ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్!

Posted By:

చలికాలం రాగానే మన మనసు వెచ్చని వాతావరణాన్ని, నోరు ఏదైనా తీపిగా, కరకరలాడుతూ ఉండే రుచికరమైన చిరుతిండిని కోరుకోవడం సహజం. చలిగాలిలో ఏదైనా మంచి స్నాక్ తినాలనిపిస్తే..పల్లి పట్టీ లేదా వేరుశెనగ చిక్కీ బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, ఐరన్ అందించే బలవర్థకమైన ఆహారం. అందుకే మీ పిల్లల స్కూల్ లంచ్ బాక్స్‌ లో ప్రతిరోజూ దీన్ని పెట్టి పంపవచ్చు.

అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ పల్లి చిక్కీని బయట కొనడం కంటే, ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు, చిన్న చిట్కాలతో స్వీట్ షాపులో దొరికేలాంటి కరకరలాడే పల్లీ చిక్కీని మీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Winter Special Healthy Snack Easy Homemade Peanut Jaggery Chikki for Kids Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

వేరుశెనగ పప్పు(పల్లీలు) - 250 గ్రాములు
స్వచ్ఛమైన బెల్లం - 200 గ్రాములు
వెన్న - 25 గ్రాములు
నీళ్లు - అర కప్పు
నెయ్యి - కొద్దిగా

జింక్, కాల్షియం, విటమిన్ ఈ, ప్రొటీన్ పుష్కలంగా ఉండే లడ్డు ఇదే ..ఎలా చేసుకోవాలో చూడండి

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అందులో వేరుశెనగలను వేసి, మంటను సిమ్ లో ఉంచి దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే చిక్కీ అంత కరకరలాడుతుంది. పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక పళ్లెంలోకి తీసుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక చేతులతో నలిపి పొట్టును తీసేయాలి. ఇప్పుడు పల్లీలను మరీ మెత్తని పొడిలా కాకుండా, రెండు బద్దలు అయ్యేలా పలుకులుగా ఉండేలా లైట్‌ గా దంచుకోవాలి.

-ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద కడాయి పెట్టి, తురిమిన బెల్లం వేయాలి. అందులో అరకప్పు నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిపోయి, నురగలు వస్తూ ఉడుకుతున్నప్పుడు పాకం చిక్కబడటం మొదలవుతుంది. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిక్కీ కరకరలాడాలంటే ముదురు పాకం రావాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకొని, అందులో పాకం రెండు మూడు చుక్కలు వేయాలి. నీళ్లలో వేసిన పాకం వెంటనే గట్టిపడి, చేత్తో విరిస్తే టప్ మని శబ్దం వస్తే పాకం పర్ఫెక్ట్‌ గా వచ్చినట్లు. లేదంటే మరికొద్దిసేపు ఉడికించాలి.

-పాకం సరైన పదునుకు రాగానే, అందులో వెన్న వేసి కలపాలి. వెన్న వల్ల చిక్కీకి మంచి మెరుపు రావడమే కాకుండా రుచి పెరుగుతుంది. వెంటనే సిద్ధం చేసుకున్న పల్లీల పలుకులను పాకంలో వేసి బెల్లం సమానంగా పట్టేలా వేగంగా కలపాలి.

-ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే ఒక ట్రే కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. స్టవ్ ఆపేసి కడాయిలోని వేడి వేడి మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో పోయాలి. ఒక చెంచాతో లేదా చపాతీ కర్రతో సుమారు ఒక అంగుళం మందం ఉండేలా సమంగా చదును చేసుకోవాలి. మిశ్రమం కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే, పదునైన కత్తితో మీకు నచ్చిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత గాట్లు పెట్టడం కష్టం.

-పల్లి పట్టీ పూర్తిగా చల్లారి, గట్టిపడిన తర్వాత ముందుగా పెట్టిన గాట్ల ప్రకారం ముక్కలుగా విరగ్గొట్టుకోవాలి.

-అంతే కరకరలాడే అద్భుతమైన పల్లి చిక్కీ రెడీ. ఈ ముక్కలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 11, 2026, 16:39 [IST]
Desktop Bottom Promotion