ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి..

Posted By:

ఆదివారం వచ్చిందంటే చాలు, మాంసాహారులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే ప్రతి ఆదివారం ఒకేలాంటి రొటీన్ చికెన్ కూర తిని విసుగొచ్చిందా? ఈ వారం మీ కుటుంబ సభ్యులకు ఏదైనా కొత్తగా, స్పెషల్ ‌గా చేసి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే అచ్చం దాబా లేదా రెస్టారెంట్ రుచిని తలపించే పొటాటో చికెన్ కుర్మా ట్రై చేయండి.

ఈ కుర్మా చపాతీ, పూరీ, పరోటా, బగారా రైస్, బిర్యానీ.. ఇలా దేనిలోకైనా అద్భుతమైన కాంబినేషన్. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేయగల ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఫిదా చేస్తుంది. దీని అద్భుతమైన రుచికి కారణం ఇందులో వాడే రెండు రకాల ప్రత్యేకమైన మసాలాలే. నోరూరించే పొటాటో చికెన్ కుర్మా తయారీ విధానం ఇక్కడ చూడండి.

Potato Chicken Kurma Recipe in Telugu Sunday Special Chicken Curry at Home

తయారీకి కావాల్సిన పదార్థాలు

మొదటి మసాలా కోసం:
నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 2 రెబ్బలు
అల్లం - 1 అంగుళం
పచ్చిమిర్చి - 6
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
తరిగిన ఉల్లిపాయ - ముప్పావు కప్పు
టమాటాలు - 3
నీళ్లు - ముప్పావు కప్పు
రెండవ మసాలా కోసం:
నువ్వుల నూనె - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
లవంగాలు - 3
యాలకులు - 2
దాల్చిన చెక్క - 2 అంగుళాలు
గసగసాలు - 1 టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
బాదం పప్పులు - 20
నీళ్లు - ముప్పావు కప్పు
కుర్మా తయారీకి:
నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
కరివేపాకు - 1 రెమ్మ
చికెన్ - అర కిలో (తొడ భాగాలు అయితే కుర్మాకు చాలా రుచి)
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
బంగాళదుంపలు - 3
నిమ్మరసం - 1 కాయ
కొత్తిమీర - 3 రెమ్మలు

Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాల పొడి వేసి వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గనివ్వండి. ఈ మిశ్రమం చల్లారాక కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌ లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.

-అదే పాన్‌ లో కొద్దిగా నూనె వేసి సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించండి. ఆ తర్వాత గసగసాలు, పచ్చి కొబ్బరి, నానబెట్టిన బాదం పప్పులు వేసి దోరగా వేయించండి. ఇది కూడా చల్లారాక, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్‌ లా రుబ్బి పెట్టుకోండి.

-ఇప్పుడు మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మొదటి మసాలా పేస్ట్‌ ను వేసి, గ్రేవీకి సరిపడా నీళ్లు (సుమారు 2 కప్పులు) పోసి మూతపెట్టి 15 నిమిషాల పాటు ఉడికించండి.

-చికెన్ కాస్త ఉడికాక, బంగాళదుంప ముక్కలు వేసి మరో 15 నిమిషాలు ఉడికించండి. బంగాళదుంపలు మెత్తబడ్డాక, రెండవ మసాలా పేస్ట్‌ ను అందులో వేసి బాగా కలపండి. మీడియం మంటపై కుర్మాను మరో ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి.

-చివరగా కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండితే.. కమ్మటి వాసనతో నోరూరించే పొటాటో చికెన్ కుర్మా రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion