షుగర్ పేషెంట్లకు శీతాకాల హెచ్చరిక!..చిన్న పగులే కదా అని నిర్లక్ష్యం చేస్తే..కాలు తీసేయాల్సి రావొచ్చు!

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం అందరికీ సహజమే. కానీ మీరు షుగర్ పేషెంట్ అయితే మాత్రం ఈ చిన్న మార్పును కూడా తేలికగా తీసుకోకూడదు. చలికాలం షుగర్ పేషెంట్ల పాదాలకు ఒక సవాలుగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని అనేక వ్యవస్థలపై ప్రభావం పడుతుంది, ముఖ్యంగా పాదాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

అసలు ప్రమాదం ఎక్కడ ఉంది?
మధుమేహ రోగులలో న్యూరోపతి అనే సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. అంటే, రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో లేనప్పుడు పాదాలలోని సన్నని నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల పాదాలకు స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. ఫలితంగా కాలికి చిన్న దెబ్బ తగిలినా, కోసుకున్నా, లేదా వేడి నీళ్లు పడినా నొప్పి తెలియదు.

5 Winter Foot Care Mistakes every Diabetic must avoid

ఇలా స్పర్శ లేకపోవడం వల్ల చిన్న గాయాలు కూడా గుర్తించలేనంతగా మారి, పెద్ద ఇన్ఫెక్షన్లుగా మారుతాయి. డయాబెటిస్ వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఈ గాయాలు త్వరగా మానవు సరికదా, ఒక్కోసారి గ్యాంగ్రీన్ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి.

మాయిశ్చరైజర్ వాడకంలో చేస్తున్న తప్పులు
శీతాకాలంలో పాదాలు పగులుతాయని చాలామంది మాయిశ్చరైజర్లు, నూనెలు రాస్తుంటారు. ఇది మంచిదే కానీ డయాబెటిక్ రోగులు దీనిని వాడే విధానంలోనే అసలు సమస్య ఉంది. చాలామంది కాలి వేళ్ల మధ్య కూడా దట్టంగా క్రీమ్ రాస్తుంటారు.

ఇలా చేయడం వల్ల వేళ్ల మధ్య తేమ నిలిచిపోయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల చర్మం తెల్లగా మారి, పగుళ్లు వచ్చి, రక్తం లేదా ద్రవం కారడం మొదలవుతుంది. ఇది పాదాలకు అత్యంత ప్రమాదకరం.

మధుమేహ రోగులు పాటించాల్సిన సేఫ్టీ చిట్కాలు

-పాదాల అడుగు భాగం, మడమలు, పాదం పైభాగంలో మాత్రమే మాయిశ్చరైజర్ రాయండి. కాలి వేళ్ల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీమ్ రాయకూడదు. ఆ ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

-సువాసనలు,ఆల్కహాల్ లేని మాయిశ్చరైజర్లనే వాడాలి. ముఖ్యంగా యూరియా ఎక్కువగా ఉండే క్రీమ్స్ వాడటం వల్ల పగుళ్లు త్వరగా తగ్గుతాయి మరియు చర్మం మృదువుగా మారుతుంది.

-ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మెత్తని టవల్ తో, ముఖ్యంగా వేళ్ల మధ్య తడి లేకుండా సున్నితంగా తుడవాలి.

- మీకు స్పర్శ తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజూ మీ పాదాలను అద్దంలో చూసుకోండి. చర్మం ఎర్రగా మారినా, నల్లని మచ్చలు వచ్చినా, బొబ్బలు లేదా పగుళ్లు కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

- ఇవి కేవలం ఫ్యాషన్ కోసం కాదు, రక్షణ కోసం. బిగుతుగా ఉండే బూట్లు కాకుండా, మృదువైన, సౌకర్యవంతమైన షూస్ వాడండి. సాక్సులు కూడా కాటన్ వి మాత్రమే వాడాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, November 29, 2025, 8:49 [IST]
Desktop Bottom Promotion