Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
వెనిజులాలో భారీ భూకంపాల బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు,వేలల్లో మరణాలు!..వీడియోలు చూడండి
భూమాత ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. రెండు వేర్వేరు ఖండాల్లోని దేశాలను తన ప్రళయతాండవంతో వణికించింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాతో పాటు ఆసియా దేశమైన జపాన్ దేశాలు భారీ భూకంపాల ధాటికి ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా వెనిజులాలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు వందేళ్లలో కనీవినీ ఎరుగని మహా విధ్వంసాన్ని సృష్టించాయి. నిమిషాల వ్యవధిలోనే బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోగా, ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

వెనిజులాలో కనీవినీ ఎరుగని విధ్వంసం
వెనిజులా కరేబియన్ తీరంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజలంతా తమ పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ ఈ భయంకరమైన విపత్తు ముంచుకొచ్చింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని కారకాస్ కు పశ్చిమాన 168 కిలోమీటర్ల దూరంలో మొరోన్ తీరప్రాంత పట్టణానికి సమీపంలో తొలి భూకంపం సంభవించింది. 22 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 (కొన్ని నివేదికల ప్రకారం 7.2) గా నమోదైంది.
జనం తేరుకునే లోపే కచ్చితంగా ఒక్క నిమిషం వ్యవధిలోనే అంతకంటే శక్తివంతమైన రెండో భూకంపం అదే ప్రాంతంలో విరుచుకుపడింది. మొరోన్ కు నైరుతి దిశలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఏర్పడిన ఈ ప్రకంపనల తీవ్రత ఏకంగా 7.5గా నమోదైంది.
గత వందేళ్ల చరిత్రలో వెనెజువెలాను ముంచెత్తిన అత్యంత భయంకరమైన భూకంపాలు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకంపనల తీవ్రత ఎంతలా ఉందంటే.. దాదాపు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది.
కళ్లెదుటే కుప్పకూలిన ఇళ్లు.. హాహాకారాలు
భూకంపం ధాటికి రాజధాని కారకాస్ నగరంలోని అల్టామైరా ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. భారీ భవనాలు ఊగిసలాడాయి. గోడలు పగిలిపోయి లోపల ఉన్న ఫర్నిచర్ రోడ్లపై పడిపోయింది. నగరంలో దుమ్ము, ధూళి మేఘాల్లా కమ్ముకున్నాయి. అప్పటివరకు రద్దీగా ఉన్న రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాల నుంచి జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. చాలామంది తమ పెంపుడు జంతువులను హత్తుకుని, బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్లపైనే గడిపారు. విద్యుత్ స్తంభాలు నేలకూలడం, మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోవడంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది.
1821లో స్పెయిన్ నుంచి వెనిజులాకు స్వాతంత్ర్యం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సెలవుదినం కావడంతో, చాలామంది ఇళ్లలోనే వేడుకల్లో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ విపత్తు రావడంతో ప్రాణనష్టం భారీగా (వేలల్లో) ఉండొచ్చని యూఎస్‌జీఎస్ అంచనా వేస్తోంది.
విమానాశ్రయంలో గందరగోళం.. అత్యవసర పరిస్థితి విధింపు
భూకంపం సమయంలో కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయానక వాతావరణం నెలకొంది. పైకప్పు నుంచి దుమ్ము రాలడం, లైట్లు ఆరిపోవడం.. భవనం తీవ్రంగా ఊగిపోతుండటంతో ప్రయాణికులు తమ లగేజీ వదిలేసి టెర్మినల్ నుంచి బయటకు పరుగులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఫుడ్ కౌంటర్ల కింద తలదాచుకున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కబెల్లో మాట్లాడుతూ.. ఆఫ్టర్ షాక్స్ వచ్చే ప్రమాదం ఉంది, ఎవరూ ఇళ్లలోకి వెళ్లొద్దు. అంబులెన్సులు, రెస్క్యూ వాహనాల కోసం రోడ్లను ఖాళీ చేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో బాధితులకు సంఘీభావం తెలుపుతూ, దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికా పసిఫిక్ సెంటర్.. వర్జిన్ దీవులు, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టో రికో దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
జపాన్ నూ వదలని భూకంపం
వెనెజులా విపత్తు మరువకముందే.. జపాన్‌లో గురువారం ఉదయం మరో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో 64 కిలోమీటర్ల లోతులో, ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతం కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూమి కంపించింది. అమోరి ప్రిఫెక్చర్‌లోని హషికామి పట్టణంతో పాటు రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు రావడంతో ప్రజలు కొద్దిసేపు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అయితే, సకాలంలో స్పందించిన జపాన్ ప్రభుత్వం సునామీ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాని సనాయె తకాయిచి ఎక్స్ వేదికగా ప్రజలకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ, ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మొత్తం మీద, ఒకే సమయంలో రెండు దేశాలపై ప్రకృతి పగబట్టినట్లు విరుచుకుపడటం యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వెనిజులాలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.



Click it and Unblock the Notifications