ఇడ్లీ, దోశ, అన్నం దేనికైనా సరే ఈ ఒక్క చట్నీ చాలు.. నెల రోజులు నిల్వ ఉంటుంది

Posted By:

ఉదయం టిఫిన్‌ లోకి కాస్త భిన్నంగా, కారంగా, పుల్లగా, తియ్యగా.. ఇలా అన్ని రుచుల సమ్మేళనంతో నోరూరించే కారం చట్నీని ప్రయత్నించండి. ఇది కేవలం రుచిలోనే కాదు, నిల్వ ఉండటంలోనూ దీనికి సాటి లేదు. ఈ చట్నీ పది రోజుల నుంచి నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.

ఈ చట్నీ ఇది వేడి వేడి ఇడ్లీ, మెత్తటి దోశలతోనే కాదు.. పూరీ, చపాతీ, ఊతప్పం వంటి వాటితో కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కారం చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కారం తక్కువగా ఉండే కశ్మీరీ ఎండు మిరపకాయలు- 10
గుంటూరు మిర్చి- 10
చింతపండు - నిమ్మకాయంత
సాంబార్ ఉల్లిపాయలు- 25
వెల్లుల్లి రెబ్బలు - 20
నువ్వుల నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
బెల్లం పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేడి నీళ్లు - అర కప్పు

తయారీ విధానం

-ముందుగా రెండు రకాల ఎండు మిరపకాయల తొడిమలు తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే చింతపండు కూడా వేసి అర కప్పు వేడి నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టండి.

-పది నిమిషాల తర్వాత నానబెట్టిన మిరపకాయలు, చింతపండును నీళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా జతచేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడిచేయండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతుండగా మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.

-పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయి బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి.

-ఉల్లిపాయలు వేగాక అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పేస్టును వేయండి. మిక్సీ జార్‌ లో కొద్దిగా నీళ్లు పోసి, దాన్ని కూడా కడాయిలో వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి 5 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి కలపండి. చట్నీలోని నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు, బెల్లం పొడి వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడికించాలి.

-చట్నీ చిక్కబడి మంచి పరిమళం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా మిగిలిన 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వుల నూనెను పైన వేసి కలపండి. ఇది చట్నీకి అదనపు రుచిని, సువాసనను ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.

-అంతే ఘుమఘుమలాడే కారం చట్నీ రెడీ. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు దీని రుచిని ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 4, 2025, 21:02 [IST]
Desktop Bottom Promotion