఫిట్‌ నెస్ ట్రెండ్!నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న కొత్త ఫిట్‌ నెస్ ట్రెండ్!

బరువు పెరుగుతామన్న బెంగ లేదు

హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్య. ఏదైనా చిరుతిండి తినాలనిపించినప్పుడు జంక్ ఫుడ్‌కి బదులుగా కొద్దిగా నెయ్యి, మిరియాల పొడి వేసి రోస్ట్ చేసిన మఖానా తినడం చాలా ఉత్తమం. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది, అనవసరంగా బరువు పెరగరు.

పోషకాలకు కేరాఫ్ అడ్రస్

మఖానా కేవలం కడుపు నింపడమే కాదు, ఇది పోషకాల గని కూడా. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు శరీర జీవక్రియలను (మెటబాలిజం) చురుకుగా ఉంచి, శరీరం ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉండేలా చేస్తాయి.

వాపులను తగ్గించే సంజీవని

ఆటోఇమ్యూన్ థైరాయిడ్ సమస్యల వల్ల శరీరంలో వచ్చే వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో మఖానా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెంప్ఫెరోల్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.. థైరాయిడ్ గ్రంథి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. అంతేకాదు ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్‌ గా పనిచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇది ముఖ్యంగా..
మఖానా ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ మఖానా తిన్నంత మాత్రాన థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి అమాంతం పెరిగిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయాలంటే మన శరీరానికి అయోడిన్ చాలా అవసరం. కాబట్టి కేవలం మఖానాపైనే ఆధారపడకుండా.. అయోడైజ్డ్ ఉప్పు, గుడ్లు, చేపలు, సముద్రపు ఆహారం, పాలు, పెరుగు వంటి అయోడిన్ లభించే పోషకాహారాన్ని కూడా మీ డైట్‌ లో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, September 15, 2026, 20:11 [IST]
Desktop Bottom Promotion