మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!

మరణం అంచున ఉన్న రోగి.. అవయవ దానం చేసే దాత కోసం ఎదురుచూపులు.. సమయం మించిపోతోంది. ఇలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో జంతువుల అవయవాలు మనుషుల పాలిట సంజీవనిగా మారితే? అవును మీరు వింటున్నది నిజమే. వైద్య చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం.

2022లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో తొలిసారిగా ఓ వ్యక్తికి పంది గుండెను విజయవంతంగా అమర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌ లో రిచర్డ్ స్లీమాన్ అనే 60 ఏళ్ల వృద్ధుడికి తొలిసారిగా పంది కిడ్నీని అమర్చారు. ఆ కిడ్నీతో ఆయన కొన్ని రోజుల పాటు జీవించగలిగారు. ఈ అద్భుతాల పరంపరలో మరో సంచలనం న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ ఉదంతం.

271 Days with a Pig s Kidney The Medical Miracle That Saved a Dying Man

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ..డయాలసిస్ పై ఆధారపడిన టిమ్ రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. ఆయనకు సరిపోయే కిడ్నీ దాత కోసం డాక్టర్లు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. ఆయన శారీరక పరిస్థితి క్షీణిస్తూ, ప్రాణాలు గాల్లో దీపంలా మారిన ఆ క్షణంలో..డాక్టర్లు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.

దాత దొరికేలోపు తాత్కాలిక ప్రత్యామ్నాయంగా అతనికి పంది కిడ్నీని అమర్చారు. ఆశ్చర్యకరంగా ఆ కిడ్నీ ఏకంగా 271 రోజుల పాటు ఆయన శరీరంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, డయాలసిస్ అవసరం కూడా లేకుండా పనిచేసి, ఆ వృద్ధుడికి ప్రాణదానం చేసింది.

జంతువు అవయవాన్ని మనిషికి ఎలా అమర్చుతారు?

ఈ విధానాన్నే వైద్య పరిభాషలో జెనోట్రాన్స్‌ ప్లాంట్ అంటారు. సహజంగా వేరొక జంతువు అవయవాన్ని మనిషికి అమర్చినప్పుడు, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానిని ఒక పరాయి శత్రువుగా భావించి వెంటనే దాడి చేస్తుంది. గుండె, కిడ్నీ, కాలేయం లాంటివి అమర్చినప్పుడు నిమిషాల్లోనే హైపర్‌ అక్యూట్ రిజెక్షన్ జరిగి, శరీరంలో ద్రవాలు పేరుకుపోయి అవయవం నాశనమవుతుంది.

అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా?

టిమ్ విషయంలో ఈ ముప్పును ఎలా దాటారు?

ఇక్కడే జన్యు సవరణ టెక్నాలజీ అద్భుతం చేసింది. పంది శరీరం నుండి తీసుకున్న కిడ్నీలోని జన్యు నిర్మాణాన్ని ఆధునిక పరిజ్ఞానంతో మార్చేశారు. ఆ కిడ్నీని మానవ శరీరానికి సరిపోయేలా, రోగనిరోధక వ్యవస్థ తిరస్కరించని విధంగా ముందుగానే మార్పులు చేసి, ఆ తర్వాతే దాన్ని టిమ్ శరీరంలోకి ప్రవేశపెట్టారు. అందుకే అతని శరీరం దానిని అంగీకరించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవ దాతల కొరత తీవ్రంగా ఉంది. అవయవాలు దొరకక ఎంతోమంది కన్నుమూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పందుల గుండెలు, కిడ్నీలు ఆపద్బాంధవులుగా మారతాయని శాస్త్రవేత్తలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతానికి జంతువుల అవయవాలు మనుషుల్లో కొద్ది కాలం పాటు మాత్రమే మనుగడ సాగిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో జన్యు సాంకేతికతలో మరిన్ని మార్పులు తీసుకురావడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపే దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, September 7, 2026, 16:40 [IST]
Desktop Bottom Promotion