Allu Arjun Vs Telangana Govt: ప్రాణం పోయిందన్నా మూవీ చూశాకే వెళ్తానన్నాడు..అసలు జరిగిందిదే..వీడియో చూడండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా ఉన్నారు. కొందరు విమర్శిస్తూ,మరికొందరు సానుభూతి చూపుతూ అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ బాగా ఓవరాక్షన్ చేస్తున్నాడని కొందరు యూటూబ్ లో వీడియోలు, అల్లు అర్జున్ పై కక్షపూరితంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరికొందరు యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. గత వారం రోజులుగా అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్నప్పటికీ..శనివారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు,దానికి కౌంటర్ గా అల్లు ఫ్యామిలీ ప్రెస్ మీట్ పరిస్థితికి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయింది. అయితే అసలు అల్లు అర్జున్ ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు,ఏం చేశారు? ఎందుకు అరెస్ట్ అయ్యారు? అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి ఏమన్నారు? హైదరాబాద్ పోలీసులు బన్నీపై ఎందుకు సీరియస్ అవుతున్నారు? వంటి అనేక ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.

అసలు ఏం జరిగింది

డిసెంబర్ 5,2024న ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే అసలు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ మొత్తం సినిమా విడుదలకి ఒక్క రోజు రాత్రి ముందు జరిగినదాని గురించే. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పుష్ప2 ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంథ్య70 mm థియేటయర్ లో కూడా పుష్ప2 సినిమా ప్రీమియర్ షో వేశారు. దీంతో పుష్స 2 సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ దగ్గరకు వచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొత్తం రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. 9:30 గంటల సమయంలో అల్లు అర్జున్ కూడా తన భార్యా,పిల్లలతో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు సంథ్య థియేటర్ కు వచ్చారు.

telangana govt vs allu arjun what happend actually see cctv footage video released by cp cv anand

థియేటర్ బయట అల్లు అర్జున్ తన కారులోని సన్ రూప్ ఓపెన్ చేసి అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని దగ్గరగా చూడాలన్న ఆత్రుతలో ఒకరిని ఒకరు తోసుకుంటూ ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగి పుష్ప2 సినిమా చూసేందుకు తన భర్త,కొడుకు,కూతురితో థియేటర్ దగ్గరకు వచ్చిన రేవతి అనే 35 ఏళ్ల మహిళ తన కుమారుడిని తొక్కిసలాట నుంచి కాపాడబోయి తాను మృతి చెందింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. రేవతి కుమారుడైన 9 ఏళ్ల వయస్సున్న శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు శ్రీతేజ్ ని హాస్పిటల్ కి తరలించారు. శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

రేవతి భర్త ఏం చెప్పారు
తాము సంధ్య థియేటర్ లో గతంలో ఎన్నో సినిమాలు చూశామని,ఈసారి కూడా అలాగే సంధ్య థియేటర్ కి వెళ్లినట్లు రేవతి భర్త భాస్కర్ తెలిపాడు. రాత్రి 9.30 సమయంలో అభిమానుల తాకిడి మరీ ఎక్కువ అయిందని..ఆ సమయంలో తన భార్య, కొడుకు ముందుకు వెళ్లిపోయారని.. తాను,తన కూతురు వెనుక ఉన్నట్లు భాస్కర్ చెప్పారు. తన భార్యకు ఫోన్ చేయగా తాను లోనికి వచ్చానని చెప్పిందని అన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ మూవీ చూడటానికి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారని.. దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిపాడు. తాను తర్వాత థియేటర్ లోపలికి వెళ్లి తమ సీట్ల దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ తన భార్య కనిపించలేదని దీంతో తాను తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు చెప్పాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి తన కొడుకు కిమ్స్ లో ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్తే వెంటిలేటర్ అవసరమైనట్లు డాక్టర్లు చెప్పారని తెలిపాడు. రాత్రి 2 గంటల తర్వాత తన భార్య చనిపోయినట్లు తనకు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు చెప్పాడు.

అల్లు అర్జున్ ఎప్పుడు స్పందించారు
డిసెంబర్ 6వ తేదీ రాత్రి ఈ ఘటనపై అల్లు అర్జున్ మొదటిసారిగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తో పాటు 3 నిమిషాలకు పైగా నిడివితో ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. తన అభిమాని కుటుంబం చనిపోవడం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తాము అభిమానుల కోసమే సినిమా తీస్తామని,ఇలా జరుగుతుందని అనుకోలేదని అల్లు అర్జున్ ఆ వీడియోలో అన్నారు.

ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి తనతోపాటు పుష్ప టీమ్ మొత్తం ఏదో వెల్తిగా ఫీల్ అవుతున్నామన్నారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామంటూ రూ.25 లక్షల సాయం ప్రకటించాడు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న రేవతి కుమారుడి వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ అరెస్ట్
సంథ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై రేవతి భర్త కేసు పెట్టడంతో అల్లు అర్జున్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 13న ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా..కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అదే రోజు అల్లు అర్జున్ ని చంచలగూడ జైలుకి తరలించారు. అయితే డిసెంబర్ 13నే తెలంగాణ హైదరాబాద్ లో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వేసిన క్యాష్ పిటిషన్ ని వాచారించిన కోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే కోర్టు ఆర్డర్ కాపీలు జైలుకి చేరుకోవడం ఆలస్యం జరిగి ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 13వ తేదీ రాత్రి చంచల్ గూడ జైలులోనే గడిపారు అల్లు అర్జున్. మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14వ తేదీన అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ స్టూడియోకి,తర్వాత తన ఇంటికి వెళ్లారు. తాను క్షేమంగానే ఉన్నాను అంటూ ఓ ప్రెస్ మీట్ కూడా అదే రోజు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రొడ్యూసర్లు,హీరోలు, డైరక్టర్లు,క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు మాజీ మంత్రులు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని అల్లు అర్జున్ ని పరామర్శించి వెళ్లారు. ఆ తర్వాత శనివారం అంటే డిసెంబర్ 21న అల్లు అర్జున్ అరెస్ట్,తర్వాత జరిగిన పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొద్దిసేపు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కొంచెం తీవ్ర స్వరంతోనే అసెంబ్లీలో మాట్లాడారు.

ఎంటర్ అయిన రాజకీయ పార్టీలు
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ,బీఆర్ఎస్,వైసీపీ పార్టీలు అల్లు అర్జున్ కి మద్దుతుగా వ్యవహరించాయి. బీజేపీ,బీఆర్ఎస్ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి తీరుని తప్పుబట్టారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి మద్దతుగా ఈ పార్టీల నాయకులు పోస్ట్ లు కూడా పెట్టారు.

శ్రీతేజ్ ని పరామర్శించిన అల్లు అరవింద్
డిసెంబర్ 18న కిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీతేజ్ ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్ల ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ కోలుకునేంత వరకు ఎంతైనా ఆర్థికంగా సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారు
సంథ్య థియేటర్ తొక్కిసలాట, సినీ ప్రముఖుల వ్యవహార శైలిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డిసెంబర్ 21న మాట్లాడారు. ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, పోలీసులు చెప్పినా ఆయన వినలేదని అన్నారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు,బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని.. అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ సంథ్య థియేటర్‌కు వెళ్లారని సీఎం అన్నారు.

అల్లు అర్జున్ కేవలం థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అభ్యంతరం ఉండేది కాదని కానీ థియేటర్‌కు వెళ్లేటపుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని..దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా జనం సంధ్య థియేటర్ వైపు రావడంతో తోపులాట జరిగిన క్రమంలో రేవతి చనిపోయిందని,ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లాడని అన్నారు. ఆ విషయం చెప్పినా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లలేదని, ఆ తర్వాత కూడా బయటకు వెళ్తూ మళ్లీ రోడ్ షో చేశారని ఇలా చాలా అంశాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు, ప్రముఖులు అయితే నిబంధనలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ హీరో అయితే పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారా అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌ కు సినీ ప్రముఖుల పరామర్శలు ఎందుకు ఆయనకు కాలు విరిగిందా,చెయ్యి విరిగిందా, ఏమైందని అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు సీఎం. సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనను ఇష్టం వచ్చినట్లు తిట్టారని..కానీ హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్ ని ఒక్క సీనీ ప్రముఖుడు కూడా పరామర్శించలేదని అన్నారు.

సీఎంకి అల్లు అర్జున్ కౌంటర్
డిసెంబర్ 21 సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రాంగ్ ఇన్ ఫర్మేషన్, ఫాల్స్ అలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకుండానే రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. అల్లు అరవింద్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ తోనే సీఎం మాట్లాడినట్లుగా పరోక్షంగా చెప్పారు.

పోలీసుల కౌంటర్ ప్రెస్ మీట్లు
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత వివాదం మరింత రాజుకుంది. అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ లా వివాదం మారింది. ఆదివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్,అసిస్టెంట్ కమిషర్ సహా చాలా మంది పోలీసులు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మండిపడుతూ మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను సీపీ సీవీ ఆనంద్ ఆదివారం మీడియా సమక్షంలో విడుదల చేశారు.

చిక్కడపల్లి ఏసీపీ బయటపెట్టిన సంచలన నిజాలు

సంధ్య థియేటర్‌ దగ్గర డిసెంబర్ 4వ తేదీ రాత్రి అసలు ఏం జరిగిందో చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ మీడియాకు వివరించారు. డిసెంబరు 4న రాత్రి అల్లు అర్జున్‌ మేనేజర్‌ సంతోష్‌ని కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు..బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.. పరిస్థితి అదుపుతప్పింది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా మేనేజర్‌ తమని అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లనివ్వలేదని.. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరకి వెళ్లి విషయం అల్లు అర్జున్‌ కు చెప్పినా కూడా సినిమా చూసిన తర్వాతే వెళ్తానని ఆయన తనతో చెప్పాడని చిక్కడపల్లి ఏసీపీ తెలిపారు. డీసీపీ జోక్యం చేసుకుని 15 నిమిషాలు సమయం ఇచ్చి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చామన్నారు. ఇక,ఏసీపీ విష్ణుమూర్తి కూడా ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ఫుల్ సీరియస్ అయ్యారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి
రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు ఆదివారం(డిసెంబర్ 22) మధ్యాహ్నాం జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్‌ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్‌ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్​లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని సమాచారం.

Desktop Bottom Promotion