కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సాయంత్రం కాగానే చల్లటి గాలికి వేడిగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. రోజూ చేసే పకోడీలు, బజ్జీలు కాకుండా కాస్త వెరైటీగా, ఆరోగ్యంగా, అదే సమయంలో నోటికి కమ్మగా అనిపించే స్వీట్ ఏదైనా చేస్తే ఎంత బాగుంటుంది?

మీ ఇంట్లో కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలు, అద్భుతమైన స్వీట్ రవ్వ బోండా తయారు చేయవచ్చు. పైన కరకరలాడుతూ, లోపల తియ్యటి కొబ్బరి-బెల్లం పూర్ణంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ బోండా రుచి అమోఘం.

Crispy Outside Sweet Inside The Ultimate Sweet Rava Bonda Recipe in Telugu

స్వీట్ రవ్వ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు

బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
చక్కెర - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - ఒక చిటికెడు
బిర్యానీ ఆకులు- 2
తురిమిన పచ్చి కొబ్బరి - 1 కప్పు
బెల్లం పొడి - పావు కప్పు
నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు
చక్కెర - 1 టీస్పూన్
యాలకుల పొడి - పావు టీస్పూన్
నూనె-డీప్ ఫ్రై చేయడానికి

స్వీట్ రవ్వ బోండా తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు, చిటికెడు ఉప్పు, బిర్యానీ ఆకులు వేసి మరిగించండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బిర్యానీ ఆకులను తీసేసి, అందులో మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కరిగించండి.

-చక్కెర కరిగిన తర్వాత మంటను సిమ్‌ లో పెట్టి, బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. రవ్వ దగ్గరపడి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌ లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వాలి.

-ఇప్పుడు లోపలి పూర్ణం తయారు చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో పావు కప్పు బెల్లం పొడి వేసి, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కరిగించండి. బెల్లం కరుగుతున్నప్పుడు, తురిమిన కొబ్బరిని వేసి బాగా కలపాలి. ఇందులోనే ఒక స్పూన్ చక్కెర, యాలకుల పొడి చల్లి మిశ్రమం దగ్గరపడేదాకా ఉడికించి స్టవ్ ఆపేయండి. దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నూనె రాసుకుని చపాతీ పిండిలా బాగా వత్తుకోవాలి.

-ఈ రవ్వ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చేతిలో పూరీలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో కొద్దిగా కొబ్బరి పూర్ణం పెట్టి అంచులు మూసేసి రౌండ్‌ గా లేదా కాస్త చదునుగా మీకు నచ్చిన ఆకారంలో బోండాలను తయారుచేసుకోవాలి.

-చివరగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేశాక మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి, బోండాలను నెమ్మదిగా నూనెలో వేయాలి. ఇవి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు దోరగా వేయించి బయటకు తీయాలి.

-అంతే వేడివేడి, నోరూరించే స్వీట్ రవ్వ బోండా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 11, 2026, 13:55 [IST]
Desktop Bottom Promotion