ఆంధ్రా స్టైల్ కరివేపాకు నిల్వ పచ్చడి..ఇడ్లీ,దోశెలో తింటే ఆహా అనాల్సిందే

Posted By:

దోశె,ఇడ్లీలోకి డైలీ అవే చట్నీలు,అవే కారం పొడులు తినితిని విసిగిపోయారా? కొత్తగా ఏదైనా టేస్టీగా ఉంటే బాగుంటది అనుకుంటున్నారా? అయితే కరివేపాకు పచ్చడి ఓ సారి ట్రై చేయండి. నెల రోజులపాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ కరివేపాకు నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కరివేపాకు నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-కరివేపాకు
-ఆవాలు
-మెంతులు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-నూనె
-చింతపండు
-పసుపు
-ఉప్పు
-బెల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-ధనియాలు
-జీలకర్ర

ఆంధ్రా స్టైల్ కరివేపాకు నిల్వ పచ్చడి తయారీ విధానం

-స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో పావు కప్పు అంటే 60 మిల్లీగ్రాముల నూనె పోసి వేడి చేసుకోండి.

-తర్వాత అందులో 1 టీస్పూన్ ఆవాలు,1 టీస్పూన్ మెంతులు వేసి మెంతులు రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి.

-ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు,1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేపండి.

-మినపప్పు,శనగపప్పు రెండూ రంగు మారుతున్న సమయంలో 2 టీ స్పూన్ల ధనియాలు వేసి వేపండి. ధనియాలు మంచి వాసన వచ్చే సమయంలో 1 టీ స్పూన్ జీలకర్ర,12 వెల్లుల్లి రెబ్బలు,10 గ్రాముల పచ్చిమిర్చి అందులో వేసి బాగా వేగనివ్వాలి.

-పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కడిగి ఆరబెట్టిన 50 గ్రాముల ముదురు కరివేపాకు ఆకులు వేసి చెమ్మ ఆరేంతవరకు బాగా ఫ్రై చేయండి.

-తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని మిక్సీ జార్ లో వేసి నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్ లా చేసుకోండి.

- ఇప్పుడు అదే మూకుడులో 100 గ్రాముల చింతపండు గుజ్జు,40 గ్రాముల బెల్లం తురుము వేసి మీడియం ప్లేమ్ లో జిగురు పాకం వచ్చే వరకు కలుపుతూ దగ్గరపడనివ్వండి.

-పాకం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ ను వేయండి. అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ.

-ఈ పచ్చడిని ఆరిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకుంటే బయట పెట్టుకున్నా మూడు వారాల వరకు నిల్వ ఉంటుంది. దోశ,ఇడ్లీ,అన్నంలోకి కూడా ఈ పచ్చడి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, December 11, 2024, 16:04 [IST]
Desktop Bottom Promotion