మీది స్ట్రాంగ్ మైండ్ సెట్టా? లేక ఇన్సెక్యూర్ మైండా? ఇలా టెస్ట్ చేసుకోండి

ఈ రోజుల్లో బయటికి ఎంతో ఆత్మవిశ్వాసంతో, నవ్వుతూ కనిపించే చాలామంది లోపల ఎన్నో భయాలతో, అభద్రతా భావంతో(insecurity) బతుకుతున్నారు. మనం జీవితంలో ఎదుగుతున్నామా లేదా అనేదాని కంటే పక్కవారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నామా అనే భయం చాలామందిని పట్టిపీడిస్తోంది.

Are You a Secure or Insecure Person A Therapist Advice to Overcome Insecurity

అయితే మనలో ఈ అభద్రతా భావం ఉందా? మనం ఇన్సెక్యూర్ పర్సనా లేక సెక్యూర్ పర్సనా అనేది ఎలా తెలుసుకోవాలి? ఈ విషయంపై ప్రముఖ సైకాలజిస్ట్, థెరపిస్ట్ విజయ పెద్దిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో ద్వారా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె తెలిపిన ఆ ఐదు ప్రధాన లక్షణాలను, వాటికి సంబంధించిన మానసిక శాస్త్ర అధ్యయనాలను (Psychological Studies) జోడించి ఇక్కడ విపులంగా తెలుసుకుందాం.

ఇన్సెక్యూరిటీ (అభద్రతా భావం) ఉన్నవారిలో కనిపించే 5 ప్రధాన లక్షణాలు

జడ్జింగ్, క్రిటిసిజం (ఎప్పుడూ ఇతరులను విమర్శించడం)
ఇన్సెక్యూర్ వ్యక్తుల మొదటి లక్షణం ఇతరులలో తప్పులు వెతకడం. ఎవరైనా సంతోషంగా ఉన్నా, విజయాలు సాధిస్తున్నా వీరు తట్టుకోలేరు. వాళ్లు ఇలా ఉన్నారు, వీళ్లు అలా ఉన్నారు అంటూ వెంటనే జడ్జ్ చేస్తుంటారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం ద్వారా, తమను తాము గొప్పవారిగా ఊహించుకుంటూ మానసిక ఆనందాన్ని పొందుతారు.

మానసిక శాస్త్రం ఏం చెబుతోంది?: సైకాలజీలో దీనిని ప్రొజెక్షన్ (Projection) అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతాల ప్రకారం..తమలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి, తమపై తమకు ఉన్న కోపాన్ని ఇతరులపై విమర్శల రూపంలో చూపిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Take a Poll

అసూయ, నిరంతరం పోల్చుకోవడం)
తమ జీవితాన్ని ఎప్పుడూ ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం ఇన్సెక్యూరిటీకి అతిపెద్ద సంకేతం. వాళ్లకు ఆ ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు.. వాళ్ల కారు నా కారు కంటే ఖరీదైనది అంటూ ప్రతి చిన్నదానికీ పోల్చుకుంటారు. ఈ పోలికల్లో తాము తక్కువ అనిపిస్తే కుంగిపోతారు, ఎక్కువ అనిపిస్తే అహంకారంతో ఫీల్ అవుతారు. ఈ రెండూ అభద్రతా భావానికి నిదర్శనాలే.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? 1954లో ప్రముఖ సైకాలజిస్ట్ లియోన్ ఫెస్టింగర్ ప్రతిపాదించిన సోషల్ కంపారిజన్ థియరీ ప్రకారం.. మనుషులు తమ విలువను అంచనా వేసుకోవడానికి ఇతరులతో పోల్చుకుంటారు. కానీ ఇన్సెక్యూర్ వ్యక్తులు ఈ పోలికలను విపరీత స్థాయికి తీసుకెళ్లి మానసిక ప్రశాంతతను కోల్పోతారని స్పష్టమైంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఈ లక్షణం 60 శాతం మంది యువతలో పెరిగిందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ తాజా సర్వేలు వెల్లడించాయి.

Are You a Secure or Insecure Person A Therapist Advice to Overcome Insecurity

శాసించడం, మభ్యపెట్టడం

ఇన్సెక్యూరిటీ ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, వ్యక్తులను ఎప్పుడూ తమ కంట్రోల్ లో ఉంచుకోవాలి అనుకుంటారు. అందరూ నేను చెప్పినట్లే వినాలి, నేనే రైట్ అనే ధోరణిలో ఉంటారు. తప్పు చేసినా ఒప్పుకోరు సరికదా అవతలివారిదే తప్పు అన్నట్లు తిమ్మిని బమ్మి చేసి నమ్మిస్తారు (దీనినే గ్యాస్‌ లైటింగ్ అంటారు).

