వర్షాకాలం.. జంటలకు రొమాంటిక్‌ సీజన్‌.. ఈ డేటింగ్‌ టిప్స్‌తో మరింత మధురం.!

ప్రేమ జంటలకు వర్షాకాలం రొమాంటిక్‌ సీజన్‌గా అభివర్ణిస్తారు. అందుకే సినిమాల్లో వర్షం పాటలకు అంతే క్రేజ్‌.. వర్షపు చినుకుల్లో భాగస్వామితో కలిసి సరదాగా గడపడమనేది ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకం. మరి వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో మీ పార్ట్‌నర్‌తో మరింత రొమాంటిక్‌గా గడుపుతూ తీపి స్మృతులను సంపాదించుకోవడానికి ఈ డేటింగ్‌ ఐడియాలను ట్రై చేయండి.

Make the rainy season romantic by these dating activities with your partner

వర్షాకాలం పగలు, సాయంత్రం సమయం ఏదైనా వాతావరణం చల్లగా ఉంటూ మనల్ని ఉత్తేజపరుస్తుంది. చిరుజల్లులు ముత్యాల్లా రాలుతూ జంటలను ఆహ్లాదపరుస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన వారు తమ బంధాన్ని మరింత రొమాంటిక్‌గా మార్చుకునేందుకు ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం ఉండదు. ఇక ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకంతో తమకంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోలేని భార్యాభర్తలకు ఈ కాలంలో కాస్తంత టైం మీ ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నించండి.

Make the rainy season romantic by these dating activities with your partner

వేడివేడిగా టీ, స్నాక్స్‌

చిరుజల్లులు పడుతూ ఉంటే ఇంటి బాల్కనీలో కూర్చుని మీ భాగస్వామితో వేడి టీ లేదా కాఫీ ఆస్వాదిస్తూ ఘాటుగా బజ్జీ, పకోడీ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శారీరకంగానే కాదు మానసికంగానూ ప్రశాంతత లభిస్తుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి ఇది సరైన అవకాశం. ఈ సమయాన్ని సంతోషం పంచే విషయాలు షేర్‌ చేసుకుంటూ మీ భాగస్వామికి మధురమైన జ్ఞాపకాన్ని ఇవ్వండి.

వర్షంలో నడక

సాయంత్రం సమయంలో చిన్నపాటి వర్షం పడుతున్నప్పుడు మీ పార్ట్‌నర్‌తో కాసేపు నడవండి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ భాగస్వామి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ రొమాంటిక్‌ సమయాన్ని ఫొటోల ద్వారా ఫోన్‌లో బంధించి మధురంగా దాచుకోండి.

Make the rainy season romantic by these dating activities with your partner

లాంగ్‌ డ్రైవ్‌

చినుకులు పడుతున్న సమయంలో మీ పార్ట్‌నర్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌ చేయడం మంచి రొమాంటిక్‌ ఫీల్‌ను ఇస్తుంది. మీ మధ్యను ప్రేమ పెరిగేలా చేస్తుంది. రహదారి అందాలు, వర్షపు చినుకుల అలజడి, కారులో వినసొంపైన సంగీతంతో ఆ వాతావరణాన్ని రొమాంటిక్‌గా మారుస్తుంది. మధ్యమధ్యలో ఏదైనా హోటల్‌ లేదా దాబాలో టీ లేదా కాఫీ, భోజనం చేస్తూ ఆ సమయాన్ని మరింతగా ఆస్వాదించండి. ట్రాఫిక్‌ ఉండే ప్రాంతాలు కాకుండా నగరాలకు దూరంగా ఇలాంటి ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

సినిమా ప్లాన్‌

వర్షంలో బయటకు వెళ్లడం ఇబ్బందిగా భావిస్తే.. ఆ చల్లని వాతావరణాన్ని ఇంట్లోనే ఆస్వాదించండి. మీ ఇద్దరికీ నచ్చిన రొమాంటిక్‌ సినిమా లేదా సిరీస్‌ చూస్తూ స్నాక్స్‌ తింటూ సరదాగా గడపండి. ఈ నాణ్యమైన సమయం మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.

కలిసి వంట చేయడం

ఈ బిజీ లైఫ్‌లో మీ పార్ట్‌నర్‌కి సమయం కేటాయించలేకపోతే.. ఈ వర్షాకాల సాయంత్రం మీకు సరిపోతుంది. మీ భార్య వంట చేస్తున్నప్పుడు సహాయం చేస్తూ కబుర్లు చెప్పండి. నచ్చిన వంటకం ఇద్దరూ కలిసి చేస్తూ నవ్వులను పంచుకోండి. ఇలాంటి అనుభూతి ఎంత డబ్బు ఖర్చు చేసినా దొరకదు.

వర్షాకాలంలో మీ ప్రత్యేక సమయంలో మీ ఇష్టాయిష్టాలను, ఆసక్తులను, కలలను, భవిష్యత్తు ప్రణాళికలను చర్చించుకోండి. హృదయపూర్వక సంభాషణ మీ గురించి మీ భాగస్వామికి పూర్తిగా అర్థమయ్యేలా చేస్తుంది. ఈ సమయంలో వారికి ఇష్టమైన చిన్న చిన్న వస్తువులతో సర్‌ప్రైజ్‌ చేయండి. ఇష్టమైన స్వీట్స్‌, పుస్తకాలు, చిన్న మొక్కలు, ప్రేమ ఉత్తరాలు వారి మనసును మధురంగా మార్చి మీ మధ్య బంధం మరింత రెట్టింపయ్యేలా చేస్తుంది.

Story first published: Wednesday, July 8, 2026, 12:53 [IST]
Desktop Bottom Promotion