అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!

Posted By:

బిర్యానీ అనగానే మనకు వెంటనే హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ ప్రాంతాలను బట్టి బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మొఘలాయి, చెట్టినాడ్, షెజ్వాన్ వంటి వాటితో పాటు తమిళనాడుకే తలమానికంగా నిలిచే అంబూర్ బిర్యానీకి దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో వాడే జీలకర్ర సంబా బియ్యం.

ఈ బియ్యం వల్లే అంబూర్ బిర్యానీకి ఆ అద్భుతమైన రుచి, సువాసన వస్తాయి. మరి అంతటి రుచికరమైన అంబూర్ చికెన్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్‌ లో, మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Ambur Chicken Biryani Easy Home Recipe You Must Try

కావలసిన పదార్థాలు

జీలకర్ర సంబా బియ్యం - 1 కప్పు
చికెన్- అర కేజీ
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
ఎండు మిరపకాయలు - 10
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - తలా 1 టేబుల్ స్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
స్వచ్ఛమైన నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నిమ్మకాయ - సగం ముక్క
దాల్చిన చెక్క - 2
లవంగాలు - 2
యాలకులు - 2
బిర్యానీ ఆకులు - 2
పుదీనా, కొత్తిమీర - తలా ఒక గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా

కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా జీలకర్ర సంబా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. చికెన్‌ను కూడా కడిగి పక్కన పెట్టుకోండి.

-అంబూర్ బిర్యానీకి అసలైన రంగు, ఘాటు ఇచ్చేది ఎండుమిర్చి పేస్ట్. అందుకే 10 ఎండు మిరపకాయలను వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టి, మిక్సీలో కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అడుగు మందంగా ఉన్న కుక్కర్ పెట్టుకుని నూనె, నెయ్యి వేయాలి. అవి వేడెక్కాక మసాలా దినుసులు వేసి సువాసన వచ్చేలా వేయించాలి. ఆ తర్వాత ముందుగా వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, టమోటా ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.

-ఆ మిశ్రమంలో తాజా పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి కాస్త వేయించాక, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్‌ ను వేయాలి. ఈ మసాలా అంతా బాగా వేగాక.. చికెన్ ముక్కలు, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా కాసేపు వేయించి, ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటపై చికెన్‌ను ఉడకనివ్వాలి.

-ఈలోపు మరో స్టవ్ మీద గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి సరిగ్గా రెండు నిమిషాలు ఉడికించాలి. బియ్యం సగం మాత్రమే ఉడకాలి. వెంటనే నీళ్లన్నీ వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు కుక్కర్‌ లో ఉడుకుతున్న చికెన్ గ్రేవీలో.. మనం సగం ఉడికించిన బియ్యాన్ని వేసి సమానంగా సర్దాలి. కుక్కర్ మూతపెట్టి, మంటను సిమ్‌ లో ఉంచి 10 నిమిషాల పాటు దమ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి, కుక్కర్ ఆవిరి దానంతట అదే పోయే వరకు వదిలేయాలి.

-అంతే కుక్కర్ మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడే అద్భుతమైన సువాసనతో అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 15, 2026, 16:43 [IST]
Desktop Bottom Promotion