బైక్ లాగా మైలేజ్ ఇచ్చే కారుకు మంచి డిమాండ్.. ఊహించని విధంగా పెరిగిన కొత్త కస్టమర్లు

By Dubasi Harish

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ప్రస్తుతం భారతీయ SUV మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న కార్లలో ఒకటిగా నిలుస్తోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి మైలేజ్ వంటి అంశాలతో ఈ కారు వినియోగదారుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. అందుకే రోజురోజుకూ ఈ కారుపై డిమాండ్ పెరుగుతూనే ఉంది. కుటుంబ అవసరాల నుంచి లాంగ్ డ్రైవ్స్ వరకు అన్ని రకాల వినియోగానికి సరిపోయే SUVగా గ్రాండ్ విటారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు ప్రతిబింబంగా డిసెంబర్ 2025 నెలలో గ్రాండ్ విటారా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఆ ఒక్క నెలలోనే మొత్తం 8,597 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.

గత సంవత్సరం ఇదే సమయంలో, అంటే డిసెంబర్ 2024లో, ఈ కారు 7,093 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. ఈ రెండు గణాంకాలను పోల్చి చూసినప్పుడు, సంవత్సరానికి అమ్మకాలు 21.20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా మార్కెట్‌లో ఎంత బలంగా నిలబడిందో చెప్పే ప్రధాన సూచికగా చెప్పవచ్చు. డిసెంబర్ నెలలో గ్రాండ్ విటారా అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.

Maruti Suzuki Grand Vitara December 2025 Sales Recorded 8597 More Details Inside

ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన GST సవరణ ఈ కారుపై కీలక ప్రభావం చూపింది. పన్నుల్లో మార్పుల కారణంగా గ్రాండ్ విటారా ధరను కొంత మేర తగ్గించడం జరిగింది. దీంతో ఈ SUV ధర పరంగా మరింత ఆకర్షణీయంగా మారింది. ఇప్పటికే ఫీచర్లు, బ్రాండ్ నమ్మకంతో వినియోగదారులలో మంచి పేరు ఉన్న ఈ కారుకు ధర తగ్గింపు కలిసి రావడంతో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు.

అదనంగా, ఫెస్టివ్ సీజన్ ప్రభావం కూడా అమ్మకాల పెరుగుదలకు తోడ్పడింది. డిసెంబర్ నెలలో కొత్త వాహనం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మారుతి సుజుకి అందించిన ఆకర్షణీయమైన ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్స్ కూడా కొనుగోలుదారులను మరింత ప్రోత్సహించాయి. ఈ అన్ని అంశాలు కలిసి గ్రాండ్ విటారా అమ్మకాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Maruti Suzuki Grand Vitara December 2025 Sales Recorded 8597 More Details Inside

మారుతి సుజుకి గ్రాండ్ విటారా పోటీ ధరలతో కస్టమర్లకు అందుబాటులో ఉండటం కూడా దీని విజయానికి మరో ప్రధాన కారణం. ఈ SUV ధర రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రీమియం కార్లు కోరుకునే వినియోగదారుల వరకు ఆకర్షిస్తోంది. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులోని 1.5 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 103 bhp హార్స్‌పవర్‌తో పాటు 139 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు, హైవే డ్రైవింగ్‌కు సరిపడా పవర్‌ను అందిస్తుంది. అదే విధంగా, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్(పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఈ హైబ్రిడ్ యూనిట్ 115 bhp హార్స్‌పవర్, 141 Nm టార్క్‌ను అందిస్తుంది.

Maruti Suzuki Grand Vitara December 2025 Sales Recorded 8597 More Details Inside

తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి 1.5 లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్‌ను అందిస్తోంది. ఇది 88 bhp పవర్, 121 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ రోజువారీ వినియోగానికి సరిపడా పనితీరును అందిస్తుంది. ఈ అన్ని ఇంజిన్ వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, హైబ్రిడ్ మోడళ్లలో 6-స్పీడ్ ఆటోమేటిక్ e-CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడ్డాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 27.97 కి.మీ/లీ వరకు మైలేజ్‌ను అందించడం విశేషం.

Credit: Drivespark

Story first published: Sunday, January 11, 2026, 9:32 [IST]
Desktop Bottom Promotion