100 కి.మీ స్పీడ్ లో బస్సు..ఫోన్ లో లీనమైపోయిన డ్రైవర్, కండక్టర్..వైరల్ వీడియో చూడండి

మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజూ వందలాది ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే..మనం డబ్బులిచ్చి మృత్యు ఒడిలోకి ప్రయాణిస్తున్నామా? అనే భయం వెన్ను తట్టక మానదు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ ప్రెస్‌ వేపై రికార్డైన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియోలోని దృశ్యాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోవడం ఖాయం.

Eyes on the Phone Hands Off the Wheel Chilling Video of Private Bus Driver Goes Viral

వైరల్ వీడియోలో ఏముంది

ఒక ప్రైవేట్ బస్సు ఎక్స్‌ ప్రెస్‌ వేపై గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఆ వేగంలో కన్ను మూసి తెరిచేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ, ఆ బస్సు డ్రైవర్ స్టీరింగ్ వీల్‌ పై తన రెండు మోచేతులను ఆనించి, చేతుల్లో మొబైల్ పట్టుకుని అందులో వీడియోలు చూస్తూ పూర్తిగా లీనమైపోయాడు. మధ్యమధ్యలో కేవలం నామమాత్రంగా తల పైకెత్తి రోడ్డు వైపు చూస్తున్నాడు. అతనికి ఏమాత్రం తీసిపోనట్లు, పక్కనే ఉన్న కండక్టర్ కూడా రోడ్డును గమనించడం గానీ, ప్రయాణికులను పట్టించుకోవడం గానీ మానేసి, సీటులో పడుకుని తన ఫోన్‌ లో మునిగిపోయాడు.

అలంబాగ్‌ లో బస్సు ఎక్కి ఢిల్లీకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు ఈ ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేసి ఎక్స్ లో షేర్ చేశాడు. ఎక్స్‌ ప్రెస్‌ వే ఎక్కిన తర్వాత చాలా ప్రైవేట్ బస్సుల్లో ఇలాంటి నిర్లక్ష్యం సర్వసాధారణంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన జరిగిన కచ్చితమైన తేదీ, బస్సు ఏ ట్రావెల్స్‌కు చెందింది అనే వివరాలు తెలియకపోయినా, ఈ వీడియో మాత్రం డ్రైవర్ల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.

దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది చాలా భయానకం. బస్సులో మనం ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మన ప్రాణాలు ఇలా గాల్లో దీపాల్లా మారుతున్నాయన్నమాట. మన దేశంలో అన్నీ చాలా చౌకగా దొరుకుతాయి, కానీ మనిషి ప్రాణం కంటే చౌకైనది మరొకటి లేదని ఈ వీడియో నిరూపిస్తోంది అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి డ్రైవర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వందలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు ఇద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అని మరొకరు డిమాండ్ చేశారు. మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడాన్ని వారు తమ నైపుణ్యం అనుకుంటున్నారు, కానీ ప్రమాదం జరగకపోవడం కేవలం అదృష్టం మాత్రమే. అదృష్టం ప్రతిసారీ తలుపు తట్టదు కదా అని ఒక నెటిజన్ చురకలంటించారు.

అయితే, ఈ ఘటనలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... డ్రైవర్ అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా బస్సులోని ప్రయాణికులెవరూ అతన్ని నిలదీయకపోవడం. ప్రయాణికులుగా డ్రైవర్ ను హెచ్చరించాల్సిన బాధ్యత మనకు లేదా? ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం గొంతెత్తాలి అని ఒక యూజర్ వేసిన ప్రశ్న ఆలోచింపజేస్తోంది.

Story first published: Wednesday, July 8, 2026, 14:45 [IST]
Desktop Bottom Promotion