డామినేటింగ్, ప్రాధాన్యత కోరుకోవడం
నలుగురు ఉన్న గదిలోకి వెళ్లినప్పుడు లేదా ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు అందరి దృష్టి తమ మీదే ఉండాలని వీరు బలంగా కోరుకుంటారు. డామినేటింగ్ పర్సన్ నేనే అవ్వాలి అనుకుంటారు. వేరే వాళ్లకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తుంటే వీరు ఏమాత్రం సహించలేరు. వెంటనే మాటల టాపిక్ మార్చేసి, తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం మొదలుపెడతారు. ఇది బయటికి కాన్ఫిడెన్స్ లా కనిపించినా, లోపల ఉన్న తీవ్రమైన ఇన్సెక్యూరిటీకి ఇది ఒక ముసుగు మాత్రమే.

చిన్న విషయాలకే తీవ్రంగా నొచ్చుకోవడం
అభద్రతా భావం ఉన్నవారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా క్యాజువల్ గా, సరదాగా అన్న మాటలను కూడా వీరు పర్సనల్ గా తీసుకుంటారు. నన్నే ఉద్దేశించి అన్నారేమో, నన్ను అవమానించడానికే అలా మాట్లాడారేమో అని అతిగా ఆలోచించి తీవ్రంగా ఫీల్ అవుతారు. చిన్న విమర్శను కూడా వీరు పాజిటివ్ గా తీసుకోలేరు.

మరి సెక్యూర్ పర్సన్ గా ఎలా మారాలి?
పైన చెప్పిన లక్షణాలలో ఏవైనా మీలో ఉన్నట్లు గుర్తిస్తే కంగారు పడకండి. మనం డీప్లీ ఇన్సెక్యూర్ అని గమనించుకుని, అక్కడి నుంచి మార్పు వైపు అడుగులు వేయడమే మొదటి విజయం. సెక్యూర్ పర్సన్ గా (మానసిక స్థైర్యం ఉన్న వ్యక్తిగా) మారడానికి థెరపిస్ట్ విజయ పెద్దిన చెప్పిన, అలాగే మానసిక నిపుణులు సూచించిన మార్గాలు ఇవే

మిమ్మల్ని మీరు అంగీకరించండి
ఈ భూమి మీద ఎవ్వరూ పర్ఫెక్ట్ కారు. అందరిలోనూ లోపాలు ఉంటాయి. మీరు మీలాగా, మీకు నచ్చినట్లు ఉండగలగడమే ఒక సెక్యూర్ పర్సన్ అత్యుత్తమ లక్షణం. మీ రంగు, మీ రూపం, మీ ఆర్థిక స్థాయి, మీ బలహీనతలు... ఇలా మీ గురించి ప్రతిదీ మనస్ఫూర్తిగా అంగీకరించండి. డాక్టర్ క్రిస్టిన్ నెంఫ్ చేసిన సెల్ఫ్ కంపాషన్ (స్వీయ కరుణ) అధ్యయనాల ప్రకారం, తమను తాము ప్రేమించుకునే వారు, ఇతరుల విమర్శలకు సులభంగా కృంగిపోరు. వారిలో యాంగ్జైటీ, డిప్రెషన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి.

సెల్ఫ్ గ్రోత్ పై దృష్టి పెట్టండి
మీ సమయాన్ని ఇతరుల జీవితాలను గమనించడానికి కాకుండా, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి వెచ్చించండి. నిన్నటి మీ కంటే ఈరోజు మీరు బెటర్ గా ఉన్నారా లేదా అనేది మాత్రమే చూసుకోండి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ద్వారా కాన్ఫిడెన్స్ ఆటోమెటిక్ గా పెరుగుతుంది.

ఇతరుల అభిప్రాయాలను వదిలేయండి
నేను ఇలా చేస్తే పక్కనోళ్లు ఏమనుకుంటారు?వాళ్లు నన్ను ఎలా జడ్జ్ చేస్తారు అనే ఆలోచనను ముందుగా పక్కన పెట్టండి. వాళ్లు ఎలా ఉన్నారు. ఏమనుకుంటున్నారనే వాటితో సంబంధం లేకుండా, హాయిగా మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండటమే నిజమైన స్వేచ్ఛ.

అభద్రతా భావం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే, అది శాశ్వతం కాదు. ఇతరులతో మనల్ని పోల్చుకోవడం ఆపేసి, మనలోని లోపాలను అంగీకరిస్తూ, మన ఎదుగుదల మీద మాత్రమే మనం దృష్టి పెట్టిన రోజున మనలో దాగి ఉన్న ఇన్సెక్యూరిటీ మాయమైపోయి, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో కూడిన సెక్యూర్ పర్సనాలిటీ బయటకు వస్తుంది.

Desktop Bottom Promotion