100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే!

Posted By:

భారతీయ భోజనం అనగానే రకరకాల పచ్చళ్లు, చట్నీలు గుర్తుకు వస్తాయి. ఏ కూరా లేకపోయినా పళ్లెంలో ఒక మంచి పచ్చడి ఉంటే చాలు, కడుపునిండా అన్నం తినేయొచ్చు. అయితే రోజూ చేసుకునే పుదీనా, కొత్తిమీర, టమాటా పచ్చళ్లతో మీకు బోర్ కొట్టిందా? మీ నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే కారం, పులుపు, తీపి కలగలిసిన పచ్చిమిర్చి పచ్చడిని ఓసారి ట్రై చేయాల్సిందే.

పచ్చిమిర్చి అనగానే కారం అని భయపడకండి, దీన్ని నేరుగా కాకుండా మసాలాలతో మగ్గించి చేసే విధానం దీనికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. ఇడ్లీ, దోశ, పరాఠా, రోటీలకు కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

How to Make Delicious Pachimirchi Pachadi at Home Recipe in Telugu

కావలసిన పదార్థాలు

కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి - 200 గ్రాములు
నూనె - తగినంత
మెంతులు - అర టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
బెల్లం - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 5 రెబ్బలు
ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచికి తగినంత

తాలింపు కోసం:

ఆవాలు, జీలకర్ర- చెరో టీస్పూన్
శనగపప్పు, మినపపప్పు - చెరో టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 10 ఆకులు
ఇంగువ,పసుపు - పావు టీస్పూన్

వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నూనె వేడిచేయండి. అందులో మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి సన్నని మంట మీద దోరగా వేయించండి. మసాలాలు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులోనే తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలిపి, మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. మిరపకాయలు మెత్తబడ్డాక స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వండి.

-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌ లో తీసుకుని, అందులో నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా రుబ్బుకోవాలి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.

-చివరగా మరో కడాయిలో నూనె వేడిచేసి, తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి. అవి చిటపటలాడాక ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి కమ్మటి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలిపి, పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే పచ్చడి రెడీ.

పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు

-ఈ పచ్చడిని మెత్తటి పేస్ట్‌ లా కాకుండా కాస్త బరకగా రుబ్బితేనే అసలైన రుచి తెలుస్తుంది.

-మెంతులు,నువ్వులు ఎక్కువగా వేగితే చేదు వస్తుంది కాబట్టి చిన్న మంటపైనే వేయించాలి.

-ఈ పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటే, ఉల్లిపాయను ముందుగానే కలపకండి. ఫ్రిజ్‌ లో గాలి చొరబడని పొడి డబ్బాలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు శుభ్రమైన చెంచాతో తీసుకుంటే పాడవకుండా ఉంటుంది. తినే ముందు మాత్రమే కొద్దిగా ఉల్లిపాయ కలుపుకోండి.

[ of 5 - Users]
Story first published: Thursday, November 12, 2026, 10:37 [IST]
Desktop Bottom Promotion