చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే..

Posted By:

దక్షిణ భారత వంటకాల్లో పొడి అంటేనే నోరూరిపోతుంది. రకరకాలుగా చేసే ఈ పొడులు మన భోజనానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉసిరి, కరివేపాకుతో చేసే పొడి చాలా అనువైనది. శీతాకాలంలో లభించే ఉసిరిలో విటమిన్ C పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరంగా ఉండే కరివేపాకులో పోషకాలు మెండుగా ఉంటాయి.

ఈ పొడిలో ప్రోటీన్లు అధికంగా ఉండే వేరుశెనగలు కూడా వాడటం వల్ల చలికాలంలో శరీరానికి కావలసిన బలం లభిస్తుంది. ఈ పొడిని తయారు చేయడం ఎలా, నిల్వ చేయడం ఎలాగో ఇక్కడ చూడండి.

Winter Special Recipe Easy Amla Curry Leaf Podi Packed with Vitamin C Protein

కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు: 200 గ్రాములు
కరివేపాకు: 100 గ్రాములు
వేరుశెనగలు: అర కప్పు
శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు: 8 నుండి 10
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 8 నుండి 10
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత

ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్‌ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి!

తయారీ విధానం

-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఆ తురుములో తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. సమయం ఉంటే ఒకటి రెండు రోజులు ఎండలో ఆరబెట్టవచ్చు. వెంటనే ఆరబెట్టడానికి ఓవెన్‌ ను కూడా ఉపయోగించవచ్చు.

-తర్వాత కరివేపాకును కడిగి పూర్తిగా ఆరనివ్వాలి.

-కరివేపాకు ఆరిన తర్వాత ఒక బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, ఆకులు కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, శనగపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, వేరుశెనగలు వేయాలి. వేరుశెనగలతో సహా అన్ని మసాలా దినుసులను మంచి సువాసన వచ్చి, బంగారు రంగులోకి మారే వరకు వేయించి చల్లారనివ్వాలి.

-వేయించిన దినుసులు చల్లారిన తర్వాత, వాటితో పాటు ఎండిన ఉసిరి తురుము, వేయించిన కరివేపాకు, రుచికి తగినంత ఉప్పును గ్రైండర్‌ లో వేయాలి. పల్స్ మోడ్‌ లో అంటే మధ్యమధ్యలో ఆపుతూ ముతక పొడిగా మారే వరకు రుబ్బాలి.

-రుబ్బిన తర్వాత తయారుచేసిన పొడిని పూర్తిగా చల్లారనిచ్చి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 4 వారాల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.

-వేడివేడి అన్నంలో దేశీ నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అమోఘంగా ఉంటుంది. అంతేకాకుండా దోసె, ఇడ్లీ, పరాఠా, పప్పు-అన్నం లేదా కూరగాయల రోటీలతో కూడా దీనిని వడ్డించుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ దాకా వరకు ఏ సమయంలోనైనా దీనిని ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 18, 2026, 12:58 [IST]
Desktop Bottom Promotion