నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి

Posted By:

దసరా నవరాత్రులు అంటేనే భక్తి, పారవశ్యం, అమ్మవారికి సమర్పించే రకరకాల ప్రసాదాల కలయిక. నవరాత్రులలో రెండవ రోజున జగన్మాతను సౌతిండియాలో.. శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. గాయత్రీ దేవిని వేదమాత అని పిలుస్తారు. ముక్కోటి దేవతల శక్తుల కలయికగా, సకల మంత్రాలకు మూలశక్తిగా ఆమెను ఆరాధిస్తారు.

నవరాత్రులలో పవిత్రమైన రెండవ రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా రవ్వ పులిహోరను సమర్పించడం ఆనవాయితీ. సాధారణంగా మనం బియ్యం లేదా అటుకులతో చేసే పులిహోరను రుచి చూస్తుంటాము. కానీ బియ్యం రవ్వతో చేసే ఈ పులిహోర ఎంతో పొడిపొడిగా, కమ్మగా, అద్భుతమైన రుచితో ఉంటుంది. తయారీ కూడా చాలా ఈజీ.

Navaratri Day 2 Sri Gayatri Devi Prasadam Recipe How to Make Ravva Pulihora Easily in Telugu

రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
రవ్వ ఉడికించడానికి:
బియ్యం రవ్వ - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - 2 టీస్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
నూనె - అర టీస్పూన్
తాలింపు కోసం:
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మినప్పప్పు - అర టీస్పూన్
పచ్చి శనగపప్పు - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 3
ఎండుమిర్చి - 2
అల్లం - అర అంగుళం
జీడిపప్పులు - 10
కరివేపాకు - గుప్పెడు
ఇంగువ - అర టీస్పూన్
నిమ్మకాయ రసం -తగినంత

నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా

రవ్వ పులిహోర తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె లేదా మందపాటి పాన్ పెట్టి అందులో 2 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక అర టీస్పూన్ నూనె వేయాలి. నీటిలో నూనె వేయడం వల్ల ఉడికేటప్పుడు రవ్వ అతుక్కోకుండా పొడిపొడిగా వస్తుంది.

-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, మంటను సిమ్ లో పెట్టి 1 కప్పు బియ్యం రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో నిదానంగా కలుపుతూ ఉండాలి.

-రవ్వ నీళ్లన్నీ పీల్చుకుని మెత్తగా ఉడికే వరకు మూతపెట్టి మగ్గనివ్వాలి.

-రవ్వ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. దీనిని గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక పల్లీలు వేసి దోరగా వేయించాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

-పప్పులు వేగుతున్నప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి కలుపుతూ వేయించాలి. చివరిగా అర టీస్పూన్ ఇంగువ వేయాలి.

-స్టవ్ ఆఫ్ చేసి, ఈ తాలింపు మిశ్రమాన్ని ముందుగా చల్లారబెట్టుకున్న రవ్వలో వేసి కలుపుకోవాలి.

-చివరగా రుచికి తగినట్లుగా నిమ్మరసాన్ని పిండుకుని కలుపుకుంటే రవ్వ పులిహోర రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, October 12, 2026, 7:58 [IST]
Desktop Bottom Promotion