బోనాల నుండి బతుకమ్మ దాకా..తెలంగాణ వానాకాల పండగలు,ప్రాముఖ్యత,తేదీలు,ఆచారాలు

తెలంగాణ రాష్ట్రం కేవలం దాని విశాలమైన భూభాగం, నైపుణ్యంతో కూడిన నిర్మాణాలు, రుచికరమైన వంటకాలకు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక వైభవానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ వైభవం వర్షాకాలంలో మరింతగా ప్రకాశిస్తుంది..ఎందుకంటే ఈ సమయంలో రాష్ట్రం వివిధ పండుగలతో కళకళలాడుతుంది. వర్షపు చినుకులు భూమిని తడిపి, ప్రకృతికి నవజీవం పోసే వేళ తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పండుగలను జరుపుకుంటారు.

తెలంగాణలోని వర్షాకాలపు పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు అవి రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, ప్రజల నమ్మకాల సజీవ ప్రతిబింబాలు. ఈ పండుగలు తెలంగాణకు ప్రత్యేక సౌందర్యాన్ని, ఆధ్యాత్మికతను అందిస్తాయి, రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయి. వర్షాకాలం వచ్చిందంటే తెలంగాణలో పండుగల సందడి మొదలైనట్టే ఇది ప్రతి ఒక్కరినీ తమ సాంస్కృతిక మూలాలకు చేరువ చేస్తుంది.

Telangana Festivals During Monsoon Full List Dates Rituals and Significance in telugu

బోనాలు-అమ్మ దీవెనలకై ఆషాఢ మాసం

తెలంగాణ వర్షాకాలపు పండుగల పరంపర ఆషాఢ మాసంలో బోనాలతో ప్రారంభమవుతుంది. ఈ పండుగ ప్రధానంగా గ్రామ దేవతలకు, ముఖ్యంగా మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె దీవెనలు కోరుతూ జరుపుకుంటారు. బోనం అంటే భోజనం లేదా నైవేద్యం అని అర్థం. మహిళలు తమ తలలపై మట్టి కుండలలో వండిన అన్నం, పాలు, బెల్లం మిశ్రమాన్ని పోతురాజులు, శివసత్తుల నాట్య ప్రదర్శనల మధ్య మోసుకుని దేవాలయాలకు ఊరేగింపుగా వెళ్ళడం ఈ పండుగలోని ముఖ్య ఆకర్షణ. ఈ కుండలను పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అలంకరిస్తారు.

బోనాల పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా లాల్ దర్వాజాలోని మహంకాళి దేవాలయం, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలలో ఈ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. భక్తులు తమ కోరికలు తీరినందుకు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. పోతురాజులు (అమ్మవారి దూతలుగా భావించే పురుషులు) తమ దేహాలను నృత్యంతో కంపింపజేస్తూ ప్రజల నమ్మకాన్ని, భక్తిని ప్రతిబింబిస్తారు. శివసత్తులు శక్తి ఆవహించిన వారిలా ఊగిపోతూ భవిష్యవాణి పలుకుతారు. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, సమాజ ఐక్యతను, సంప్రదాయాలను సజీవంగా ఉంచే ఒక సామాజిక వేడుక కూడా. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి ప్రజలను రక్షించమని అమ్మవారిని వేడుకోవడం బోనాల పండుగలోని ముఖ్య ఉద్దేశ్యం. బోనాలు పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బోనాలు పండుగ జూన్ 29న ప్రారంభమవగా..జులై 20,2025న ముగుస్తుంది.

పోలాల అమావాస్య-వ్యవసాయ పనులకి సంకేతం

బోనాల తర్వాత వచ్చే పండుగలలో ఒకటి పోలాల అమావాస్య. ఈ పండుగ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా రైతులు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున రైతులు తమ ఎద్దులను, వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. వర్షాకాలంలో భూమి దున్ని, నాట్లు వేయడంలో ఎద్దుల పాత్ర ఎంతో కీలకం. వాటికి కృతజ్ఞతలు తెలుపుతూ వాటి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. రైతులు తమ ఎద్దులను అలంకరించి, ఊరేగిస్తారు. ఇది ప్రకృతితో మానవుడికున్న గాఢమైన సంబంధానికి, ముఖ్యంగా వ్యవసాయ సంస్కృతికి ప్రతీక. ఈ ఏడాది జులై 24న ఈ పండుగను జరుపుకుంటారు.

