Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బడ్జెట్ భాష అర్థం కావట్లేదా? ఈ డిక్షనరీ మీకోసమే!..నిర్మలమ్మ చెప్పే ఆ పదాలకు అర్థాలు!
మరి కొన్ని గంటల్లో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం రానే వస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. టీవీల్లో, పేపర్లలో బడ్జెట్ ప్రసంగం రాగానే సామాన్యులు మొదట చూసేది.. ఏ వస్తువు ధర పెరిగింది? ఏది తగ్గింది? అనే అంశాన్నే.
సిగరెట్ల ధరలు పెరిగాయా? మొబైల్ ఫోన్లు చవకయ్యాయా? పన్ను మినహాయింపులు వచ్చాయా? అనేదే సగటు మనిషి ఆలోచన. కానీ బడ్జెట్ అంటే కేవలం ధరల పట్టిక మాత్రమే కాదు. ఇది దేశం వార్షిక ఆదాయ, వ్యయాల చిట్టా. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో కొన్ని కఠినమైన పదాలను వాడుతుంటారు. ఆ పదాల అర్థం తెలియకపోతే, బడ్జెట్ దేశానికి మేలు చేసిందా లేదా అనేది మనకు అర్థం కాదు.

ఈ పదాల అర్థం తెలిస్తే, ఆర్థిక మంత్రి చెప్పే గణాంకాల వెనుక ఉన్న అసలు కథ మీకు అర్థమవుతుంది. అందుకే ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని వినేముందు కొన్ని ముఖ్యమైన పదాలు,వాటి అర్థాలు ఇక్కడ చూడండి.
కేంద్ర బడ్జెట్
దీనిని సింపుల్‌గా చెప్పాలంటే, ఒక కుటుంబం రాబోయే ఏడాదిలో ఎంత సంపాదిస్తుంది? ఎంత ఖర్చు చేయబోతోంది? అని వేసుకునే ప్రణాళిక లాంటిదే ఇది. దేశం మొత్తానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదిక ఇది.
మధ్యంతర బడ్జెట్
ఎన్నికల సంవత్సరం వచ్చినప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టరు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొన్ని నెలల పాటు ప్రభుత్వ ఖర్చుల కోసం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ నే మధ్యంతర బడ్జెట్ అంటారు.
ఓట్ ఆన్ అకౌంట్
బడ్జెట్ ఆమోదం పొందడానికి సమయం పడుతుంది కాబట్టి పరిపాలన ఆగకూడదు కదా. అందుకే, సాధారణంగా రెండు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చుల కోసం (జీతాలు, పెన్షన్లు మొదలైనవి) పార్లమెంటు ముందస్తు అనుమతి తీసుకోవడాన్నే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు.
ఆర్థిక బిల్లు(Finance Bill)
బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రవేశపెట్టే అత్యంత కీలకమైన బిల్లు ఇది. కొత్త పన్నులు వేయాలన్నా, పాత పన్నుల్లో మార్పులు చేయాలన్నా ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.
ఆర్థిక లోటు(Fiscal Deficit)
దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైన సూచిక. ప్రభుత్వం తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఏర్పడే వ్యత్యాసమే ఇది. ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఎంత అప్పు చేయాల్సి వస్తుందో ఇది చెబుతుంది. ఈ లోటు ఎంత తక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నట్లు లెక్క.
రెవెన్యూ లోటు(Revenue Deficit)
ప్రభుత్వానికి వచ్చే రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చులు (జీతాలు, నిర్వహణ వ్యయం) ఎక్కువైతే దానిని రెవెన్యూ లోటు అంటారు. ఇది ప్రమాదకరమైన సూచిక. అంటే నిత్యావసర ఖర్చులకు కూడా ప్రభుత్వం అప్పు చేయాల్సిన పరిస్థితి అన్నమాట.
సబ్సిడీ
ఎరువులు, గ్యాస్, ఆహార ధాన్యాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి, అసలు ధరలో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీనినే సబ్సిడీ అంటారు.
జీఎస్టీ
దేశం మొత్తానికి ఒకే పన్ను విధానం. వస్తువులు, సేవల పన్ను. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు.

ప్రాథమిక లోటు(Primary Deficit)
ఆర్థిక లోటులో నుంచి, ప్రభుత్వం పాత అప్పులకు చెల్లించే వడ్డీని తీసివేస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. వడ్డీ భారం లేకపోతే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇది తెలియజేస్తుంది.
మూలధన వ్యయం(Capital Expenditure)
ఇది మంచి ఖర్చు. ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, ప్రాజెక్టులు, ఆస్తుల నిర్మాణం కోసం పెట్టే ఖర్చు ఇది. ఇది దేశాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుంది. ఈ ఖర్చు పెరిగితే దేశానికి మంచిది.
రెవెన్యూ వ్యయం(Revenue Expenditure)
ఇది ప్రభుత్వ నిర్వహణ ఖర్చు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, అప్పుల వడ్డీల కోసం చేసే ఖర్చు. దీనివల్ల కొత్త ఆస్తులేవీ సృష్టించబడవు, కానీ ప్రభుత్వం నడవడానికి ఇది తప్పనిసరి.
స్థూల,నికర పన్ను ఆదాయం(Gross vs Net Tax Revenue)
ప్రజల నుండి వసూలు చేసిన మొత్తం పన్నును స్థూల ఆదాయం అంటారు. ఇందులో నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను ఇచ్చేయగా, కేంద్రం వద్ద మిగిలే మొత్తాన్ని నికర పన్ను ఆదాయం అంటారు.
పన్ను-GDP నిష్పత్తి
దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో (GDP) పోలిస్తే పన్నుల వసూలు ఎంత ఉందో ఇది చెబుతుంది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పన్నులు బాగా వసూలు చేస్తోందని, ఆర్థిక వ్యవస్థ బాగుందని అర్థం.
పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల్లో (ఉదాహరణకు ఎల్ ఐసి, ప్రభుత్వ బ్యాంకులు) ప్రభుత్వం తన వాటాను అమ్మి నిధులు సేకరించడాన్ని డిజిన్వెస్ట్‌మెంట్ అంటారు.



Click it and Unblock the Notifications