హిమాలయాల్లో పండే ఈ పండు తింటే..గుండెకు బలం, ఎముకలకు పటుత్వం

హిమాలయాల చల్లని ఒడిలో లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లటి ప్రాంతాల్లో పండే ఓ అద్భుతమైన ఫలం ఆప్రికాట్. చూడగానే నోరూరించే పసుపు,నారింజ వర్ణంలో.. తియ్యగా, రసభరితంగా ఉండే ఈ పండును తాజాగానైనా, ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్‌గానైనా ఆస్వాదించవచ్చు. ఈ చిన్న పండులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఫైబర్, ఐరన్, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా,అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

జీర్ణశక్తికి జీవం
ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఉదయాన్నే ఆప్రికాట్ తినడం ఎంతో శ్రేయస్కరం. ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం తర్వాత దీన్ని తీసుకోవచ్చు. అయితే మీకు ఇప్పటికే కడుపు సంబంధిత సమస్యలుంటే, ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిది. ఉదయంపూట ఆప్రికాట్ తింటే మీ శరీరం రోజంతా నూతనోత్తేజంతో తొణికిసలాడుతుంది, అలసట అన్నదే దరిచేరదు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్, మీ జీర్ణ ప్రక్రియను సజావుగా నడిపించి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో సతమతమయ్యేవారు రోజూ 2 నుండి 3 ఆప్రికాట్లు తింటే, అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది.

Nature s Candy Apricot s Health and Beauty Benefits

మెరిసే చర్మానికి మంత్రం

విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు... ఇవన్నీ ఆప్రికాట్‌లో సమృద్ధిగా ఉండి మీ చర్మాన్ని మచ్చలు లేని, కాంతివంతమైన సౌందర్యంతో మెరిపిస్తాయి. ఆప్రికాట్‌ ను తినడమే కాదు, దాని గుజ్జును ముఖానికి రాసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ చర్మంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. వయసుతో పాటు వచ్చే ముఖంపై ముడతలా? వాటికీ ఇది చెక్ పెడుతుంది! సూర్యరశ్మి ప్రభావంతో కమిలిన చర్మానికి ఆప్రికాట్ ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీని నూనెను చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా, తేమగా మారి మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది.

చూపునకు చురుకుదనం
ఆప్రికాట్‌ పండ్లలో సమృద్ధిగా లభించే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ మీ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కళ్లు పొడిబారడం వంటి సమస్యలను నివారించి, కంటిశుక్లం వంటి వ్యాధులను కూడా మన దరికి చేరకుండా అడ్డుకుంటాయి. గంటల తరబడి మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుని పనిచేసే వారికి ఈ పండు ఓ వరం లాంటిది.

గర్భిణులకు అమృత ఫలం
గర్భధారణ సమయంలో స్త్రీలకు ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలు చాలా ముఖ్యం. కానీ,చాలామంది మహిళలు ఈ సమయంలో రక్తహీనత బారిన పడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి ఆప్రికాట్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే ఐరన్, రాగి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి, రక్తహీనతను సమర్థవంతంగా తొలగిస్తాయి. అంతేకాదు, ఇందులో ఉండే ఫోలేట్, గర్భంలో పెరుగుతున్న శిశువు సంపూర్ణ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. పాలిచ్చే తల్లులు కూడా ఈ పండును తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గుండెకు బలం
ఆప్రికాట్ పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారు ప్రతిరోజూ ఈ పండును తినడం వల్ల, వారి ఎముకలు బలహీనపడకుండా నిరోధించడమే కాకుండా మోకాళ్ల నొప్పుల వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. ఆప్రికాట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి, మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యను కూడా ఇది దరిచేరనీయదు.

మధుమేహానికీ
ఇది తిన్న వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచదు. ఇందులో సహజ చక్కెరలు కూడా తక్కువ మోతాదులో ఉండటం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ఈ పండును రుచి చూడవచ్చు. అయితే దీన్ని తాజాగా మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. ఎండిన ఆప్రికాట్లు (డ్రై ఆప్రికాట్స్) తినాలనుకుంటే,ముందుగా వాటిని నీటిలో కొంత సమయం నానబెట్టి, ఆ తర్వాత తీసుకోవడం మంచిది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, May 25, 2025, 23:06 [IST]
Desktop Bottom Promotion