రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా..

Posted By:

మనం హోటల్ లేదా రెస్టారెంట్‌ కు వెళ్లినప్పుడు మెనూ చూడగానే నాన్ వెజ్ తినేవాళ్లయితే ముందుగా ఆర్డర్ చేయాలనిపించేది చికెన్ వంటకాలే. పిల్లలైనా, పెద్దలైనా చికెన్ పేరు వినగానే లొట్టలేసుకుంటూ తింటారు. అయితే రెస్టారెంట్లో దొరికే ఆ అద్భుతమైన రుచిని మన ఇంట్లో కూడా ఆస్వాదించాలనుకుంటే తవా చికెన్ బెస్ట్ ఆప్షన్. చాలా త్వరగా, కేవలం కొద్ది నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే అద్భుతమైన వంటకం ఇది. ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్ ఫ్రై మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spicy Juicy and Quick Restaurant Style Tawa Chicken Fry Recipe in Telugu

తవా చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు

ఎముకలు లేని చికెన్ (బోన్‌ లెస్ థై పీసెస్) - 500 గ్రాములు
టమాటాలు - 2
పచ్చిమిర్చి - 3
తరిగిన అల్లం, వెల్లుల్లి - చెరో 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి -అర టీస్పూన్
గరం మసాలా - ముప్పావు టీస్పూన్
వంటనూనె - 3 టేబుల్ స్పూన్లు
తరిగిన కొత్తిమీర - 1 కప్పు
కసూరి మెంతి - 1 టీస్పూన్
పొడవుగా తరిగిన అల్లం- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్.. ఇంట్లోనే పక్కా లోకల్ ఫ్లేవర్‌ తో ఇలా చేసేయండి!

తవా చికెన్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి పెనం (తవా) పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి తక్కువ మంటపై ఓ నిమిషం పాటు వేయించండి. కమ్మని సువాసన వస్తుండగా.. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేయండి.

-ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి చికెన్ ముక్కల రంగు మారేంత వరకు సుమారు 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సరిపడా ఉప్పు వేసి చికెన్‌ కు మసాలాలు పట్టేలా బాగా కలపాలి. మసాలా మాడకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు చల్లి, మీడియం మంట మీద మరో 3 నిమిషాలు వేయించాలి.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి, అవి మెత్తబడే వరకు 3-4 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి, మూతపెట్టి, టమాటాలు గుజ్జులా మారి నూనె పైకి తేలేవరకు సుమారు 10 నిమిషాలు తక్కువ మంటపై ఉడికించాలి. ఆ తర్వాత చేతితో నలిపిన కసూరి మెంతిని చల్లి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.

-చికెన్ చక్కగా ఉడికిన తర్వాత, పొడవుగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. ఇవి చికెన్‌ కు అదనపు రుచిని, ఘాటును ఇస్తాయి.

-చివరగా కొత్తిమీరను పైన చల్లి, మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయండి.

-అంతే తవా చికెన్ ఫ్రై రెడీ. వేడివేడి నాన్, చపాతీ, బటర్ రోటీ లేదా పుల్కాతో దీన్ని వడ్డిస్తే.. మీ ఇంట్లో వాళ్లంతా వేళ్లు నాకుతూ తింటారు.

[ of 5 - Users]
Story first published: Monday, August 3, 2026, 20:00 [IST]
Desktop Bottom Promotion