హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్‌ తో చేసి చూడండి!

Posted By:

ఉదయం నిద్రలేవగానే పొంగుతున్న వేడి వేడి పూరీ, దానికి సరైన జోడీగా కమ్మటి బంగాళాదుంప మసాలా కళ్లముందు కనిపిస్తే... ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా మొదలైనట్లే. తక్కువ మసాలాలతో, కడుపుకు హాయిగా, నోటికి రుచిగా ఉండే పూరీ మసాలా ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. చాలా సింపుల్‌ గా, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే నమ్మశక్యం కాని రుచితో ఈ కూరను తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం పూరీల్లోకే కాకుండా చపాతీ, రోటీ, చివరకు వేడి వేడి మసాలా దోశలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. పూరీ మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

వంటనూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: రెండు లేదా మూడు రెమ్మలు
పచ్చిమిర్చి: 2-3
క్యారెట్: 1 చిన్నది
క్యాప్సికం: సగం
ఉల్లిపాయ: 1 పెద్దది
ఉప్పు: మీ రుచికి తగినంత
పసుపు: పావు టీస్పూన్
శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు: గ్రేవీకి సరిపడా
బంగాళాదుంపలు: 2-3
కొత్తిమీర: గుప్పెడు

How to Make Hotel Style Poori Masala for Poori at Home Secret Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించండి.

-తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం ముక్కలను వేసి ఒకట్రెండు నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వండి. తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మంటను కాస్త పెంచి ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు 2-3 నిమిషాల పాటు వేయించాలి.

-ఈలోపు ఒక చిన్న గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని, అందులో ఎక్కడా ఉండలు కట్టకుండా కొద్దిగా నీళ్లు పోసి పలచని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమాన్ని కడాయిలో పోసి, దానికి గ్రేవీకి సరిపడా మరికొన్ని నీళ్లు జతచేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల శనగపిండిలోని పచ్చివాసన పోయి, మసాలా మెల్లగా చిక్కబడుతూ ఉంటుంది.

విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్!

-గ్రేవీ చిక్కబడగానే, ముందుగానే ఉడికించి, మెత్తగా చిదిమి పెట్టుకున్న బంగాళాదుంపలను అందులో వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికిస్తే గ్రేవీ రుచులన్నీ బంగాళాదుంపలకు పట్టి, కూర మరింత రుచిగా మారుతుంది.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూరపై చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే.. ఎంతో రుచికరమైన, కమ్మని పూరీ మసాలా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 11, 2026, 22:04 [IST]
Desktop Bottom Promotion