తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్‌ వీడియో.!

ఫుడ్‌ డెలివరీ ఆలస్యమైందని కోపంతో హైదరాబాద్‌లో దంపతులు.. జొమాటో డెలివరీ బాయ్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. చుట్టూ జనం చూస్తున్నా కోపం పట్టలేక కర్రతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Couple attacks Zomato delivery boy over delayed food video goes viral

ఉద్యోగం, వ్యాపారాలతో బిజీ లైఫ్‌ గడుపుతున్నా, కిచెన్‌లోకి వెళ్లే తీరిక, ఓపిక లేక ఆకలికి ఆగలేకపోతే క్షణాల్లో కావాల్సిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుని నిమిషాల్లో ఇంటికి తెప్పించేసుకుంటున్నాం. కస్టమర్ల డిమాండ్‌కి అనుగుణంగా ఫుడ్‌ డెలివరీ సంస్థలు సైతం పోటాపోటీగా త్వరగా ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు శ్రమిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా డెలివరీ ఏజెంట్లు సైతం కష్టపడుతున్నారు. సమయానికి ఫుడ్‌ డెలివరీ చేయడంలో వారి కృషి అభినందనీయం. అయితే ఒక్కోసారి టెక్నికల్‌ కారణాల వల్ల, లేదా ట్రాఫిక్‌ ఇతరత్రా సమస్యల కారణంగా భోజనం అందించడం ఆలస్యం కావచ్చు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుంటే.. మరికొందరు మందలించి రేటింగ్‌ తక్కువ ఇచ్చి వదిలేస్తారు. కానీ ఈ జంట మాత్రం అందుకు విరుద్ధం. సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకోలేదు. డెలివరీ బాయ్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వాసవినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే దంపతులు జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సదరు డెలివరీ బాయ్‌ ఆలస్యంగా ఫుడ్‌ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో భోజనం ఆలస్యంగా తీసుకొచ్చాడనే కోపంతో అతడిని ప్రశ్నించారు. మ్యాప్‌లో లొకేషన్‌ తప్పుగా చూపించిందని అందుకే ఆలస్యమైందని వివరించినా.. ఆ దంపతులు పట్టించుకోలేదు. ముందుగా ఫ్లాట్‌ ఎదుట అతనిపై భర్త కర్రతో దాడి చేశాడు. ముందుకు తోసుకుంటూ వెళ్లి మరీ కొట్టడం ప్రారంభించాడు. డెలివరీ బాయ్‌ తప్పించుకుని బయటకు వెళ్లేందుకు ట్రై చేస్తుండగా.. భార్య సైతం కర్రతో దాడి చేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ ఘటన సోషల్‌ మీడియాలోకి వచ్చింది.

ఈ దారుణ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. డెలివరీ బాయ్‌, జొమాటో ప్రతినిధులు సదరు దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం మరిచి సాటి మనిషిపై ఇలా విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంపై సోషల్‌ మీడియా సమాజం దుమ్మెత్తి పోస్తోంది.

Story first published: Monday, October 5, 2026, 10:31 [IST]
Desktop Bottom Promotion