జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి

Posted By:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఆమ్లెట్ తినడం చాలామందికి అలవాటు. కానీ, ప్లేట్‌ లో పెట్టగానే మేఘంలా పొంగిపోయే, దూదిలాంటి సాఫ్ట్ ఆమ్లెట్‌ ను ఎప్పుడైనా రుచి చూశారా? లేదంటే.. జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ను మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. జపనీస్ వంటకాల్లో ఈ ఫ్లఫ్ఫీ ఆమ్లెట్‌ కు ప్రత్యేక స్థానం ఉంది.

గుడ్లను గిలకొట్టే విధానంలోనే అసలు రహస్యం దాగి ఉంది. గుడ్డులోని తెల్లసొనను గాలితో నిండినట్లుగా బాగా గిలకొట్టి ఆ తర్వాత పచ్చసొన కలపడం వల్లే దీనికి ఆ మేఘం లాంటి ఆకృతి వస్తుంది.జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Jaoaneese cloud omelette recipe in telugu

కావలసిన పదార్థాలు
గుడ్లు - 4
వెన్న - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి లేదా కారం - కొద్దిగా
ఉల్లికాడలు లేదా కొత్తిమీర - అలంకరణ కోసం

బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!

తయారీ విధానం

-ముందుగా నాలుగు గుడ్లను పగలగొట్టి, తెల్లసొన, పచ్చసొనను వేర్వేరు గిన్నెల్లో చాలా జాగ్రత్తగా వేరు చేయండి. తెల్లసొనలో కొంచెం కూడా పచ్చసొన పడకుండా చూసుకోండి, లేదంటే అది సరిగ్గా పొంగదు.

-ఇప్పుడు ఎలక్ట్రిక్ బీటర్ లేదా విస్కర్ తీసుకుని తెల్లసొనను బాగా గిలకొట్టండి. అది మెల్లగా క్రీమ్‌ లా మారి, గట్టిగా ఫామ్ అయ్యేవరకు బీట్ చేయాలి. గిన్నెను తలక్రిందులుగా తిప్పినా ఆ మిశ్రమం కింద పడకూడదు.. అదే దీనికి పర్ఫెక్ట్ స్టేజ్.

-పక్కన పెట్టిన పచ్చసొనలను ఈ తెల్లటి క్రీమ్‌ లో వేయండి. తెల్లసొనలోని గాలి బయటకు పోకుండా, ఒక గరిటెతో చాలా సున్నితంగా, నెమ్మదిగా కలపాలి. వేగంగా కలిపితే ఆమ్లెట్ మెత్తదనం కోల్పోతుంది.

-ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, మంటను పూర్తిగా సిమ్‌ లో ఉంచండి. అందులో వెన్న వేసి కరిగించండి.

-వెన్న కరిగాక, మనం సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పాన్‌ లో వేసి, మందంగా, గుండ్రంగా సర్దుకోండి. మీ రుచికి తగినట్లుగా పైన చిటికెడు ఉప్పు చల్లండి.

-పాన్‌ పై మూత పెట్టి, 3 నుంచి 5 నిమిషాల పాటు తక్కువ మంటపైనే ఉడకనివ్వండి.

-ఆమ్లెట్ బాగా ఉబ్బి, పైభాగం సెట్ అయినట్లు కనిపించగానే స్టవ్ ఆపేయండి.

-అంతే జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, September 18, 2026, 23:14 [IST]
Desktop Bottom Promotion