చపాతీ, పూరీ, పులావ్‌ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!

Posted By:

ఇంట్లో చపాతీలు, పూరీలు చేసుకున్నప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి రొటీన్‌ కు భిన్నంగా, మసాలా దినుసులను తాజాగా రుబ్బి, కమ్మని వాసనతో కూడిన మీల్ మేకర్ మసాలా గ్రేవీని ట్రై చేయండి. ఈ పద్ధతిలో గ్రేవీ చేస్తే అచ్చం చికెన్ లేదా మటన్ కర్రీ తిన్న అనుభూతి కలుగుతుంది.

ఇది కేవలం చపాతీ, పూరీలకే కాదు, వేడివేడి పులావ్, బగారా రైస్, బిర్యానీలలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. నోరూరించే మీల్ మేకర్ గ్రేవీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
మీల్ మేకర్ - 1 కప్పు
ఉప్పు - పావు టీస్పూన్
నీళ్లు - తగినన్ని
ఎండు మిరపకాయలు - 5
అల్లం - 3 అంగుళాల ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 10
పెద్ద టమాటా - 1
ఉల్లిపాయలు - 2
నూనె - 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
లవంగాలు - 4
స్టార్ అనాస- 1
సోంపు - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
కశ్మీరీ కారం - అర టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 400 మి.లీ
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచండి. అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి మరిగించండి.

-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేసి 1 కప్పు మీల్ మేకర్ వేసి మూతపెట్టండి. ఇలా 10 నిమిషాల పాటు వేడినీటిలో నాననివ్వండి.

-10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ మెత్తగా అవుతాయి. ఇప్పుడు ఆ వేడినీటిని వంపేసి, రెండు మూడు సార్లు చల్లటి నీటితో శుభ్రంగా కడగండి. ఆ తర్వాత వాటిలోని నీరంతా పోయేలా చేతితో గట్టిగా పిండి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల సోయా పచ్చి వాసన పోతుంది.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని..అందులో ఎండు మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తటి పేస్ట్‌ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, సోంపు వేసి గుమగుమలాడే వరకు వేయించండి.

-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి.

-ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను వేసి మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి బాగా కలుపుతూ వేయించాలి. మసాలా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి.

-ఆ తర్వాత కశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు కడాయిలో 400 మి.లీ నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి గ్రేవీని 4 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.

-గ్రేవీ చక్కగా మరుగుతున్నప్పుడు ముందుగా నీళ్లు పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ ను అందులో వేసి బాగా కలపాలి. మసాలా అంతా మీల్ మేకర్‌ కు పట్టేలా మూతపెట్టి మరో 3-4 నిమిషాలు ఉడికించాలి.

-గ్రేవీ దగ్గర పడి,చిక్కగా తయారైన తర్వాత పైన సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు చల్లుకుని స్టవ్ ఆపేయాలి.

-అంతే నోరూరించే మీల్ మేకర్ మసాలా గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 4, 2026, 8:00 [IST]
Desktop Bottom Promotion