కరకరలాడే పనీర్ కట్లెట్స్..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Posted By:

ప్రోటీన్ల గని అయిన పనీర్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఎవరూ ఉండరు. పనీర్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, క్యాల్షియం పుష్కలంగా అందుతాయి. సాయంత్రం కాగానే ఏదైనా వేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుందా?

వీధి బండ్ల దగ్గర లేదా రెస్టారెంట్లలో దొరికే పనీర్ కట్లెట్స్ రుచి చూసి, అబ్బా.. ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే ఎంత బాగుండు అని మీరెప్పుడైనా అనుకున్నారా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ పనీర్ కట్లెట్ కేవలం 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Restaurant Style Crsipy Paneer Cutlets at Home Quick Easy and High Protein Snack Recipe in Telugu

పనీర్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు

తాజా పనీర్ - 100 గ్రాములు
బంగాళదుంపలు - 3-4
క్యారెట్ - 1
క్యాప్సికమ్ - 1
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర - అర కప్పు
జీలకర్ర - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - పావు టీస్పూన్
ఒరేగానో - పావు టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ - 2 టీస్పూన్లు
చాట్ మసాలా - చిటికెడు
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
మైదా పిండి - 2 టీస్పూన్లు
కార్న్ ఫ్లేక్స్- 2 కప్పులు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

పనీర్ కట్లెట్ తయారీ విధానం

-ముందుగా బంగాళదుంపలను ఉడికించుకొని పక్కన పెట్టుకోండి.

- క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో పనీర్‌ ను చేతితో మెత్తగా చిదుముకోవాలి. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా తురిమి పనీర్‌ లో కలపాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచిన జీలకర్ర, తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, రెండు స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.

-కట్లెట్స్ కరకరలాడటం కోసం ఒక మిక్సీ జార్‌ లో కార్న్ ఫ్లేక్స్‌ ను వేసి బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. మరొక చిన్న గిన్నెలో మైదా పిండి వేసి, అర గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చటి మిశ్రమంలా కలుపుకోవాలి.

-ఇప్పుడు పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన ఆకారంలో చిన్న చిన్న కట్లెట్స్‌ లా ఒత్తుకోవాలి. ఈ కట్లెట్‌ ను ముందుగా మైదా మిశ్రమంలో ముంచి, ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్ పొడిలో లేదా బ్రెడ్ క్రంబ్స్ లో దొర్లించాలి.

-స్టవ్ వెలిగించి, ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేశాక మంటను మీడియంలో పెట్టి కట్లెట్స్‌ ను రెండు వైపులా తిప్పుతూ బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.

-నూనెలో డీప్ ఫ్రై వద్దు అనుకునేవాళ్లు కొద్దిగా నూనె రాసి పెనం మీద ఫ్రై చేసుకోవచ్చు. ఈ కట్లెట్స్‌ ను టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, April 2, 2026, 16:59 [IST]
Desktop Bottom Promotion