ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి

Posted By:

ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్లు చేసుకుని, తిని బోర్ కొట్టేసిందా? కొత్తగా,అద్భుతంగా ఉంటే ఏదైనా స్వీట్ తినాలని మీ నాలుక గుంజేస్తుందా? అయితే మీరు ముంబైకి చెందిన ఫేమస్ బాంబే ఐస్ హల్వా రుచి చూడాల్సిందే. దీన్నే మాహిమ్ హల్వా లేదా పేపర్ హల్వా అని కూడా పిలుస్తారు.

పండుగకైనా, ఇంట్లో ఏదైనా వేడుకకైనా ఈ స్వీట్ మీ అతిథులను ఆకట్టుకోవడం ఖాయం. కాగితంలా పలచగా, చూడగానే నోరూరించే బాంబే ఐస్ హల్వా ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

How to Make Famous Bombay Ice Halwa at Home Deepavali Special Sweet Paper Halwa Recipe in Telugu

కావలసిన పదార్థాలు

మైదా పిండి - పావు కప్పు
నెయ్యి - పావు కప్పు
పాలు - పావు కప్పు
చక్కెర - అర కప్పు
కుంకుమపువ్వు - కొన్ని రేకులు
యాలకుల పొడి - తగినంత
సన్నగా తరిగిన పిస్తా, జీడిపప్పు - అలంకరణకు సరిపడా
ఎండిన గులాబీ రేకులు - కొద్దిగా

తయారీ విధానం

-ముందుగా వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమపువ్వు రేకులు నానబెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ వెలిగించకుండానే ఒక వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అందులో మైదా, నెయ్యి, పాలు, చక్కెర వేసి ఉండలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి.

-అన్నీ చక్కగా కలిసిన తర్వాత, స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఈ మిశ్రమం నెమ్మదిగా చిక్కబడే వరకు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గరపడుతున్న సమయంలో.. ముందుగా వేడి పాలలో నానబెట్టుకున్న కుంకుమపువ్వు, అలాగే కమ్మని సువాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలపండి.

-ఈ హల్వా మిశ్రమం పాన్ అంచుల నుండి విడిపోతూ, గిన్నెకు అంటుకోకుండా నిగనిగలాడుతూ వచ్చేంతవరకు ఉడికించాలి.

-హల్వా వేడిగా ఉన్నప్పుడే దాన్ని నెయ్యి రాసిన బేకింగ్ పేపర్ లేదా బట్టర్ పేపర్ పైకి మార్చాలి. దానిపై నెయ్యి రాసిన మరో బేకింగ్ పేపర్‌ ను ఉంచి, చపాతీ కర్రతో కాగితంలా పలచగా రుద్దుకోవాలి.

-ఇప్పుడు పైనున్న పేపర్‌ ను మెల్లగా తీసేసి.. సన్నగా తరిగిన పిస్తా, జీడిపప్పు పలుకులు, గులాబీ రేకులను హల్వాపై చల్లుకోవాలి. ఇవి హల్వాలో ఇమిడిపోయేలా పేపర్ కప్పి మరోసారి నెమ్మదిగా రోల్ చేయాలి.

-ఈ హల్వాను కనీసం 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైన ఆకారంలో (చతురస్రాకారంగా) ముక్కలుగా కోసుకోండి. పూర్తిగా సెట్ అవ్వడానికి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే.. పర్ఫెక్ట్ ఐస్ హల్వా రెడీ.

పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా

పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు

-హల్వాను స్టవ్‌ పై ఉడికించడం ప్రారంభించే ముందే బేకింగ్ పేపర్‌ కు నెయ్యి రాసి, చపాతీ కర్రను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే వెంటనే పలచగా రుద్దాలి, లేకపోతే గట్టిపడుతుంది.

-పేపర్ హల్వా అంటేనే దాని పలచదనం. కాబట్టి అన్ని వైపులా సమానంగా, వీలైనంత పలచగా ఒత్తుకుంటేనే అసలైన ఆకృతి వస్తుంది.

-హల్వా ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే, ప్రతి రెండు ముక్కల మధ్య బేకింగ్ పేపర్ ఉంచి, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌ లో భద్రపరచుకోండి.

[ of 5 - Users]
Story first published: Thursday, November 5, 2026, 13:54 [IST]
Desktop Bottom Promotion