Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
స్పేస్ లో వ్యోమగామికి అనారోగ్యం వస్తే? ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా..
ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, చంద్రుడిని చూస్తూ పెరిగిన మనలో చాలామందికి అంతరిక్ష ప్రయాణం ఒక తీరని కల. భూమిని వీడి, గురుత్వాకర్షణను జయించి ఆ సువిశాల విశ్వంలో తేలియాడే వ్యోమగాములను చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భారత్ కూడా తన గగన్ యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) ఉంది.. 20కి పైగా దేశాలకు చెందిన వ్యోమగాములు ఇప్పటివరకు దీనిని సందర్శించారు. అక్కడ నెలల తరబడి నివసిస్తూ శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తూ మానవజాతి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రెండు రోజుల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) చేరుకున్నారు. ISSకి చేరుకున్న మొదటి భారతీయుడు శుభాన్షు శుక్లా. నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ప్రైవేట్ కంపెనీ యాక్సియమ్ స్పేస్ కి చెందిన యాక్సియం-4 మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి శుభాంశు శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ వెట్ సన్ , పోలాండ్ కు చెందిన స్టావోస్ ఉజ్నాన్స్ కీ , హంగేరీకు చెందిన టిబర్ కఫూ లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లారు. గురువారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మిషన్ లో భాగంగా వీరంతా 14 రోజులపాటు అక్కడే గడపనున్నారు.

అయితే భూమికి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే వ్యోమగామికి అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే పరిస్థితి ఏంటి? వారికి జ్వరం వస్తే ఏం చేస్తారు, గాయాలు అయితే లేదా గుండెపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడ హాస్పిటల్ ఉండదు కదా మరి వారిని ఎలా కాపాడతారు..అప్పుడు వారి పరిస్థితి ఏంటి వంటి అనేక సందేహాలను చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. అయితే మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే సమాధానం ఏంటో ఇక్కడ చూడండి.
అంతరిక్షంలో తేలియాడే హాస్పిటల్
అంతరిక్ష కేంద్రంలో పూర్తిస్థాయి హాస్పిటల్ ఉండదు కానీ ఎమర్జెన్సీ వంటి పరిస్థితులను ఎదుర్కోడానికి అంతరిక్ష సంస్థలు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాయి. ప్రతి వ్యోమగామి స్పేస్ లోకి వెళ్లే ముందు ఒక మినీ డాక్టర్ లా శిక్షణ పొందుతాడు. వారికి ఫస్ట్ ఎయిడ్, గాయాలకు కట్లు కట్టడం, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు.ప్రతి మిషన్‌లో ఒక వ్యోమగామిని క్రూ మెడికల్ ఆఫీసర్ (CMO)గా నియమిస్తారు. ఈ వ్యక్తి వృత్తిరీత్యా వైద్యుడు కాకపోయినా భూమిపై ఉన్న డాక్టర్లతో నిరంతరం సంప్రదిస్తూ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించగల నైపుణ్యం కలిగి ఉంటాడు. వీరి దగ్గర ఒక మెడికల్ కిట్ ఉంటుంది. ఇందులో నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్, అలెర్జీ మందుల నుండి మొదలుకొని పోర్టబుల్ అల్ట్రాసౌండ్ పరికరం, గుండె ఆగిపోయినప్పుడు షాక్ ఇవ్వడానికి డీఫిబ్రిలేటర్, శ్వాస ఆగిపోయినప్పుడు ఉపయోగించే సీపీఆర్ (CPR) పరికరాల వరకు అన్నీ ఉంటాయి.
సున్నా గురుత్వాకర్షణలో సీపీఆర్ చేయడం అత్యంత సవాల్ తో కూడుకున్నదిగా ఉంటుంది. భూమిపై మనం ఛాతీపై ఒత్తిడి ప్రయోగించడానికి మన శరీర బరువును ఉపయోగిస్తాం. కానీ అంతరిక్షంలో బరువు లేనందున ఇది సాధ్యం కాదు. దీనికోసం సీపీఆర్ చేసే వ్యక్తి తన కాళ్లను ఒక ప్రత్యేకమైన పరికరంతో బంధించుకుని అప్పుడు రోగి ఛాతీపై ఒత్తిడి ప్రయోగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భూమి నుండి అందే సహాయం
ఒకవేళ వ్యోమగామికి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైతే.. భూమిపై ఉన్న నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ లో వైద్యుల బృందం 24/7 అందుబాటులో ఉంటుంది. హై డెఫినిషన్ వీడియో, ఆడియో ద్వారా వారు నేరుగా స్పేస్ స్టేషన్ తో అనుసంధానమై ఉంటారు. వ్యోమగామి శరీరం నుండి అందే బయోమెట్రిక్ డేటా (హృదయ స్పందన, రక్తపోటు, ఆక్సిజన్ లెవల్స్)ను విశ్లేషిస్తూ ఒక వర్చువల్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నట్లుగా క్రూ మెడికల్ ఆఫీసర్‌కు అడుగడుగునా సూచనలిస్తూ ట్రీట్మెంట్ ను పర్యవేక్షిస్తారు. దీనినే టెలిమెడిసిన్ అని అంటారు.
చివరి అస్త్రం
అన్ని ప్రయత్నాలు చేసినా వ్యోమగామి ఆరోగ్యం మెరుగుపడకపోతే ఆ వ్యక్తిని భూమికి తిరిగి తీసుకురావడానికి ఒక లైఫ్ బోట్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. స్పేస్ స్టేషన్ కు ఎల్లప్పుడూ రష్యాకు చెందిన సోయుజ్ లేదా స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఒకటి అనుసంధానమై ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ క్యాప్సూల్ కేవలం 3 నుండి 5 గంటల్లో వ్యోమగామిని భూమికి తీసుకురాగలదు. అయితే ఈ అత్యవసర తరలింపును చివరి అస్త్రంగానే పరిగణిస్తారు. ఎందుకంటే అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చే క్రమంలో శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటుపడే ప్రక్రియలో కొన్ని వ్యాధులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.గడిచిన 20 ఏళ్లకు పైగా ISS చరిత్రలో వైద్య కారణాల వల్ల ఏ ఒక్క వ్యోమగామిని కూడా అత్యవసరంగా భూమికి తీసుకురావాల్సిన అవసరం రాలేదు.

భవిష్యత్తు ప్రయాణాలకు సన్నద్ధత
సూక్ష్మ గురుత్వాకర్షణలో ఎక్కువ కాలం జీవించడం వల్ల వ్యోమగాముల కండరాలు బలహీనపడతాయి,ఎముకల సాంద్రత తగ్గుతుంది, రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహం వంటి సుదూర ప్రయాణాలు చేసినప్పుడు అక్కడి నుండి తక్షణమే భూమికి తిరిగి రావడం అసాధ్యం. అటువంటి పరిస్థితుల కోసం నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు రోబోటిక్ సర్జన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత డయాగ్నస్టిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications