దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి?

దసరా వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతాయి. అక్టోబర్ 20న విజయదశమి పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు అనగానే ఆధ్యాత్మిక వాతావరణం, మార్మోగే దుర్గామాత నామస్మరణలు మనసును పులకరింపజేస్తాయి.

అయితే పూజారి అవసరం లేకుండానే, తొమ్మిది రోజుల పాటు ఇంట్లో కలశ ప్రతిష్ఠాపన చేసి, పద్ధతిగా పూజను ఎలా చేయాలో, ఎలాంటి ఇబ్బందీ లేకుండా అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చో ఇక్కడ చూడండి.

How to Do Kalasha Sthapana for Navaratri Easy Dussehra Navaratri Pooja Process at Home

కలశ ప్రతిష్ఠాపన

ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని, ఒక చెక్క పీఠంపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచి, అమ్మవారి పటాన్ని ఉంచండి. కలశం కోసం వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి పాత్రను ఎంచుకోండి. ఒక పళ్లెంలో కొద్దిగా బియ్యం పోసి, దానిపై ఖాళీ కలశాన్ని ఉంచండి. కలశం మెడకు పవిత్రమైన దారం కట్టి, పసుపు-కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత అందులో స్వచ్ఛమైన నీరు, కొద్దిగా గంగాజలం, పసుపు అక్షతలు, ఒక నాణెం, వక్క వేయండి. కలశంపై 5 మామిడి లేదా అశోక ఆకులు ఉంచి, వాటి మధ్యలో ఎర్రటి వస్త్రంతో చుట్టిన కొబ్బరికాయను (కుచ్చు పైకి ఉండేలా) ప్రతిష్ఠించండి. పూజకు అవసరమైన పసుపు, కుంకుమ, అక్షతలు, దీపారాధన సామగ్రి, పూలను ముందే సిద్ధం చేసుకోండి.

నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలానవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా

భక్తిపూర్వక ఆరాధన

పూజకు ముందు మీపై, పూజా ద్రవ్యాలపై కొద్దిగా నీరు చల్లుకుని శుద్ధి చేసుకోండి. తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిని స్మరించి, పూజ నిర్విఘ్నంగా సాగాలని వేడుకోండి. తర్వాత కుడిచేతిలో అక్షతలు, ఓ పువ్వు పట్టుకుని.. హే జగన్మాతా నేను చేస్తున్న ఈ నవరాత్రి పూజను స్వీకరించి, మా కుటుంబానికి ఆయురారోగ్యాలు, జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదించు అని మనసారా సంకల్పం చెప్పుకుని వాటిని అమ్మవారికి సమర్పించండి. ఉపవాసం ఉండేవారు ఆ విషయాన్ని కూడా సంకల్పంలో మనవి చేసుకోవాలి. ప్రతిరోజూ కొత్త కలశాన్ని పెట్టాల్సిన పనిలేదు. అదే కలశానికి 9 రోజుల పాటు ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ.. ధూప, దీప, నైవేద్యాలు (పండ్లు లేదా ఇంట్లో వండినవి) సమర్పించి ఆరాధించాలి.

నవరాత్రుల తర్వాత సామాగ్రిని ఏం చేయాలి?

పూజ పూర్తయ్యాక కలశంలోని నాణేన్ని మీరు దాచుకునే డబ్బుల్లో లేదా పూజా సామాగ్రిలో ఉంచుకోవచ్చు. కొబ్బరికాయను కుటుంబ సంప్రదాయాన్ని బట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఎర్రటి వస్త్రంలో చుట్టి దేవుడి గదిలో భద్రపరుచుకోవచ్చు. కలశం కింద పళ్లెంలో ఉంచిన బియ్యాన్ని పారేయకుండా, పాయసం లేదా అన్నంగా వండి ప్రసాదంగా స్వీకరించడం ఉత్తమం అని పలువురు పండితులు చెబుతుంటారు. ఇక వాడిపోయిన పూలు, ఆకులను తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి.

Story first published: Saturday, October 10, 2026, 14:00 [IST]
Desktop Bottom Promotion