జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!

Posted By:

భోజనంలోకి వేడివేడి రసం పడితే ఆ తృప్తే వేరు. రోజువారీ వంటల్లో రసం ఉండటం మన ఇళ్లలో సర్వసాధారణం. అయితే రోజూ ఒకే రకమైన రసం తిని మీ నాలుకకు బోర్‌ కొడుతోందా? ఘుమఘుమలాడే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం ఓ సారి ట్రై చేయండి. ఈ రసం చేసిపెడితే, దాని అద్భుతమైన రుచికి మీ ఇంట్లో వాళ్లు కచ్చితంగా ఫిదా అయిపోతారు. మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడిగి మరీ చేయించుకుంటారు. చెట్టినాడ్ ఉల్లిపాయ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

దంచుకోవడానికి:
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
కొద్దిగా ధనియాలు
కరివేపాకు
ఒక పచ్చిమిర్చి

రసం తయారీకి:

పండిన టమాటాలు - 3
ఉసిరికాయంత చింతపండు
పసుపు - పావు టీస్పూన్
ఉడికించిన పప్పు - ఒక గుప్పెడు
నీళ్లు - 5 కప్పులు
ఉప్పు - తగినంత

రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి

తాలింపు కోసం:
నూనె - ఒకటిన్నర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపపప్పు - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
ఎండుమిర్చి - 2
సాంబార్ ఉల్లిపాయలు - 15
జీలకర్ర పొడి - పావు టీస్పూన్.
కొద్దిగా కొత్తిమీర
చిన్న బెల్లం ముక్క

Chettinad Onion Rasam Recipe in Telugu A Spicy Tangy Twist to Your Regular Rasam

తయారీ విధానం

-ముందుగా రోలు లేదా మిక్సీ తీసుకుని అందులో మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులోనే ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి తేలికగా దంచి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక లోతైన గిన్నెలో టమాటా ముక్కలు, తగినంత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి చేత్తో బాగా మెత్తగా పిసకాలి. ఈ టమాటా మిశ్రమంలో ముందుగా తీసిపెట్టుకున్న పెద్ద ఉసిరికాయంత చింతపండు నుంచి తీసిన రసం, 5 కప్పుల నీళ్లు, పసుపు వేసి స్టవ్ మీద పెట్టి మరగబెట్టాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా మరిగించి కిందకు దించి చల్లారనివ్వాలి.

-ఈలోపు ఉడికించిన పప్పును మెత్తగా గరిటెతో ఎనిపి, అందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి-మిరియాల మసాలాను కలిపి.. ఆ మొత్తాన్ని మరిగించిన రసంలో పోయాలి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడిచేయాలి. ఆవాలు, మినపపప్పు, మెంతులు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి.

-పోపు వేగాక సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి వేసి ఉల్లిపాయలు మెత్తబడేదాకా మగ్గించి, ఈ పోపును రసంలో కలుపుకోవాలి.

-చివరిగా, ఈ రసాన్ని మళ్లీ స్టవ్ మీద ఉంచి, చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర చల్లాలి.

-రసం పైకి నురుగు రావడం ప్రారంభించగానే (మరగక ముందే) స్టవ్ ఆపేయాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ రసం పోసుకుని తింటే రుచి అమృతంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, October 30, 2026, 23:00 [IST]
Desktop Bottom Promotion