టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

బిర్యానీ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పొడవాటి బాస్మతీ బియ్యం, నోరూరించే మసాలాలు, దమ్ చేసిన మాంసం. అయితే మీకు వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు అచ్చం బిర్యానీ ఫ్లేవర్స్‌ ను ఆస్వాదించాలనుకుంటే మాత్రం సేమియా బిర్యానీని కచ్చితంగా రుచి చూడాల్సిందే. పిల్లల లంచ్ బాక్స్‌కైనా, సాయంత్రం వేళ వెరైటీ స్నాక్‌కైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం 20 నిమిషాల్లోనే సేమియా బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Time to Cook Make This Delicious Veg Semiya Biryani Fast And Easy Recipe in Telugu

సేమియా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

సేమియా - 2 కప్పులు
నీళ్లు - ఉడికించడానికి సరిపడా
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
స్టోన్ ఫ్లవర్ - ఒక చిన్న ముక్క
అనాస పువ్వు- 1
బిర్యానీ ఆకులు - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటా - 1 పెద్దది
పుదీనా ఆకులు -పావు కప్పు
కొత్తిమీర - పావు కప్పు
బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీలు - ఒక్కోటి పావు కప్పు చొప్పున
బిర్యానీ మసాలా - ఒకటిన్నర టీస్పూన్
కాశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - పావు కప్పు

సేమియా బిర్యానీ తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ఒక టీస్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేయాలి. ఆ తర్వాత సేమియా వేసి కచ్చితంగా 90 సెకన్ల పాటు మాత్రమే ఉడికించాలి. వెంటనే స్టవ్ ఆపేసి వేడి నీళ్లన్నీ ఒంపేయాలి. సేమియా మీద చల్లటి నీళ్లు పోసి వడకట్టాలి.

-ఒక వెడల్పాటి ప్లేట్‌ లో ఆ సేమియాను వేసి, అతుక్కోకుండా కొద్దిగా నూనె రాసి ఆరబెట్టుకోవాలి.

-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక సోంపు, రాతి పువ్వు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేలా వేయించాలి. ఆ తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి.

-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీలు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో బిర్యానీ మసాలా, కశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కూరగాయలు ఉడకడానికి పావు కప్పు నీళ్లు పోసి, మూతపెట్టి సన్నటి మంట మీద కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.

-కూరగాయలు ఉడికిన తర్వాత, పొడిపొడిగా ఉన్న సేమియాను అందులో వేసి మసాలా అంతా పట్టేలా సున్నితంగా కలపాలి. చివరగా పైన మరికొంత పుదీనా, కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి, రుచికరమైన సేమియా బిర్యానీ రెడీ.

-మీకు ఇష్టమైతే మరింత ప్రోటీన్ కోసం ఇందులో వేయించిన పనీర్ ముక్కలు లేదా సోయా చంక్స్ వేసుకోవచ్చు. ఈ స్పైసీ సేమియా బిర్యానీని కమ్మటి పెరుగుతో లేదా ఉల్లిపాయ రైతాతో తింటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Monday, May 11, 2026, 15:53 [IST]
Desktop Bottom Promotion