మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.!

మనిషి జీవితంలో పసిప్రాయం ఎంతో విలువైనది. ఆ వయసులో చిన్నపిల్లల మనసులో చాలా విషయాలు నాటుకుపోతాయి. అవి సంతోషం, బాధ, సున్నితమైన అంశాలు ఏవైనా కావచ్చు.. అవే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే పిల్లలు తమ వయసులో ఎలా ఉంటున్నారు.. వారి సంతోషం, దుఃఖం ఇలా ప్రతిదానికీ కారణాలు తెలుసుకోవడం తల్లిదండ్రులకు చాలా అవసరం. ఈ క్రమంలో పీడియాట్రిక్ నిపుణుల సలహా ప్రకారం.. పిల్లలు ఎక్కువగా బాధపడే సందర్భాలను తెలుసుకోవడం చాలా అవసరమని అంటున్నారు. వారు ఆ బాధ నుంచి బయటపడటానికి తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

Your children mostly suffer because of these five reasons

పేరెంట్‌ మధ్య కలహాలు

పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉండటం చాలా అవసరం. కానీ అప్పుడప్పుడూ భార్యాభర్తల మధ్య గొడవలు, అభిప్రాయభేదాలు రావడం సహజం. కానీ ఆ ప్రభావం పిల్లలపై ఖచ్చితంగా పడుతుంది. దీంతో పిల్లల్లో భయం, ఆందోళన, అసహనం పెరిగి వారి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. వారి ప్రవర్తన మారుతుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు వ్యక్తిగతంగా గొడవలు ఉన్నా.. వాటిని పిల్లల ముందు ప్రదర్శించకుండా చూసుకోండి.

పోలిక

పిల్లలు ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే దశ ప్రారంభమయ్యాక.. వారిని ఇతరులతో పోల్చడం ఎక్కువవుతుంది. చదువు, పర్ఫామెన్స్, ప్రతిభ, గుణగణాలు ఇలా పలు విషయాల్లో మీ పిల్లలను ఇతరులతో పోలుస్తుంటారు. ఇది వారి భవిష్యత్తుతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. దానిని గుర్తించి పేరెంట్స్‌ సపోర్ట్‌ ఇవ్వాలి. లేదంటే మీ అంచనాలను అందుకునే ప్రయత్నంలో వారు చాలా కోల్పోవచ్చు.

Your children mostly suffer because of these five reasons

ఒత్తిడి, ఓటమి

పిల్లల జీవితంలో ముఖ్యమైన భాగం చదువు, పరీక్షలు. చాలా మంది చిన్నారుల పరీక్షల ఫలితాల ఆధారంగా వారి జీవితాన్ని అంచనా వేస్తుంటారు. గెలుపోటములు వారి విజయానికి ప్రామాణికం కాదు. వారు పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదు. లేదంటే ఈ ఒత్తిడి, ఇతరులతో పోలిక, పోటీ వారిలో ఆందోళన పెంచుతుంది. పేరెంట్స్‌, టీచర్స్‌ ఆశించిన మార్కులు రాకపోతే పిల్లల్లో ఓడిపోయామనే భావన కలుగుతుంది. దీంతో నిరుత్సాహంతో కుమిలిపోతుంటారు. అలా కాకుండా వారు ప్రస్తుత ఓటమికి గురికాకుండా, మరోసారి విజయం సాధించాలనే పాజిటివిటీని వారిలో కలిగించండి.

ఫ్రెండ్స్‌తో దూరం

పిల్లల జీవితం, భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపించేది స్నేహితులు. స్కూల్‌లో, బయట వారికి ఫ్రెండ్స్‌ దొరకవచ్చు. అయితే ఒక్కోసారి రూపం, సంభాషణ, చదువు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తోటి పిల్లలు వారిని ఎగతాళి చేయవచ్చు. దీంతో వారిని దూరం పెట్టొచ్చు. వారి వారిని ఎంతో బాధకి గురిచేస్తుంది. దీంతో వారు ఇంట్లో పేరెంట్స్‌కి కూడా చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోతారు. తల్లిదండ్రులు ఈ మార్పును గమనించి వారిలో ఒంటరితనం, ఆత్మన్యూనతని దూరం చేయాలి.

కుటుంబంతో సమయం, గుర్తింపు

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. కానీ ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు సమయం ఇవ్వాలి. ఆ సమయంలో ప్రేమ, గుర్తింపు చాలా కీలకం. వారి విజయాలను పేరెంట్స్‌తో పంచుకోవాలని పిల్లలు ఆరాటపడుతుంటారు. దానిని తల్లిదండ్రులు పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. లేదంటే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. వారి ప్రతిభను, సంతోషానికి కారణాలను గుర్తించి చిన్నపాటి అభినందన, ప్రశంస ఇచ్చినా వారు ఎంతో పొంగిపోతారు.

Story first published: Saturday, October 3, 2026, 13:05 [IST]
Desktop Bottom Promotion