Akhanda 2 Movie Review: అఖండ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

By Rajababu A

Rating:
2.0/5

నటీనటులు: గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
రిలీజ్ డేట్: 2025-12-12

చైనాకు చెందిన మిలిటరీ భారత్‌‌పై దాడి చేసి సమగ్రతను దెబ్బ తీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత (కబీర్ సింగ్) చేతులు కలుపుతాడు. మహ కుంభమేళాను టార్గెట్ చేసి గంగానదిలో వైరస్ కలుపుతారు. ఈ క్రమంలో బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురు జననీ (హర్షాలీ) వైరస్‌కు వాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్‌ను, జననీని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అఖండ (బాలకృష్ణ) ఎంట్రీ ఇస్తాడు.

బాల మురళీ కృష్ణ ఎవరు? 17 ఏళ్ల వయసులోనే జననీ యువ సైంటిస్టుగా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది? భారత్‌పై చైనా దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు? అఖండ అస్థిత్వం ఏమిటి? హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరిపోరాటం ఏమిటి? చైనా దుష్ట శక్తులను అఖండ ఎలా కాలరాచాడు అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం సినిమా కథ.


Akhanda 2 Review and Rating

అఖండ సినిమా ఫస్టాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపైన కనిపిస్తాడు తప్పా.. బాలకృష్ణ చేసేది ఏమీ ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియెన్స్ కోసం ఫైట్, పాటతో సరిపెట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా, టిబెట్, మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతుందా? అనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపైన విధ్వంసం సృష్టించారు. ఇంతకుమించి సినిమాలో చెప్పుకొనే కొత్త విషయం ఏమీ ఉండదు.

ఇక సెకండాఫ్‌లో మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగిపోతాయి. ఆది పినిశెట్టి ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ, ఆది పినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండటమే కాకుండా ఈ సినిమాకు ఇది అవసరమా? అనే అనుమానం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మం బోదనలతో బోయపాటి శ్రీను విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఈ సినిమా ఊహకు అందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది. అఖండ మిగిల్చిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిపేసే ప్రయత్నం చేసిందనిపిస్తుంది.

బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే.. ఫస్టాఫ్‌లో ఆయన రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు. సెకండాఫ్‌లో కొంత మేరకు ఎలివేషన్స్‌తో మాస్ ఆడియెన్స్‌లో జోష్ పుట్టిస్తాడు. కానీ అది కూడా కొంత సేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్‌లో కనిపిస్తుంది. సంయుక్త మీనన్ రోల్‌కు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదు. మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే అవకాశమే కనిపించదు. హర్షాలీ పాత్ర కూడా అంతగా ఆకట్టుకొదు. ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్ సింగ్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. ఇక మిగితా పాత్రల్లో, విలన్ పాత్రల్లో కనిపించిన వారంతా పేలవమైన నటనతో సరిపెట్టుకొన్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అఖండతో సంగీత ప్రభంజనం చూపించిన తమన్ అఖండ తాండవంలో నిరాశపరిచాడు. కొన్ని సీన్లు తప్పా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా రొటీన్‌గానే ఉంటుంది. సీ రాంప్రసాద్, సంతోష్ కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ ఇమేజ్‌కు తగినట్టుగా లాజిక్ లేకుండా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారా అనిపిస్తుంది.

ఫైనల్‌గా అఖండ తాండవం గురించి చెప్పాలంటే.. అఖండ చిత్రంలో కథ, కథనాలు, ఎమోషన్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కావడంతో ఆ సినిమాను బ్లాక్ బస్టర్‌గా మార్చింది. అఖండకు ఏవైతే బలంగా మారాయో.. తాండవానికి అవే మైనస్ అయ్యాయి. పొంతన లేని కథ, కథనాలు, ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్. బాలకృష్ణ ఎలివేషన్ మినహాయిస్తే.. టోటల్ ఈ సినిమా నిరాశ పరిచే చిత్రమే.

Credit: Filmibeat

Desktop Bottom Promotion