ఇంట్లోనే పక్కా హోటల్ స్టైల్ వెజ్ కుర్మా.. రెస్టారెంట్ చెఫ్‌ లు వాడే సీక్రెట్ ఇదే!

Posted By:

చపాతీ, పరోటా లేదా బగారా రైస్ తింటున్నప్పుడు అందులోకి కమ్మటి హోటల్ స్టైల్ కుర్మా ఉంటే ఆ మజాయే వేరు. మనం ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఆ హోటల్ రుచి రావడంలేదని ఫీల్ అవుతున్నారా?

అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చెఫ్ లు చేసే స్టైల్ వెజ్ కుర్మా చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అవి తెలిస్తే ఎంతో కమ్మగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ గ్రేవీని తయారు చేయడం చాలా ఈజీ. హోటల్ స్టైల్ వెజ్ కుర్మాను చెఫ్ ల సీక్రెట్స్ టిప్స్ పాటిస్తూ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Hotel Style Veg Kurma Recipe The Ultimate Side Dish for Chapati Parata

హోటల్ స్టైల్ వెజ్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు

కూరగాయల ముక్కలు (ఒక్కొక్కటి అర కప్పు)
క్యారెట్, బీన్స్, బంగాళదుంప, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ

కుర్మా మసాలా పేస్ట్ కోసం
పచ్చి కొబ్బరి తురుము -అర కప్పు
జీడిపప్పు - 8
గసగసాలు - 1 టీస్పూన్
పుట్నాల పప్పు (వేపిన శనగపప్పు) - 1 టేబుల్ స్పూన్
సోంపు - అర టీస్పూన్
నీళ్లు - తగినన్ని

కుర్మా తయారీకి

నూనె - 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
యాలకులు - 2
లవంగాలు - 3
సోంపు - అర టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒకటిన్నర టేబుల్ స్పూన్
టమాటో - 1
పసుపు - పావు టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
తాజా పుదీనా ఆకులు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 2 కప్పులు
నెయ్యి - 1 టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.!

హోటల్ స్టైల్ వెజ్ కుర్మా తయారీ విధానం

-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, గసగసాలు, పుట్నాలా పప్పు, సోంపు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్టే మన కుర్మాకు ఆ కమ్మని రుచిని ఇస్తుంది.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. టమాటాలు మగ్గాక పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పుదీనా ఆకులు వేసి మరో అర నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు అందులో క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ ముక్కలన్నింటినీ వేసి మసాలా పట్టేలా 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత ఒకటిన్నర నుండి 2 కప్పుల నీళ్లు పోసి, మూతపెట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.

-కూరగాయలు ఉడికిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్‌ ను వేసి బాగా కలపాలి. మంటను సిమ్ లో పెట్టి, గ్రేవీ చిక్కబడి కమ్మటి వాసన వచ్చే వరకు 5-7 నిమిషాల పాటు ఉడికించాలి.

-చివరగా ఒక టీస్పూన్ నెయ్యి, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ వెజ్ కుర్మా రెడీ. వేడి వేడి పరోటా, చపాతీ, దోశ దేనిలోకైనా ఈ కుర్మా అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, August 17, 2026, 8:06 [IST]
Desktop Bottom Promotion