సైలెంట్ గా లక్షల మంది ప్రాణాలు తీసేస్తున్న వ్యాధి..చివరి దాకా బయటపడట్లేదు..వైద్య నిపుణుల హెచ్చరిక

మన శరీరంలోకి ఓ సైలెంట్ కిల్లర్ చొరబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కనిపించని శత్రువు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య నిపుణులు దీని గురించి అత్యంత తీవ్రమైన హెచ్చరికను జారీ చేశారు. ప్రభుత్వాలు, ప్రజలు తక్షణమే మేల్కోకపోతే మానవాళి ఓ పెను ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. ఆ భయంకరమైన వ్యాధి పేరే క్రానిక్ లివర్ డిసీజ్ (దీర్ఘకాలిక కాలేయ వ్యాధి). ఇటీవల స్పెయి న్‌లోని బార్సిలోనాలో జరిగిన ప్రపంచస్థాయి సమావేశంలో 100 మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు ఈ ప్రమాద ఘంటికలు మోగించారు. వారి పరిశోధన వివరాలు ప్రఖ్యాత ది లాన్సెట్ రీజినల్ హెల్త్ యూరప్ అనే జర్నల్‌ లో పబ్లిష్ అయ్యాయి.

ఏమిటీ నిశ్శబ్ద వ్యాధి? దాని రూపాలేంటి?

ఈ దీర్ఘకాలిక కాలేయ వ్యాధిలో ప్రధానంగా రెండు దశలుంటాయి.

MASLD - మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్..ఇది వ్యాధి యొక్క తొలిదశ. జీవక్రియలో లోపాల కారణంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం ఇది మొదలవుతుంది. చాలామందిలో ఇది ఎటువంటి లక్షణాలూ చూపించదు. దీన్నే మనం ఫ్యాటీ లివర్ అని కూడా పిలుస్తుంటాం.

MASH - మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్.. ఇది MASLD తీవ్రమైన, ప్రమాదకరమైన రూపం. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కారణంగా అక్కడ వాపు , గాయాలు ఏర్పడతాయి. ఈ దశను కూడా ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టం. దీనికి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోతే ఇది ప్రాణాంతకమైన సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌గా పరిణమిస్తుంది.

Global Alarm Experts Warn of Looming Liver Disease Crisis

ఎందుకింత ప్రమాదకరం?
ఈ వ్యాధిని సైలైంట్ కిల్లర్ అని పిలవడానికి కారణం దాని స్వభావమే. వ్యాధి ముదిరి, కాలేయం దాదాపు 70-80 శాతం దెబ్బతినే దాకా కూడా చాలా మందిలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనబడవు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 శాతం మంది పెద్దలు MASLDతో బాధపడుతున్నారని, వారిలో 5 శాతం మందికి పైగా ప్రమాదకరమైన MASH దశకు చేరుకుంటున్నారని అంచనా. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ వ్యాధి ఉన్న చాలా మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియదు.

వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత చికిత్స అంత సులభం.. కాలేయంలో గాయాలు ఏర్పడి ఫైబ్రోసిస్‌గా మారితే దాన్ని అదుపు చేయడం చాలా కష్టతరం అవుతుంని ఈ అధ్యయన ప్రధాన రచయిత ISGlobal హెల్త్ లివర్ గ్రూప్ అధిపతి జెఫ్రీ లాజర్ హెచ్చరించారు.

Global Alarm Experts Warn of Looming Liver Disease Crisis

ఎవరికి ప్రమాదం ఎక్కువ?
ఈ వ్యాధి రావడానికి మద్యం మాత్రమే కారణం కాదు. మన మారిన లైఫ్ స్టైలే దీనికి ప్రధాన శత్రువు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నోళ్లకు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, హై బీపీ, ఇతర జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నోళ్లకి ఈ వ్యాధి ఎటాక్ అయ్యే ప్రమాదం ఎక్కవగా ఉంటదని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి ముదిరితే కనిపించే లక్షణాలు
వ్యాధి MASH దశకు చేరి కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ లక్షణాలు ఏంటంటే..తీవ్రమైన అలసట,పొట్ట కుడివైపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం, కండరాల బలహీనత, కాళ్లు లేదా పొట్టలో వాపు, కళ్లు చర్మం పసుపు రంగులోకి మారడం వంటివి ఈ వ్యాధి ముదిరితే కనబడే లక్షణాలు. ఈ సైలెంట్ కిల్లర్ ను ఎదుర్కోవడానికి ముందస్తు గుర్తింపు, వ్యక్తిగత సంరక్షణే మార్గాలని నిపుణులు చెబుతున్నారు.

Global Alarm Experts Warn of Looming Liver Disease Crisis

ఇవి పాటించండి

రెగ్యులర్ చెకప్‌లు
ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు ఏ లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

జీవనశైలి మార్పులు
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు, ప్రారంభ దశలో ఉంటే తిప్పికొట్టవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion