దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!

Posted By:

సాధారణంగా దొండకాయ కూర అనగానే చాలామంది పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ఒక్కసారి ఘాటైన మసాలాలతో దొండకాయ ఉల్లికారం చేసి పెట్టి చూడండి.. వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు. కరకరలాడే దొండకాయ ముక్కలకు, ఉల్లిపాయ,వెల్లుల్లి ఘాటు తోడైతే ఆ మజాయే వేరు.

వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకుని తింటుంటే.. ఆహా అమృతంలా అనిపిస్తుంది. ఘుమఘుమలాడే ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూడండి.

Dondakaya Ulli Karam Recipe Turn Boring Ivy Gourd into a Masterpiece with Onion Garlic Masala

కావాల్సిన పదార్థాలు

లేత దొండకాయలు - 250 గ్రాములు
ఉల్లిపాయలు - 3
పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 10 నుండి 12
జీలకర్ర - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర టేబుల్ స్పూన్
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
నూనె - 4 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా

కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్‌ కార్న్ రెడీ!

తయారీ విధానం

-ముందుగా లేత దొండకాయలను శుభ్రంగా కడిగి, పొడవుగా చీలికల్లా కోసి పెట్టుకోవాలి. పొడవుగా కోయడం వల్ల మసాలా ముక్కల లోపలి వరకు వెళ్లి రుచిగా ఉంటుంది.

-ఈ కూరకి అసలైన ప్రాణం మసాలాయే. ఒక చిన్న పాన్ తీసుకుని అందులో పచ్చి శనగపప్పు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో వేయించుకున్న దినుసులు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయలోని తడి సరిపోతుంది.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక దొండకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. దొండకాయలు మెత్తబడి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఓపిగ్గా వేయించుకుంటే ముక్కలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

-దొండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్‌ ను అందులో వేయాలి. మంటను సిమ్‌ లో ఉంచి, ఈ మసాలా అంతా దొండకాయ ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలపాలి. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయి, కూరలో నుండి నూనె పైకి తేలేవరకు సుమారు 7-10 నిమిషాల పాటు వేయించుకోవాలి.

-కూర అంతా దగ్గరపడి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే దొండకాయ ఉల్లికారం రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 17, 2026, 13:18 [IST]
Desktop Bottom Promotion