వినాయక చవితి-బుద్ధి ప్రదాతకు స్వాగతం

తెలంగాణలో వర్షాకాలంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. భాద్రపద మాసంలో వచ్చే ఈ పండుగను గణేశుని పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇంటింటా గణపతి విగ్రహాలను ప్రతిష్టించి, 1, 3, 5, 7 లేదా 9 రోజులు పూజిస్తారు. ఈ పండుగలో అత్యంత ఆకర్షణీయమైన భాగం వివిధ పరిమాణాలలో, రంగులలో తయారు చేయబడిన మట్టి గణపతి విగ్రహాలు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లో ఖైరతాబాద్ ఏరియాలోని గణేష్ ఉత్సవాలు దేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. లడ్డూలు, మోదకాలు వంటి తీపి వంటకాలు, పూలు, పత్రాలతో గణేశుడిని పూజించడం ఈ పండుగలోని ముఖ్య ఆచారం. ఈ పండుగ ఆధ్యాత్మిక ఆనందంతో పాటు, సమాజంలో ఐక్యతను, సహకారాన్ని పెంపొందిస్తుంది. ఖైరతాబాద్ గణపతితో పాటు బాలాపూర్ ఏరియాలో ప్రతిష్ఠించే వినాయకులను లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ జరిగే లడ్డూ వేలంపాట కూడా చాలా ఫేమస్. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయినా గణపతి లడ్డూ వేలంపాటలో దక్కించుకుునేందుకు భక్తులు ఎగబడతారు. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకుంటారు.

Telangana Festivals During Monsoon Full List Dates Rituals and Significance in telugu

బతుకమ్మ- పూల పండుగ, తెలంగాణ ఆత్మ

తెలంగాణ వర్షాకాలపు పండుగల పరంపరలో అత్యంత అద్భుతమైనది, రంగులమయమైనది బతుకమ్మ. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడింది. వర్షాకాలం చివరలో, ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు ఈ పూల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ అంటే జీవిత దేవత అని అర్థం. ఈ పండుగ ప్రకృతి ఆరాధనకు, మహిళల సృజనాత్మకతకు ప్రతీక. మహిళలు వివిధ రకాల స్థానిక పూలు..గునుగు, తంగేడు, బంతి, చామంతి మొదలైనవాటితో జాగ్రత్తగా, నైపుణ్యంతో బతుకమ్మలను (పూలతో కూడిన గోపురం ఆకారపు పేర్చడం) తయారు చేస్తారు. ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని..మలీద, సద్దుల బతుకమ్మ రోజు వివిధ రకాల అన్నాలు) తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం, మహిళలు రంగుల చీరలు ధరించి, బతుకమ్మలను మధ్యలో ఉంచి, వాటి చుట్టూ చప్పట్లతో, సాంప్రదాయ పాటలతో ఆడుతారు. ఈ పాటలు తెలంగాణ సంస్కృతిని, జీవితాన్ని, భక్తిని ప్రతిబింబిస్తాయి. తొమ్మిదవ రోజున, సద్దుల బతుకమ్మ రోజు, అన్ని బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కుంటలలో నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ పండుగ ప్రకృతి పట్ల గౌరవాన్ని, మహిళల సాధికారతను చాటుతుంది. వర్షాకాలం తర్వాత భూమి కొత్త పూలతో, పచ్చదనంతో నిండినప్పుడు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కుటుంబ బంధాలను, సామాజిక అనుబంధాలను బలపరుస్తుంది. ఈ పండుగ తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపును తెస్తుంది, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తుంది. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 29,2025 వరకు జరుగుతాయి. దుర్గాష్ఠమికి 1 రోజు ముందు బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.

Telangana Festivals During Monsoon Full List Dates Rituals and Significance in telugu

తెలంగాణలో నాగపంచమి ప్రాముఖ్యత

తెలంగాణలో నాగపంచమి పండుగ వర్షాకాలంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ. ఇది ప్రకృతిలోని జీవుల పట్ల గౌరవాన్ని, వాటితో మానవుల సహజీవనాన్ని తెలియజేసే ఒక పండుగ. ఇది శ్రావణ శుద్ధ పంచమి నాడు వస్తుంది.ఈ ఏడాది జులై 29న నాగపంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున నాగదేవతను, పాములను పూజిస్తారు. వర్షాకాలంలో పొలాల్లో, పొదల మధ్య పాములు ఎక్కువగా సంచరిస్తాయి. వాటి వలన ఎలాంటి హాని జరగకూడదని, పంటలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ నాగదేవతను పూజించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణలో నాగపంచమికి అనేక నమ్మకాలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. సర్పదోషాలు ఉన్నవారు నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం ఉన్నవారు ప్రత్యేక పూజలు చేస్తారు. పాములు రైతుల మిత్రులుగా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి పొలాల్లోని ఎలుకలు, ఇతర కీటకాలను నియంత్రిస్తాయి. నాగపంచమి రోజున పాములను పూజించడం ద్వారా పంటలు పురుగుల బారి నుండి రక్షించబడతాయని రైతులు విశ్వసిస్తారు.

తెలంగాణలో నాగపంచమి జరుపుకునే విధానం

పుట్ట దగ్గర పూజ: ఈ పండుగ రోజున భక్తులు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, సమీపంలోని పుట్టల వద్దకు వెళతారు. అక్కడ నాగదేవతకు పాలు, గుడ్లు, పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేద్యంగా అరటిపండ్లు, బియ్యపు పిండితో చేసిన పాలతాలుకలు, చలిమిడి వంటివి సమర్పిస్తారు. ఈ నైవేద్యాలను పాములు స్వీకరిస్తాయని నమ్ముతారు.

నాగ ప్రతిమల పూజ: కొందరు ఇంట్లోనే నాగదేవత విగ్రహాలను లేదా పటాలను ఏర్పాటు చేసుకుని పూజిస్తారు. ఇత్తడి లేదా మట్టితో చేసిన నాగ విగ్రహాలకు పాలు పోసి, పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.

నైవేద్యాలు: గోధుమ పిండితో లేదా బియ్యపు పిండితో పాము ఆకారంలో బొమ్మలు చేసి వాటిని వేయించి లేదా ఆవిరిపై ఉడికించి నైవేద్యంగా సమర్పిస్తారు. నువ్వులు, బెల్లంతో కలిపి చేసిన పదార్థాలను కూడా నైవేద్యంగా పెడతారు.

నోములు/వ్రతాలు: కొందరు మహిళలు నాగదేవత అనుగ్రహం కోసం నాగపంచమి రోజున ఉపవాసం ఉంటారు లేదా నోములు ఆచరిస్తారు.

మహిళల భాగస్వామ్యం: ఈ పండుగలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన వారు, పిల్లలు కావాలనుకునేవారు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

నాగపంచమి ప్రత్యేకతలు

రైతుల సంప్రదాయం: తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కాబట్టి, రైతులు తమ పొలాలను, పంటలను కాపాడమని నాగదేవతను వేడుకుంటారు.

సాంస్కృతిక వారసత్వం: నాగారాధన అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. తెలంగాణలో ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక భాగంగా కొనసాగుతోంది.

Telangana Festivals During Monsoon Full List Dates Rituals and Significance in telugu

వరలక్ష్మీ వ్రతం

తెలంగాణలో వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది వివాహిత మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనది.. ఎందుకంటే ఈ వ్రతం అష్టైశ్వర్యాలను, సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు వీలు కాకపోతే ఆ శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చు. తెలంగాణలో వరాలిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు.

అష్టలక్ష్ములు అంటే..

ధనలక్ష్మి..సంపదను ప్రసాదించేది
ధాన్యలక్ష్మి.. ధాన్యం, ఆహార సమృద్ధిని ఇచ్చేది.
ధైర్యలక్ష్మి.. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది.
విజయలక్ష్మి.. విజయాన్ని, కార్యసిద్ధిని ప్రసాదించేది.
సంతానలక్ష్మి: మంచి సంతానాన్ని అనుగ్రహించేది.
గృహలక్ష్మి: గృహ సౌభాగ్యాన్ని, శాంతిని కలుగజేసేది.
విద్యా లక్ష్మి: జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించేది.
ఆదిలక్ష్మి: అన్నింటికీ మూలమైన, శాశ్వతమైన లక్ష్మి.

ఈ అష్టైశ్వర్యాల కోసం మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త దీర్ఘాయుష్షు, పిల్లల ఉన్నతి, కుటుంబ సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతంని ఆగస్టు 8న జరుపుకుంటారు.

Desktop Bottom Promotion