ప్రతిసారీ బిర్యానీనేనా? ఈ వీకెండ్ కొత్తగా, రుచిగా చికెన్ తహారీ రుచి చూడండి!

Posted By:

వీకెండ్ వచ్చిందంటే చాలు, మనందరికీ బిర్యానీ లేదా పలావ్ తినాలనిపిస్తుంది. కానీ ప్రతిసారీ బిర్యానీ చేయడానికి చాలా సమయం, శ్రమ పడుతుంది కదా. అయితే, బిర్యానీకి ఏమాత్రం తీసిపోని రుచితో, చాలా సులభంగా, త్వరగా చేసుకోగలిగే అద్భుతమైన వంటకం ఒకటుంది. అదే చికెన్ తహారీ. తహరి అంటే కూరగాయలు లేదా మాంసంతో వండిన కారంగా ఉండే పసుపు రంగు అన్నం వంటకం. ఇది ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అవధ్ ప్రాంతానికి చెందిన ఫేమస్ వంటకం. ఇంట్లోనే ఈ ఘుమఘుమలాడే చికెన్ తహారీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

చికెన్ తహారీ తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె - 4 టేబుల్ స్పూన్లు

గరం మసాలా దినుసులు (దాల్చిన చెక్క,యాలకులు,లవంగాలు,బిర్యానీ ఆకు)
ఉల్లిపాయలు - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
చికెన్ - 500 గ్రాములు
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1 టీస్పూన్
కారం - 2 టేబుల్ స్పూన్లు
కస్తూరి మేతి - 2 టేబుల్ స్పూన్లు
చికెన్ మసాలా పౌడర్ - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - ఒక గుప్పెడు
టొమాటోలు - 5
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
పెరుగు - 1 కప్పు
నీళ్లు - 6 కప్పులు
ఫుడ్ కలర్ - అర టీస్పూన్
బియ్యం - 1 కిలో

చికెన్ తహారీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించాలి.

-ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి, చికెన్ రంగు మారే వరకు నూనెలో బాగా మగ్గనివ్వండి.

-చికెన్ కాస్త ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, చేతితో నలిపిన కసూరి మేతి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపండి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, కొత్తిమీర తురుము వేసి టమాటోలు మెత్తబడే వరకు ఉడికించండి. ఆ తర్వాత ఒక కప్పు తాజా పెరుగు, 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి నూనె పైకి తేలే వరకు సన్నపు మంట మీద ఉడకనివ్వండి. ఈ మిశ్రమం బాగా ఉడికి చిక్కటి గ్రేవీలా తయారయ్యాక, 6 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టండి. నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో, ముందుగా నానబెట్టుకున్న 1 కిలో బియ్యాన్ని నీళ్లు లేకుండా వడకట్టి అందులో వేసి నిదానంగా కలపండి.

-బియ్యం, నీరు సమాన స్థాయికి రాగానే (నీరు ఇగిరిపోతున్న సమయంలో), ఒక సగం టీస్పూన్ ఫుడ్ కలర్ పైన చల్లి, గిన్నెపై మూత గట్టిగా పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు సిమ్ లో దమ్ చేయండి.

-అంతే స్టవ్ ఆఫ్ చేసి ఓ పది నిమిషాలు ఆగి మూత తీస్తే..వేడి వేడి, నోరూరించే చికెన్ తహారీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, May 15, 2026, 10:52 [IST]
Desktop Bottom Promotion