నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తుంటారు. అయితే ఈ దీక్షా సమయంలో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం వల్ల శరీరం నీరసించిపోకుండా, తక్షణ శక్తిని, ఉత్సాహాన్ని అందించే బలమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇందుకు నవరాత్రి స్పెషల్ మఖానా లడ్డూలు బెస్ట్ ఆప్షన్.

మఖానా (తామర గింజలు)లో కాల్షియం, డైటరీ ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్నివ్వడమే కాకుండా, రోజంతా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. మఖానా లడ్డూలను చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే తొమ్మిది రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కమ్మని మఖానా లడ్డూలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Quick Easy Makhana Laddu Recipe in Telugu Healthy Instant Energy Sweet for Navratri Fasting

మఖానా లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

మఖానా (తామర గింజలు) - 2 కప్పులు
స్వచ్ఛమైన నెయ్యి - తగినంత
జీడిపప్పు - 50 గ్రాములు
బాదం పప్పు - 50 గ్రాములు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు (లేదా వేయించిన వేరుశెనగ గుళ్లు)
పంచదార - పావు కప్పు
యాలకులు - 3 లేదా 4

భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?

మఖానా లడ్డు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడెక్కాక 2 కప్పుల మఖానా వేసి, మంటను పూర్తిగా తగ్గించి కరకరలాడే వరకు నిదానంగా వేయించుకోవాలి. మఖానా నెయ్యిని పీల్చుకోవడం వల్ల లడ్డూలకు అద్భుతమైన కమ్మటి రుచి వస్తుంది. వేగిన మఖానాలను ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే బాండీలో మరో చెంచా నెయ్యి వేసి, అందులో 50 గ్రాముల జీడిపప్పు, 50 గ్రాముల బాదం పప్పు వేసి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఆ తర్వాత అర కప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా అందులో వేసి కాసేపు వేయించాలి. కావాలనుకుంటే మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కొబ్బరిని వాడవచ్చు. ఒకవేళ కొబ్బరి ఇష్టం లేనివారు వేరుశెనగలను వేయించి వాడుకోవచ్చు. రెండూ ఇష్టపడే వారు కొద్దికొద్దిగా రెండింటినీ వాడుకోవచ్చు.

-ఒక మిక్సీ జార్ లో పావు కప్పు పంచదార, సువాసన కోసం యాలకులు వేసి మెత్తని పౌడర్‌ లా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే జార్‌ లో చల్లారిన మఖానాలు, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మెత్తని పొడిలా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో రుబ్బిన మఖానా మిశ్రమాన్ని, పంచదార పొడిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం పొడిగా ఉండి చేతికి ముద్దలా రాకపోతే.. కొద్దిగా నెయ్యిని కరిగించి కలుపుకోవాలి.

-ఈ లడ్డూలను ఫ్రిజ్‌ లో పెట్టకుండా బయటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే బైండింగ్ కోసం కేవలం నెయ్యి మాత్రమే వాడాలి. అప్పటికప్పుడే తినేలా అయితే గోరువెచ్చని పాలు కొద్దిగా చల్లుకుంటూ కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. మరింత రుచి కోసం కోవా లేదా కండెన్స్‌డ్ మిల్క్ కూడా కలుపుకోవచ్చు.

-ఒకవేళ మీకు లడ్డూలు చుట్టడం ఇష్టం లేకపోతే.. మఖానా, డ్రైఫ్రూట్స్ పొడిని లేత పంచదార పాకంలో వేసి ప్లేట్‌ కు నెయ్యి రాసి బర్ఫీలా కూడా కట్ చేసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 13, 2026, 10:49 [IST]
Desktop Bottom Promotion