తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తప్పని సీజనల్‌ వ్యాధుల బెడద.. మీ పిల్లలను ఇలా కాపాడుకోండి.!

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. వేసవి తాపం నుంచి బయటపడి చిరుజల్లులకి స్వాగతం పలకడంతో పాటు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు పిల్లలు బడి వైపు పరుగులు పెడుతుంటారు. ఈ క్రమంలో వర్షాకాలం నేపథ్యంలో పిల్లలు వివిధ రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకోసం చిన్నారుల తల్లిదండ్రులకు పీడియాట్రిషనిస్టులు కీలక సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

Monsoon season diseases affect on children key precautions to care them

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో పిల్లలు రోగాన బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్‌లో తోటి విద్యార్థులతో ఎక్కువ సమయం గడపడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ కాలంలో పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం కనిపెట్టుకొని ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులు

మాన్‌సూన్‌ సీజన్‌లో వాతావరణం తేమతో నిండి ఉంటుంది. అంతేకాకుండా రోడ్లపై బురద, కొత్త నీరు రాకతో నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని సందర్భాల్లో తాగు నీరు కలుషితమైన పిల్లలు రోగాన బారిన పడే ప్రమాదం ఉంది. నీటి కాలుష్యం వల్ల ముఖ్యంగా జలుబు, ఫ్లూ, దగ్గు, విరేచనాలు వంటి వ్యాధులతో పాటు రోగనిరోధక శక్తి తక్కువై పొట్ట ఇన్‌ఫెక్షన్లకి దారి తీస్తుంది.

రోడ్లపై గుంతల్లో నీటి నిల్వ కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతుంది. దీంతో డెంగ్యూ, మలేరియా బారిన పడే ప్రమాదం ఉంది. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, దద్దుర్లు, దురద, టైఫాయిడ్‌, దీర్ఘకాలిక జ్వరం, కడుపు నొప్పి, నీరసం వంటి వ్యాధులతో పిల్లలు ఇబ్బందులకు గురవుతారు. అంతేకాకుండా నీరు, ఆహారం కలుషితమై లివర్‌ ఇన్‌ఫెక్షన్లు, కామెర్లు వంటి వ్యాధులకు ఆస్కారం ఎక్కువగా ఉంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా మీ పిల్లలు వ్యాధుల నుంచి పోరాడేందుకు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇన్‌ఫెక్షన్లతో పోరాడగలరు. అందుకోసం చిన్నారుల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్‌ పెంచేందుకు విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నారింజ, జామకాయలు, బొప్పాయి వంటి పండ్లను ఇవ్వాలి. వర్షాకాలంలో నీళ్లలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే వారి కాచి చల్లార్చిన లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని ఇవ్వాలి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలంలో బయట ఎక్కువగా ఆడుకోకుండా.. ఇంట్లోనే వ్యాయామం, యోగా వంటి వాటిని చేసుకునేలా ప్రోత్సహించాలి.

చిన్నారులకి కాలానుగుణంగా రోగాలను తట్టుకునేందుకు టీకాలు చాలా అవసరం. ముఖ్యంగా వర్షాకాలంలో పీడియాట్రిషన్‌ను సంప్రదించి వారి సలహాతో వ్యాక్సినేషన్‌ వేయించడం ఉత్తమం. ఈ కాలంలో పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఆటలు ఆడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా స్నానం చేయడం మంచిది. అంతేకాకుండా ఇల్లు, ఇంటి పరిసరాలు క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఈ కాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌కి పిల్లలను దూరంగా ఉంచాలి. ఇంట్లోనే తాజాగా వండిన ఆహారాన్ని ఇవ్వాలి. రాత్రి పడుకునే సమయంలో గోరు వెచ్చని పాలలో పసుపు, లేదా శొంఠి పొడి కలిపి ఇవ్వడం ద్వారా యాంటీబాక్టీరియల్‌ లక్షణాలు పెరిగి ఇమ్యూనిటీ పెరుగుతుంది.

వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉన్న కారణంగా ఇంట్లో బకెట్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు రెయిన్‌ కోట్లు, గొడుగులు తప్పని సరి. మస్కిటో నెట్స్‌, నివారకాలు తప్పనిసరి. పిల్లలకు అనారోగ్యంగా అనిపిస్తే ఆ రోజు స్కూల్‌కి పంపించడం మానుకోండి. లేదంటే ఇతర పిల్లలకి వైరల్‌ ఫీవర్‌ సోకే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, June 10, 2026, 10:58 [IST]
Desktop Bottom Promotion