తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు!

పుట్టిన ప్రతీ బిడ్డకు తల్లిపాలు అత్యంత సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన ఆహారం. తల్లి పాలలోని రోగనిరోధక వ్యవస్థను బలపరిచే పోషకాలు, యాంటీయాక్సిడెంట్లు శిశువుకు మొదటి దశ నుంచి చాలా కీలకం. అందుకే ప్రతి యేటా ఆగష్టు 1 నుంచి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకొంటారు. ఈ మేరకు దీని ప్రాముఖ్యతపై తల్లులలో అవగాహన కల్పించడం, శిశువుల ఆరోగ్యం ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

World Breastfeeding Week 2026 Important things every mother should know

తల్లిపాల ప్రయోజనాలు

బిడ్డకు తల్లిపాలు పట్టడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంక్రమణ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. శారీరకంగా, మానసికంగా పిల్లలు ఆరోగ్యకరంగా ఉండగలరు. తల్లి పాలు ఇవ్వడం ద్వారా ఆమెలో గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు. రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. తల్లీబిడ్డల మధ్య భావోద్వేగంగా బంధం బలంగా ఉంటుంది.

బిడ్డ పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తామో, కన్న తల్లి ఆరోగ్యంపైనా అంతే శ్రద్ధ వహించాలి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బాలింతల శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుంది.. ఆమెకు కుటుంబీకులు మద్దతు ఎలా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. తల్లీబిడ్డ ఆరోగ్యకరంగా ఉండేలా వారి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకుందాం..

సమతుల్య ఆహారం

బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి పాలు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. అంతేకాకుండా నవజాత శిశువు కడుపు నిండా తీసుకునేలా తల్లికి పుష్కలంగా రావాలి. ఇందుకోసం తల్లి బలంగా, హెల్తీగా ఉండాలి. ఆమె తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, నట్స్‌ తీసుకోవడం తప్పనిసరి. సీజనల్‌ వెజిటబుల్స్‌, పండ్లు డాక్టర్ల సలహా మేరకు ఇవ్వాలి.

World Breastfeeding Week 2026 Important things every mother should know

సరైన మోతాదులో నీరు

పాలిచ్చే సమయంలో తల్లి శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. ఈ క్రమంలో ఆమె రోజుకి కనీసం 3 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. దీని ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యకరంగా ఉంటారు.

విశ్రాంతి

బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి చాలా వరకు నిద్ర కరవవుతుంది. రోజులో ఎక్కువసార్లు పాలివ్వడం, ఏడుస్తుంటే మేల్కొని ఉండటం వీటి వల్ నిద్ర లేమి ఏర్పడుతుంది. దీంతో అలసటకి గురవుతారు. ఈ క్రమంలో బిడ్డ నిద్రపోయినప్పుడు తల్లికి తప్పనిసరిగా విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడి

నిద్ర లేమి, డీహైడ్రేషన్‌, శారీరక, మానసిక మార్పులు ఇలా పలు కారణాల వల్ల తల్లి ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటుంది. ఇది పాల ఉత్పత్తి ప్రక్రియపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ మేరకు తల్లి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆమెకు ధైర్యాన్ని కలిగిస్తూ కుటుంబీకులు మద్దతు ఇస్తుండాలి.

డాక్టర్ల సలహా

పాలిచ్చే తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ల సలహా లేకుండా మందులు తీసుకోకూడదు. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి. తల్లి పాలిచ్చేటప్పుడు కొన్ని మందులు తీసుకోకూడదు. ఈ క్రమంలో వైద్యుల సలహా తప్పనిసరి. బాలింతలు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. లేదంటే పాల ఉత్పత్తి, పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. రొమ్ము పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. తల్లికి పౌష్టికాహారం ఇస్తూ, ఇంటి పనుల్లో సహాయం చేస్తూ కుటుంబీకులు మద్దతు ఇవ్లాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, August 4, 2026, 12:34 [IST]
Desktop Bottom Promotion