చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే

Posted By:

చికెన్ వంటకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ బరువు తగ్గాలని అనుకునేవారు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు నూనె వాడకం గురించి ఆలోచిస్తూ తమకు ఇష్టమైన చిల్లీ చికెన్‌ను తినడానికి వెనకాడుతుంటారు. అయితే రుచికరమైన చిల్లీ చికెన్ చేయడానికి నూనె తప్పనిసరి అని ఎవరు చెప్పారు?

ఒక్క చుక్క నూనె కూడా వాడకుండానే అద్భుతమైన, కారం కారంగా, జ్యూసీగా ఉండే చిల్లీ చికెన్‌ను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. సువాసనతో నిండిపోయే ఈ హెల్దీ రెసిపీ చికెన్ ప్రియులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. జీరో ఆయిల్ చిల్లీ చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

No oil Chilli Chicken Recipe in Telugu Zero Oil Full Flavour chicken Curry

కావాల్సిన పదార్థాలు

మసాలా పేస్ట్ కోసం:

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
సోంపు - అర టేబుల్ స్పూన్
నల్ల మిరియాలు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - తగినంత
లవంగాలు - 2
కరివేపాకు - కొద్దిగా

చికెన్ తయారీ కోసం:

చికెన్ - 500 గ్రాములు
తరిగిన ఉల్లిపాయ - 1
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - కొద్దిగా
తరిగిన క్యాప్సికమ్ - 1
నీటిలో కలిపిన కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
తరిగిన పచ్చిమిర్చి - కొద్దిగా
ఎండుమిర్చి - కొన్ని
కరివేపాకు - కొద్దిగా
నిమ్మరసం - కొద్దిగా
తరిగిన కొత్తిమీర - కొద్దిగా

చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, చుక్క నూనె వేయకుండానే జీలకర్ర, సోంపు, నల్ల మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు ఒక పాన్‌ లో శుభ్రం చేసిన చికెన్ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఉడికించాలి. నూనె వేయకపోయినా చికెన్ నుండే నీరు బయటకు వస్తుంది. ఆ నీరు పూర్తిగా ఆవిరైపోయి, చికెన్ ముక్కలు మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి.

-చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత, అందులో తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను వేయాలి. ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.

-ఇప్పుడు నీటిలో కలిపి పెట్టుకున్న కార్న్‌ ఫ్లోర్ మిశ్రమాన్ని కడాయిలో పోసి కలుపుతూ ఉడికించాలి. గ్రేవీ చిక్కబడి చికెన్‌ కు అద్భుతంగా పట్టుకునే వరకు ఉంచాలి.

-చివరగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి మరొకసారి బాగా కలపాలి. నిమ్మరసం పులుపు, కొత్తిమీర తాజాదనం ఈ వంటకానికి రెట్టింపు రుచిని అందిస్తాయి.

-అంతే, ఘుమఘుమలాడే నోరూరించే జీరో ఆయిల్ చిల్లీ చికెన్ రెడీ.

-దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. స్టార్టర్‌ గా లేదా సైడ్ డిష్‌ గా ఇది సూపర్‌ గా ఉంటుంది. డైట్ చేసేవారు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఈ స్పైసీ, జ్యూసీ చికెన్‌ను హ్యాపీగా ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 25, 2026, 14:10 [IST]
Desktop Bottom Promotion