బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

సాయంత్రం కాగానే వేడివేడిగా, కరకరలాడుతూ ఏదైనా తినాలనిపించడం సహజం. కానీ ప్రతిరోజూ నూనెలో వేయించిన జంక్ ఫుడ్ లేదా చిరుతిళ్లు తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన హై ప్రొటీన్ చిరుతిండి జొన్న గుగ్గిళ్లు టేస్ట్ చేయాల్పిందే. ఈ సంప్రదాయ వంటకంలో ప్రొటీన్లు, ఫైబర్, ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లల లంచ్ బాక్స్‌ లోకి, ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ గా లేదా సాయంత్రం స్నాక్‌ గా... ఎలా తిన్నా దీని రుచి అద్భుతం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే డైట్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

High Protein Millet Snack Jonna Guggillu Recipe in Telugu

జొన్న గుగ్గిళ్లు తయారీకి కావలసిన పదార్థాలు

జొన్నలు - 1 కప్పు
పెసలు (పొట్టు పెసలు) - 1 కప్పు
పల్లీలు (వేరుశనగ గుళ్లు) - అర కప్పు
అల్లం, వెల్లుల్లి - కొద్దిగా
మిరియాలు - కొద్దిగా
ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు- 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2 లేదా 3
కరివేపాకు - 2 రెమ్మలు
ఎండుమిర్చి - 2
తాజా కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నిమ్మకాయ - సగం చెక్క
ఇంగువ - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు

జొన్న గుగ్గిళ్లు తయారీ విధానం

-ముందుగా జొన్నలు, పెసలు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.

-అలాగే పల్లీలను మరో గిన్నెలో రెడీ చేసుకోడానికి గంటసేపు ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది.

-నానబెట్టిన జొన్నలు, పల్లీలను ఒక ప్రెషర్ కుక్కర్‌ లో వేసి 2 కప్పుల నీళ్లు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూతపెట్టాలి. జొన్నలు ఉడకడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మెత్తగా ఉడకడానికి సుమారు 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

-మరో కుక్కర్ తీసుకుని అందులో నానబెట్టిన పెసలు, 1 కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన జొన్నలు, పల్లీలు, పెసలను ఒక వడకట్టే గిన్నెలో వేసి అదనపు నీరంతా పోయేలా వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో తాలింపు గింజలు, కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి.

-ఉల్లిపాయలు వేగాక చిటికెడు పసుపు, అర టీస్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇంగువ ఈ గుగ్గిళ్లకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి వడకట్టుకున్న జొన్నలు, పెసలు, పల్లీల మిశ్రమాన్ని ఇందులో వేసి అన్నీ బాగా కలిసేలా టాస్ చేయాలి.

-చివరగా స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీర చల్లుకోవాలి. దీనిపై కొద్దిగా నిమ్మరసం పిండుకుని వేడివేడిగా వడ్డించుకుంటే.. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఎంతో రుచికరమైన జొన్న గుగ్గిళ్లు రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, August 1, 2026, 12:09 [IST]
Desktop Bottom Promotion