బరువు తగ్గించే రుచికరమైన ఓట్స్ ఉప్మా.. 10 నిమిషాల్లో రెడీ చేసుకోండిలా..

Posted By:

బరువు తగ్గాలనుకునే వారి డైట్‌ లో ఓట్స్ ఇప్పుడు ప్రధాన అల్పాహారంగా మారాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఉదయాన్నే తింటే చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ చాలా మంది దీనిని గంజి రూపంలో తినడం వల్ల ఓట్స్‌ ను ఇష్టపడరు.

అయితే ఓట్స్‌ తో నోరూరించే కమ్మటి ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? సరైన పద్ధతిలో వండితే ఓట్స్ ఉప్మా పొడిపొడిగా, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మాను సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Healthy Oats Upma Recipe for Weight Loss Ready in Just 10 Minutes

కావలసిన పదార్థాలు

ఇన్‌ స్టంట్ ఓట్స్ - 1 కప్పు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
జీడిపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర పొడి - చిటికెడు
పసుపు పొడి - అర టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం - చిన్న ముక్క
క్యారెట్ - సగం (సన్నగా తరిగినది)
నీళ్ళు - ఒకటిన్నర కప్పులు
తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

కూర లేకుండానే కడుపునిండా తినేయొచ్చు..రోజూ తినే చపాతీకి బదులు ఇలా క్యారెట్ రోటీ చేసి చూడండి

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి, అందులో 2 టీస్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇన్‌ స్టంట్ ఓట్స్, బొంబాయి రవ్వ వేసి, కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌ లోకి తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, జీడిపప్పు (లేదా వేరుశెనగలు), కరివేపాకు, జీలకర్ర పొడి వేసి తాలింపు పెట్టండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు బాగా వేయించండి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గనివ్వండి.

-4 నిమిషాల తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు పొడి వేసి నీటిని బాగా కలపండి. నీళ్ళు మరగడం మొదలయ్యాక వేయించిన ఓట్స్, బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి, సమానంగా పరచి మూత పెట్టండి. తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించండి.

-5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి, చివరగా తురిమిన పచ్చి కొబ్బరి చల్లి మరోసారి కలిపితే కమ్మటి ఓట్స్ ఉప్మా రెడీ.

-బరువు తగ్గాలనుకునే వారికే కాదు, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ ఓట్స్ ఉప్మా అల్పాహారంగా ఎంతో బాగా నచ్చుతుంది. పోషకాలు మెండుగా ఉండే ఈ వంటకాన్ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, November 26, 2026, 9:46 [IST]
Desktop Bottom Promotion