పాస్‌ వర్డ్‌ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే!

డిజిటల్ యుగంలో మన ఆన్‌ లైన్ అకౌంట్లను హ్యాకర్ల బారి నుండి కాపాడుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది. అయితే మీ పాస్‌ వర్డ్‌ లో ఒక చిన్న కామా పెడితే చాలు.. వెబ్‌ సైట్ డేటా లీక్ అయినా మీ వివరాలు సురక్షితంగా ఉంటాయని ఎవరైనా చెబితే నమ్ముతారా? వినడానికి ఇదొక తెలివైన ఆలోచనలా అనిపించినా, ఇది నిజంగా పనిచేస్తుందా? ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్(X)లో ఇటీవల వైరల్ అయిన ఒక పోస్ట్ ఈ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

వైరల్ అవుతున్న ఆ కామా ట్రిక్ ఏంటి?

నవంబర్ 12న ఎక్స్‌ లో @lavemowill అనే హ్యాండిల్‌ తో విలియం అల్వెస్ అనే వినియోగదారు పోర్చుగీస్ భాషలో ఒక పోస్ట్ చేశారు. మీ పాస్‌ వర్డ్స్ లో ఎల్లప్పుడూ కామా (,) పెట్టండి. ఒకవేళ అవి ఎప్పుడైనా డేటా లీక్‌ కు గురైతే, అది CSVని దెబ్బతీస్తుంది అని అందులో పేర్కొన్నారు.

Fact Check Does Putting a Comma in Your Password Really Stop Hackers

సాధారణంగా యూజర్‌ నేమ్స్, ఈమెయిల్ అడ్రస్‌ లు, పాస్‌ వర్డ్‌ ల వంటి సమాచారాన్ని స్టోర్ చేయడానికి CSV (కామా సెపరేటెడ్ వాల్యూస్) అనే ఫైల్ ఫార్మాట్‌ ను వాడుతారు. ఇందులో ప్రతి వివరాన్ని వేరు చేయడానికి కామాలను ఉపయోగిస్తారు.

ఒకవేళ లీక్ అయిన డేటాను సరిగ్గా ఫార్మాట్ చేయని CSV ఫైల్‌ లో సేవ్ చేస్తే, పాస్‌ వర్డ్‌ లో ఉన్న కామాను సాఫ్ట్‌ వేర్ సెపరేటర్‌ గా పొరబడుతుందని ఈ పోస్ట్ ఉద్దేశం. దీనివల్ల ఆ సమాచారం తప్పుడు కాలమ్‌ లలోకి వెళ్లిపోయి, హ్యాకర్లు ఆ ఫైల్‌ ను చదవడం కష్టమవుతుందని భావించారు. ఏజీటీపీ ఇన్‌ సైట్స్ అనే టెక్ అకౌంట్ దీనిని తమ ఫాలోవర్లతో పంచుకోవడంతో ఇది క్షణాల్లో వైరల్ అయింది.

నిపుణుల విశ్లేషణ

ఈ వాదనపై ఎక్స్ లోని ఏఐ చాట్‌ బాట్ గ్రోక్.. CSV ఫైల్‌ లోని ఫీల్డ్‌ ల చుట్టూ కొటేషన్ మార్కులు లేకపోతే మాత్రమే ఈ ట్రిక్ పనిచేస్తుందని తెలిపింది. కానీ వాస్తవంగా సరిగ్గా తయారుచేసిన CSV ఫైల్స్‌ లో కామాలు ఉన్న సమాచారం చుట్టూ కొటేషన్ మార్కులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, "pass,word" అనే పాస్‌ వర్డ్‌ ను ఆధునిక సాఫ్ట్‌ వేర్ ఇప్పటికీ ఒకే ఎంట్రీగా చదువుతుంది తప్ప, ఫైల్‌ ను విచ్ఛిన్నం చేయదు.

దీనికి తోడు, ఈ ఐడియా సేఫ్టీ ఇవ్వకపోవడానికి మరో బలమైన కారణం ఉంది. నమ్మకమైన వెబ్‌ సైట్‌ లు ఏవీ పాస్‌ వర్డ్‌ లను సాధారణ టెక్స్ట్ రూపంలో సేవ్ చేయవు. దానికి బదులుగా, పాస్‌ వర్డ్‌ ను కోడెడ్ రూపంలోకి మార్చే హాష్(Hash) చేసిన వెర్షన్‌ ను మాత్రమే స్టోర్ చేస్తాయి. కాబట్టి అసలు పాస్‌ వర్డ్‌ లో కామా ఉండటం వల్ల, ఆ రికార్డులను దొంగిలించే హ్యాకర్లకు ఎలాంటి గందరగోళం కలగదు. అంతేకాకుండా కొన్ని వెబ్‌ సైట్‌ లు అసలు పాస్‌ వర్డ్‌ లలో కామాలను అనుమతించవు కూడా.

India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా?India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా?

అకౌంట్ లను సురక్షితంగా ఉంచుకోవడం ఎలా?

ఇలాంటి విరామ చిహ్నాల ట్రిక్స్‌ పై ఆధారపడకుండా, నిపుణులు సూచించే సురక్షిత మార్గాలను పాటించాలి.

పొడవైన, విభిన్న పాస్‌ వర్డ్‌: ప్రతి అకౌంట్ కు ప్రత్యేకమైన, పొడవైన పాస్‌ వర్డ్‌ ను పెట్టుకోండి.

పాస్‌ వర్డ్ మేనేజర్: అన్ని పాస్‌ వర్డ్‌ లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, వాటిని సృష్టించుకోవడానికి, భద్రపరచుకోవడానికి పాస్‌ వర్డ్ మేనేజర్ ఉపయోగించండి.

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA): దీనిని ఆన్ చేయడం వల్ల లాగిన్ సమయంలో అదనపు చెకింగ్ జరుగుతుంది. ఒకవేళ మీ పాస్‌ వర్డ్ హ్యాకర్లకు తెలిసినప్పటికీ, వారు మీ అకౌంట్ లోకి ప్రవేశించడం చాలా కష్టమవుతుంది.

Story first published: Friday, November 13, 2026, 23:08 [IST]
Desktop Bottom Promotion