తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!

తెలంగాణ అనగానే ఆధ్యాత్మికంగా మొదటగా గుర్తొచ్చేది బతుకమ్మ, తర్వాత బోనాలు. శక్తికి ప్రతీక అయిన అమ్మవార్లను భక్తితో కొలుస్తూ, సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి ఈ పండుగలు. ఇక, ఇప్పుడు ఆషాఢ మాసంలో తొలి బోనాల వేడుకలు సైతం మొదలై రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మరి, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బోనాల ప్రత్యేకత ఏంటి.? ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక చరిత్ర ఏంటి.? ఈ కథనంలో తెలుసుకుందాం.

telangana bonalu started know the significance and spiritual reasons behind the celebrations

ఆషాఢం ప్రారంభం నుంచి శ్రావణ మాసం పూర్తయ్యే వరకు దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ దేవతలకు, అమ్మవార్లు బోనాలు సమర్పిస్తారు. చీరాసారెతో ఇంటి ఆడపడుచుగా గౌరవాన్ని ఇస్తారు. సుఖశాంతుల్లో, కష్ట కాలంలో తోడుండమని మొక్కుతూ మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్‌ మహానగరంలో దశల వారీగా బోనాల వేడుక ఒక్కో ప్రాంతంలో కన్నులపండువగా జరుగుతుంది. ఇక్కడ ముగిసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఊరంతా ఒక్కసారిగా గ్రామ దేవతల గుళ్లకి కదిలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఊరేగింపుల నడుమ మహిళలు తలపై బోనం మోసుకుంటూ అమ్మవారికి పరమాన్నం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

బోనం అంటే ఏంటి.?

బోనం అంటే భోజనం. భోజనం పదం నుంచి బోనం ఉద్భవించింది. కొత్త మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలో అన్నం, బెల్లం, పాలతో నైవేద్యం వండుతారు. కుండను పసుపు, కుంకుమతో అలంకరించి వేప మండలు, మామిడి ఆకులు, పూలతో సుందరంగా అలంకరిస్తారు. ఆ కుండలో పరమాన్నం నింపి.. పై నుంచి దీపం వెలిగించి భక్తితో గ్రామ దేవతకు సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు అంది కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు అందుతాయని నమ్మకం.

పురాణ కథ

రాష్ట్రంలో ఒకప్పుడు అంటువ్యాధుల కారణంగా ప్రజలు నరకయాతన అనుభవించేవారు. ఒకానొక సమయంలో ఈ వ్యాధుల నుంచి అమ్మవారు తమను కాపాడిందనే నమ్మకంతో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేసి బోనాల వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు.. ప్రజల విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక.

telangana bonalu started know the significance and spiritual reasons behind the celebrations

ఆషాఢంలోనే ఎందుకంటే..

ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి రావడం సంప్రదాయం. ఈ మాసంలోనే శక్తి స్వరూపిణి కూడా భక్తుల వద్ద ఉంటుందని విశ్వసిస్తుంటారు. అందుకే అమ్మవారిని కూతురిలా భావించి బోనం, చీర, సారె, పూలు, పండ్లతో గౌరవిస్తారు. అందుకే హిందూ సంప్రదాయం ఆచరించే ప్రతి గడపా పచ్చని తోరణాలతో కళకళలాడుతూ బోనాల వేడుకతో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది.

చారిత్రక మూలాలు

తెలంగాణలో బోనాల పండుగ ఉనికి 13వ శతాబ్దపు కాకతీయుల కాలం అంటే దాదాపు 600 ఏళ్ల క్రితం నాటి నుంచే ఉన్నట్లు ఆధారాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. రాణి రుద్రమదేవి వరంగల్ జిల్లా మొగిలిచర్ల ఏకవీరా దేవికి బోనం సమర్పించినట్లు చారిత్రక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.

1675లో కుతుబ్‌షాహీ కాలంలో గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని తానీషా కాలంలో మంత్రులైన అక్కన్న, మాదన్నలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి నేటివరకు తొలి బోనం గోల్కొండ కోటలోనే సమర్పించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది.

1813 లో బ్రిటీష్‌ కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ప్లేగు వ్యాధి ప్రబలింది. ఈ కారణంగా వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో సికింద్రాబాద్‌లో పనిచేసే సైనికులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి మహిమతో వ్యాధి నయమైంది. అందుకు కృతజ్ఞతగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి బోనాలు ఎత్తడం ప్రారంభించగా.. ఆ సాంప్రదాయం నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది.

మొదటగా ఎక్కడంటే..

తెలంగాణలో ఆషాఢంలో మొదటి బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమై.. తర్వాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయం, హైదరాబాద్‌ లాల్‌ దర్వాజా సింహవాహిని ఆలయం, ఇలా తర్వాతతర్వాత నగరంలోని శక్తి స్వరూపిణి ఆలయాల్లో బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతూ వస్తాయి. చివరిగా ఘటాల ఊరేగింపు ఆకట్టుకుంటుంది.

జూలై 16 గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జూలై 19న తొలి బోనంతో ప్రారంభమై, లష్కర్ ఘటోత్సవం ఘనంగా జరిగింది. ఆగష్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ప్రధాన బోనాలు జరగనున్నాయి. మూడో తేదీన రంగం కార్యక్రమం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. తొమ్మిదో తేదీన లాల్ దర్వాజా, పాతబస్తీ ప్రాంతాల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి. పదో తేదీన ఘటాల ఊరేగింపుతో నగరంలో మహోత్సవాలు ముగియనున్నాయి.

Story first published: Monday, July 20, 2026, 18:14 [IST]
Desktop Bottom Promotion